ప్రపంచ బ్యాంకు రుణానికి సర్కారు ప్రతిపాదనలు
ప్రమాదాల సంఖ్య తగ్గించడమే లక్ష్యం
డమ్మీ ప్రమాద వాహనాల ఏర్పాటుకు రవాణా శాఖ నిర్ణయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా రోడ్డు ప్రమాదాలు విజయవాడ–విశాఖపట్నం మధ్యే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16)పై విజయవాడ నుంచి విశాఖ వరకు ప్రమాదాలు గణనీయంగా నమోదవుతున్నాయి. 2015లో 23,718 రోడ్డు ప్రమాదాలు నమోదైతే, విజయవాడ–విశాఖ మధ్య 9 వేలకు పైగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. విజయవాడ–విశాఖ మధ్య రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వం ఇటీవలే అధ్యయనం చేసింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు డెమో కారిడార్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
డెమో కారిడార్ ఏర్పాటుకు ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. 2010లో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే రేణిగుంట–రాయలచెరువు మార్గాన్ని డెమో కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు ప్రపంచ బ్యాంకు సాయమందించింది. రూ.36 కోట్లతో 136 కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మించారు. 2013లో ఈ రోడ్డులో 250 మంది మృత్యువాత పడితే, డెమో కారిడార్ పూర్తయ్యాక 2015 నాటికి ఈ సంఖ్య 123కి తగ్గింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని విజయవాడ–విశాఖ మధ్య కూడా డెమో కారిడార్ చేపట్టి ప్రమాదాల సంఖ్య తగ్గించాలని యోచిస్తున్నారు. రవాణా శాఖ నోడల్ ఏజెన్సీగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.
డెమో కారిడార్‌లో ఏం చేస్తారు?
డెమో కారిడార్‌లో ప్రమాదకరంగా ఉన్న మలుపుల్ని సరిచేయడం, బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించి మరమ్మతులు చేయడం, రోడ్లకు అదనపు వరుసలు, బీమ్‌లతోపాటు సైన్‌బోర్డులు, జీబ్రా లైన్లు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేస్తారు. ఈ స్ట్రెచ్‌లో ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటుతోపాటు ప్రమాదానికి గురైన గోల్డెన్ అవర్‌లోనే ఆస్పత్రికి చేర్చేలా అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తారు.
విజయవాడ–విశాఖ మధ్య డెమో కారిడార్ ప్రాజెక్టు పట్టాలెక్కేటప్పటికి కనీసం మూడు, నాలుగేళ్ల సమయం పడుతుందని అంచనా. ఈ లోగా ఎన్‌హెచ్–16పై ప్రమాదకర ప్రాంతాల్లో డమ్మీ ప్రమాద వాహనాలు ఉంచి, ప్రమాదం తీరు తెన్నులు తెలిసేలా డిస్‌ప్లే చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. డమ్మీ ప్రమాద వాహనాలు ఉంచితే జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తారని రవాణా శాఖ భావిస్తోంది.
బెజవాడ–విశాఖ మధ్య డెమో కారిడార్!
Published Tue, Oct 11 2016 7:42 PM | Last Updated on Fri, May 25 2018 7:04 PM
Advertisement
Advertisement