మా ఆవిడ మాట్లాడదు
మగాళ్లు గమ్మత్తుగా ఉంటారు. ఊ..హు. మగాళ్లు కాదు.. మొగుళ్లు గమ్మత్తుగా ఉంటారు. పోట్లాడుకోడానికి మాటలు కావాలి కానీ.. మాట్లాడుకోడానికి మాటలెందుకు అనుకుంటారు! అలాంటి మొగుడితో మాట్లాడకుండానే పోట్లాడిన ఒక భార్య కథ ఇది.
‘అమ్మా... డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దామనుకుంటున్నాను వినీతను’ అన్నాడు మురళి తల్లితో.తల్లి ఒక్క క్షణం ఏం మాట్లాడలేదు.కొడుకు వైపు అక్కరగా, సమర్ధింపుగా చూసింది.‘భూత వైద్యుడు నయమేమోరా’ అంది.‘దానికి దెయ్యమేమో అని అనుమానం. నా చిన్నప్పుడు మా ఊళ్లో ఆడవాళ్లకు మూగ దెయ్యం పట్టేది. వాళ్లు ఇలాగే ప్రవర్తించేవారు’ మళ్లీ అంది.మురళికి భార్య దగ్గర డాక్టర్ ప్రస్తావన తేవడమే కష్టంగా ఉంది. ఇక భూతవైద్యుడంటే ప్రళయం వచ్చేస్తుంది.‘డాక్టరే బెటరేమోనమ్మా’ అని లేచాడు.మురళికి పెళ్లయ్యి ఒకటిన్నర సంవత్సరం. వినితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ వాక్యాన్ని ఇటు వైపు నుంచి చెప్తే మురళి దయదలిచినట్టు అనిపిస్తుందిగాని వినీత వైపు నుంచి చెప్తే తన అందచందాలకు, రూపానికి వినీతే మురళిని కటాక్షించి పెళ్లి చేసుకుందని చెప్పవచ్చు.మురళికి ఉద్యోగం ఉంది. వినీత ఉద్యోగం వద్దనుకుంది. మురళి తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు. టూ బెడ్రూమ్ ఫ్లాట్ అది. ఒక రూమ్ తల్లిదండ్రులకు, ఒక రూమ్ వీరిద్దరికీ.ఒక సంవత్సరం గడిచింది. కాని వినీతలో ఊహించని మార్పు వచ్చింది.
సంఘటన 1:రైతుబజార్ నుంచి మురళి కూరగాయలు తెచ్చాడు.
వినీత: అర కిలో వంకాయలు తెమ్మంటే కిలో తెచ్చారేం?
మురళి: చీప్‌గా వచ్చాయ్. కిలో అయితే ఏం పోయిందిలే.
వినీత: వంకాయ మీ ఇంట్లో ఎవరూ తినరు. నా కోసం తెమ్మన్నాను. నేనెంత తింటానని. ఇవి కదలవు. ఫ్రిజ్‌లో అడ్డం. ఇక నా నెత్తి మీద పోసుకోవాల్సిందే.మురళి: అంతైతే కొన్ని పనిమనిషికి ఇవ్వు.వినీత: మనం పెద్ద మహరాజులమా దానధర్మాలు చేయడానికి. నేను మామూలు హౌస్‌వైఫ్‌ని. పొదుపు చేయాల్సింది పోయి పారబోస్తుంటే అందరూ నవ్వుతారు.అంతవరకూ ఏ భార్యాభర్తలైనామాట్లాడుకుంటారు.కాని వినీత వెంటనే ఆ వంకాయల కవర్ వరకూ తీసుకెళ్లి బాల్కనీ నుంచి నేరుగా రోడ్డు మీదకు విసిరేస్తుంది. ఇక అలుగుతుంది. మాట్లాడదు. జవాబివ్వదు. బదులు పలకదు. కోపంగా బుసలు కొడుతూఉంటుంది.చిన్నదానికి ఇంత కోపమా. మురళికి హడలు. మురళి తల్లిదండ్రులకు కూడా హడలు.
సంఘటన 2:చీపురు పట్టుకున్న వినీత మెయిన్ డోర్ దగ్గర నిలబడి ‘ఏమండీ’ అని గావుకేక పెట్టింది.మురళి ఉలిక్కిపడి పరిగెత్తాడు.‘ఏంటి’‘చూడండి చెప్పులు ఎలా విడిచారో. ఒకటి బోర్లా పడి ఉంది. చెప్పు బోర్లా పడితే దరిద్రమని తెలియదూ?’‘దాందేముంది... సరిచేయరాదా?’‘ఆ... నాకు ఇదే పని. మీరు దరిద్రాన్ని ఇంటికి తేండి. నేను చిమ్మి అవతల పారేస్తుంటాను’ అరిచింది.‘మీ అమ్మ మాసిన బట్టల్ని బాత్రూమ్లోనే విడిచేస్తుంది. వాషింగ్ మెషీన్ వరకూ తెచ్చి పడేయదు. అదొక దరిద్రం. మీ నాన్న షేవింగ్ చేసుకుని మగ్‌లోని నీళ్లు పారబోయరు అదొక దరిద్రం. మీరు బెడ్ కాఫీ తాగడానికి ముందు పళ్లుతోమరు. అదొక దరిద్రం. ఈ దరిద్రపు కొంపలోకి వచ్చి పడ్డాను’ అరుస్తూనే ఉంది. ఆ తర్వాత కనీసం ఒకరోజు మూగనోము పడుతుంది.చిన్నదానికి ఇంత రాద్ధాంతమా?ఇల్లు ఇల్లంతా వికలమైన మనసులతో కూచుంది.
సంఘటన 3:వినీత: ఉదయాన్నే ఎక్కడికెళ్లారు?
మురళి: కారు సర్వీసుకివ్వడానికి వెళ్లాను.
వినీత: నాకు చెప్పొచ్చుగా.
మురళి: నువ్వు బాత్రూమ్లో ఉన్నావు.
వినీత: వెళ్లాక కాల్ చేయొచ్చుగా.
మురళి: తొందరగా వచ్చేస్తాననుకున్నాను.ఆ టైమ్‌లో అతడు బ్రేక్‌ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నాడు. అతని తల్లిదండ్రుల్లో హాల్లో కూచుని ఉన్నారు. చిన్న సౌండ్‌లో టీవీ ఆన్ అయి ఉంది. కాని ‘ఠాప్’ అని పెద్ద సౌండ్‌లో పింగాణి ప్లేట్ కింద పడి ముక్కచెక్కలైంది. ఉప్మా ఉండలుగా ఫ్లోర్‌కు అంటుకుపోయింది. ప్లేట్‌ను విసిరికొట్టిన వినీత దెయ్యం పట్టినట్టు కోపంగా రొప్పుతూనే ఉంది.
‘డాక్టర్... ఇదీ పరిస్థితి’ అన్నాడు మురళి లేడీ సైకియాట్రిస్ట్‌తో.‘మీరు బయటకు వెళ్లండి’ అందామె.వినీతతో మాట్లాడటం మొదలెట్టింది. మొదటి రోజు బాల్యం. రెండవ రోజు కాలేజీ రోజులు. మూడో రోజు పెళ్లి రోజులు.ఐదోరోజుకు కాని వినీత మాట్లాడటం మొదలెట్ట లేదు.‘నావి చిన్న చిన్న కోరికలు కూడా తీరడం లేదండీ. నా మనసును అతడు అర్థం చేసుకోడు’ అంది.‘అంటే?’ అని అడిగింది సైకియాట్రిస్ట్.‘పెళ్లయిన కొత్తల్లో ఇనార్బిట్ మాల్ వెళ్దామన్నాను. నా ఉద్దేశం మేమిద్దరం మాత్రమే వెళ్లాలని. మురళి ఆ కోరిక వద్దనడు. కాని అందరినీ ఇన్వాల్వ్ చేస్తాడు. తల్లిదండ్రులనో దగ్గరలోనే ఉన్న అక్క వాళ్లనో లేదంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీలనో. నేను వద్దు అని చెప్పలేను. అతనికి అర్థం కాదు. రాత్రి పూట భోజనం అయ్యాక టెర్రస్ మీదకు వెళ్దాం అంటాను. కాసేపు కబుర్లు చెప్పుకుందామని. అలాగే అని ఫోన్ తెచ్చుకుంటాడు. నేనుచందమామను చూస్తాను. అతడు ఫోన్ చూస్తాడు. నేను చేయి పట్టుకుంటాను. అతడు ఫోన్ పట్టుకుంటాడు. స్నానానికి వెళితే టవల్ అడగడు. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో కాఫీ అడగడు. వాళ్ల అమ్మనుఅడుగుతాడు. లేదంటే తనే ఏర్పాటు చేసుకుంటాడు. పెళ్లయ్యాక అందరూ హనీమూన్‌కు వెళతారు. మురళి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని శ్రీశైలం బయల్దేరాడు...’‘అంతేనా?’
‘అంతేనా.. అంటే’ నసిగింది.‘చెప్పండి..పర్లేదు’..‘రాత్రి పూట కూడా ఏదో డ్యూటీ చేసినట్టు ఉంటాడు. ఇష్టం, ప్రేమ, మోహం... అవన్నీ చూపాలనిగాని నాకు అవసరం అనిగాని అనుకోడు’‘ఇవన్నీ మనసులో పెట్టుకొని చిన్నచిన్న వాటికి రాద్ధాంతం చేస్తున్నారు’‘అవును’‘మీకు ఏ దెయ్యమూ లేదు. ఉంటే గింటే కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేని జబ్బు మాత్రం ఉంది’‘అంటే డాక్టర్’‘చెప్తాను’ అని అతణ్ణి కూడా లోపలికి పిలిచింది.∙∙ ‘చూడండి... కొందరు ప్రతిదీ చెప్తారు. కొందరు ఏదీ చెప్పరు. మీ వైఫ్ రెండో టైప్. ఇక కొందరు చెప్పకపోయినా తెలుసుకుంటారు. కొందరు చెప్తే తప్ప తెలుసుకోలేరు. మీరు రెండో టైప్. ఈ రెండు టైప్లు కలవడం వల్ల ప్రాబ్లమ్. ఇక మీదట మీ భార్య మీకు ఏది ఇష్టమో అది చెప్తుంది. నోటితో చెప్తుంది. లేదంటే మెసేజ్ పెడుతుంది. లేదంటే నోట్‌బుక్‌లో రాసి చూపిస్తుంది. మీరు దానిని వినాలి. సీరియస్‌గా తీసుకోవాలి. ఆ కోరిక సబబైనదైతే తీర్చాలి. వీలుకానిది ఎందుకు వీలుకాదో చెప్పండి. (ఆమె వైపు తిరిగి) మీరు కూడా అతడు చెప్పినది అర్థం చేసుకోవాలి. చూడండి... మీ ఇద్దరూ లైఫ్‌ను మీ ఇద్దరి కోసం మొదట జీవించండి. ఒకరి కోసం ఒకరు టైమ్ పెట్టాలి అని గ్రహించండి. మురళీ... దీనిని మీకు ఎక్కువ చెప్తున్నాను. రోజూ ఏదో ఒక సమయంలో మాట్లాడుకోండి. సరిగ్గా మాట్లాడుకోకపోతే అనుమానాలు, సందేహాలు, దూరాలు పెరుగుతాయి. మాటకు మించిన ట్యాబ్లెట్ కానీ సంభాషణకు మించిన సర్జరీగానీ లేవు. మీరు ఈ రెంటినీ అందుకుంటే నా వంటి సైకియాట్రిస్ట్ అవసరమే రాదు’ సైకియాట్రిస్ట్ చెప్పడం ముగించింది.బయటికొచ్చిన వినీత, మురళి కారులో కూర్చున్నారు.‘ఐస్‌క్రీమ్ తిందామా’ వినీత అడిగింది.
‘మనిద్దరం మాత్రమే’ మురళి నవ్వాడు.కథ కంచికి.
కొందరు ప్రతిదీ చెప్తారు. కొందరు ఏదీ చెప్పరు. మీ వైఫ్ రెండో టైప్. ఇక కొందరు చెప్పకపోయినా తెలుసుకుంటారు. కొందరు చెప్తే తప్ప తెలుసుకోలేరు. మీరు రెండో టైప్. ఈ రెండు టైప్లు కలవడం వల్ల ప్రాబ్లమ్.
– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్పుట్స్: పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్