demo corridor
-
రోడ్డు ప్రమాదాలకు.. డెమో కారిడార్లతో చెక్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కళ్లెం వేసేందుకు అన్ని జిల్లాల్లో డెమో కారిడార్లు ఏర్పాటుచేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. 2020 నాటికి ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలంటే ఈ కారిడార్ల నిర్మాణం ఒక్కటే మార్గమని అభిప్రాయపడింది. దీంతో రహదారులు, భవనాల శాఖ సహకారంతో వీటిని చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. మొత్తం 13 జిల్లాల్లో వెయ్యి కిలోమీటర్ల మేర వీటిని ఏర్పాటుచేసేందుకు అధ్యయనం చేయాలని ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానించింది. రెండు నెలల్లో ఇందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని రోడ్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సూచించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ కారిడార్లు ఏర్పాటుచేయాలనే అంశంపై రవాణా, ఆర్ అండ్ బీ శాఖలు సంయుక్తంగా నివేదిక రూపొందిస్తాయి. ఏ జిల్లాల్లో ఏ రహదారిపై అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో.. ఈ నివేదికలో పొందుపర్చాలని ఆయా జిల్లాల్లో రోడ్ సేఫ్టీ కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న కలెక్టర్లను రవాణా శాఖ కోరింది. మరో నాలుగుచోట్ల కూడా.. కడప, అనంతపురం జిల్లాలకు మరో డెమో కారిడార్‌ను ప్రతిపాదించారు. దీనిని రాజంపేట–రాయచోటి–కదిరి మధ్య ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అలాగే, అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న గుంటూరు జిల్లా కొండమోడు–పేరేచర్ల.. కృష్ణా జిల్లా విజయవాడ–పునాదిపాడు, నూజివీడు–పశ్చిమగోదావరిలోని భీమవరం వరకు కూడా ప్రతిపాదించారు. వీటితోపాటు ఇతర ప్రమాదకర రహదార్లను గుర్తించి ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదనలు పంపించాలని రవాణా శాఖ ఇప్పటికే కోరింది. డెమో కారిడార్ అంటే.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ఓ రహదారిని ఎంచుకుని ఆ రహదారిని మలుపులు లేకుండా నిర్మిస్తారు. ఈ రహదారిపై సైన్ బోర్డులు ఏర్పాటుచేస్తారు. బ్లాక్ స్పాట్లు, రహదారిలో గుంతలు ఎక్కడా లేకుండా చూస్తారు. ఈ రహదారిపై నిర్దేశించే బరువున్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఇందుకోసం ఆ మార్గంలో కాటా యంత్రాలను ఏర్పాటుచేస్తారు. ప్రమాదానికి గురైతే వెంటనే ఆస్పత్రికి చేర్చేలా అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతారు. రేణిగుంట– రాయలచెరువు కారిడార్‌తో సత్ఫలితాలు 2012లో రేణిగుంట–రాయలచెరువు మధ్య 139 కి.మీ.మేర డెమో కారిడార్ ఏర్పాటుచేసేందుకు ప్రపంచ బ్యాంకు రూ.36 కోట్లు అందించింది. 2013లో ఈ రహదారిలో రోడ్డు ప్రమాదాలు 250 నమోదయ్యాయి. కారిడార్ ఏర్పాటుతో 2015 నాటికి ఇవి సగానికి తగ్గాయి. 2017లో వంద వరకు నమోదు కాగా.. 2018 నాటికి పదుల సంఖ్యలోకి వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి కిలోమీటర్ల మేర వీటిని ఏర్పాటుచేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఒక్కో కారిడార్‌కు రూ.30 కోట్లకు పైగా వెచ్చించనుంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం రోడ్ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. 2020 నాటికి 15 శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తాం. అన్ని జిల్లాల్లో కలిపి వెయ్యి కిలోమీటర్ల వరకు డెమో కారిడార్ల నిర్మాణం చేపట్టాలని రోడ్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయించాం. ఆర్అండ్బీ శాఖ సహకారంతో డెమో కారిడార్లను నిర్మిస్తాం. –పీఎస్సార్ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్ -
బెజవాడ–విశాఖ మధ్య డెమో కారిడార్!
ప్రపంచ బ్యాంకు రుణానికి సర్కారు ప్రతిపాదనలు ప్రమాదాల సంఖ్య తగ్గించడమే లక్ష్యం డమ్మీ ప్రమాద వాహనాల ఏర్పాటుకు రవాణా శాఖ నిర్ణయం సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా రోడ్డు ప్రమాదాలు విజయవాడ–విశాఖపట్నం మధ్యే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16)పై విజయవాడ నుంచి విశాఖ వరకు ప్రమాదాలు గణనీయంగా నమోదవుతున్నాయి. 2015లో 23,718 రోడ్డు ప్రమాదాలు నమోదైతే, విజయవాడ–విశాఖ మధ్య 9 వేలకు పైగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. విజయవాడ–విశాఖ మధ్య రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వం ఇటీవలే అధ్యయనం చేసింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు డెమో కారిడార్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డెమో కారిడార్ ఏర్పాటుకు ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. 2010లో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే రేణిగుంట–రాయలచెరువు మార్గాన్ని డెమో కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు ప్రపంచ బ్యాంకు సాయమందించింది. రూ.36 కోట్లతో 136 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మించారు. 2013లో ఈ రోడ్డులో 250 మంది మృత్యువాత పడితే, డెమో కారిడార్ పూర్తయ్యాక 2015 నాటికి ఈ సంఖ్య 123కి తగ్గింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని విజయవాడ–విశాఖ మధ్య కూడా డెమో కారిడార్ చేపట్టి ప్రమాదాల సంఖ్య తగ్గించాలని యోచిస్తున్నారు. రవాణా శాఖ నోడల్ ఏజెన్సీగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. డెమో కారిడార్‌లో ఏం చేస్తారు? డెమో కారిడార్‌లో ప్రమాదకరంగా ఉన్న మలుపుల్ని సరిచేయడం, బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించి మరమ్మతులు చేయడం, రోడ్లకు అదనపు వరుసలు, బీమ్లతోపాటు సైన్‌బోర్డులు, జీబ్రా లైన్లు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేస్తారు. ఈ స్ట్రెచ్‌లో ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటుతోపాటు ప్రమాదానికి గురైన గోల్డెన్ అవర్లోనే ఆస్పత్రికి చేర్చేలా అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తారు. విజయవాడ–విశాఖ మధ్య డెమో కారిడార్ ప్రాజెక్టు పట్టాలెక్కేటప్పటికి కనీసం మూడు, నాలుగేళ్ల సమయం పడుతుందని అంచనా. ఈ లోగా ఎన్‌హెచ్–16పై ప్రమాదకర ప్రాంతాల్లో డమ్మీ ప్రమాద వాహనాలు ఉంచి, ప్రమాదం తీరు తెన్నులు తెలిసేలా డిస్ప్లే చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. డమ్మీ ప్రమాద వాహనాలు ఉంచితే జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తారని రవాణా శాఖ భావిస్తోంది.