సత్వరమే నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఏకీకృత భవన నిర్మాణ నిబంధనల ముసాయిదాను ప్రభుత్వ వెబ్సైట్లలో ఉంచి భాగస్వాముల అభిప్రాయాలను కోరాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్ణయించింది.వినియోగదారులకు అత్యంత అనుకూలంగా ఉండే ఈ నోటిఫికేషన్‌ను త్వరగా విడుదల చేయాలని మంత్రి వెంకయ్యనాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతమున్న భవన నిర్మాణ నిబంధనలు 1983 నుంచి అమల్లో ఉన్నాయి. అయితే అవి ఎవరికీ అనుకూలంగా లేవని భావిస్తున్నారు. కాగా మంత్రి ఆదేశాల నేపథ్యంలో సంబంధిత శాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ మంగళవారం ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) వైస్‌చైర్మన్, కార్యదర్శితో పాటు ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమిషన్ (డీయూఏసీ) అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు.
డీయూఏసీ... 2013 జన వరిలో రూపొంది ంచిన ఏకీకృత భవన నిర్మాణ నిబంధనల ముసాయిదాను పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ, డీడీఏ, డీయూఏసీ వెబ్సైట్లలో రెండువారాలపాటు ఉంచి అందరి సూచనలు, సలహాలతోపాటు వారి వ్యాఖ్యలను కూడా కోరాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఆ తరువాత నిపుణులు, ఆర్కిటెక్టులు, పౌరసంస్థలతోపాటు వాటాదారులందరితో ఓ వర్క్‌షాపును నిర్వహిస్తారు. ఆవిధంగా అందిన సూచనలు, సలహాలను ఏకీకృత భవన నిర్మాణ నిబంధనల ముసాయిదాలో చేరుస్తారు, దానిని పరిశీలనకోసం నిపుణుల కమిటీకి పంపుతారు. భవన నిర్మాణ నిబంధనలపై పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన నోటిఫికేషన్ మూడు నెలల్లోగా వెలువడుతుందని భావిస్తున్నారు.
ప్రతి పాదిత నిబంధనలు భవన నిర్మాణాలకు అనుమతులను పొందే పద్ధతిని సరళీకరించడంతో పాటు వాటిని వినియోగదారులకు సన్నిహితంగా మారుస్తాయని అంటున్నారు. దీంతోపాటు పర్యావరణ అనుకూల భవనాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తాయని అంటున్నారు. ఇంధన పొదుపును కూడా ప్రోత్సహిస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న 60 రోజుల్లోగా భవన నిర్మాణానికి అనుమతించాల్సి ఉంది. అయితే కఠినమైన నియమనిబంధనల కారణంగా ఆశించినంత సులువుగా జరగడం లేదు. కాగా ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమిషన్ (డీయూఏసీ) ఈ నిబంధనలను రూపొందించిన సంగతి విదితమే.