తల్లీ ! నీ త్యాగం నేర్పిన పాఠాలు...
పద్యానవనం
చీపురు నొక్క చేత, ఒక చేతను చింపిరి గంప బూని, యీ పాపపు గుప్పలూడ్చెదవు బాలిక! చీదర లేదె సుంత? నీ యోపిక చూచి మెచ్చి తలయూచు జగత్పిత కన్నుగొల్కులన్ తేవకు తేవకున్ బయలు దేఱు నవే నులివెచ్చ బాష్పముల్!
అసహ్యమని చీదరించుకోకుండా ఓపిగ్గా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న పాకీపిల్ల (స్కావెంజర్)ను సంభోదిస్తూ చెబుతున్నాడు కవి! ‘ఎంత ఓపిక తల్లీ! ఓ చేత చీపురు మరో చేత చిరిగిన గంప/బుట్ట ధరించి ఈ భూమ్మీద సాటి మనుషులు వదిలిన మలినాల చెత్త కుప్పలనూడ్చే పనిలో నిమగ్నమయ్యావు’ అని!
తర్వాత్తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మనిషి విసర్జించే మాలిన్యాల్ని మనుషులు ఎత్తిపోసే పారిశుధ్యపు పనుల్ని అధికారికంగా నిషేధించాయి. యాంత్రిక నిర్వహణ, మరుగుదొడ్ల ఏర్పాటు, భూగర్భమురుగు కాల్వల వ్యవస్థ వంటివి పూర్తిస్థాయిలో తీసుకువచ్చే కార్యాచరణ ఇంకా కొనసాగుతోంది. కానీ, అక్కడక్కడ ఇప్పటికీ ఆ పనిని మనుషులే నిర్వర్తించడం మన వ్యవస్థలో కొనసాగుతున్న దురవస్థ. కడు పేదరికం వల్ల, పొట్టపోసుకునే ఇతర పనులు దొరక్క, వృత్తి ధర్మాన్నే నమ్ముకొని, తరతరాలుగా ఈ పనిలో నిమగ్నమైన వారున్నారు. చీదరించుకోకుండా ఈ మాలిన్యాల్ని తొలగించే పాకీ వృత్తిలో ఉన్నవారి సేవల్ని చూసి, సృష్టికర్తయే చలించిపోతున్నాడనీ, తడవ తడవకు కంటతడి పెడుతున్నాడనీ కవి భావన!
కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి ‘ఉదయశ్రీ’లో పాకీపిల్ల శీర్షికన రాసిన ఖండిక లోనిదీ పద్యం. ఈ రోజున ‘స్వచ్ఛ భారత్’ పేరిట స్పృహను రగిల్చే రకరకాల కార్యక్రమాల్ని చేపడుతున్నారు. ఉద్దేశం మంచిదే! పని కన్నా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం విచారకరం. ఎవరి పనులు వారు చేసుకోవడాన్నే గొప్పకార్యంగా భావించే పరిస్థితులు దాపురించాయి.
మన సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకునే మనం విశాల సమాజహితంలో జరిపే కార్యక్రమాల విషయంలో ఇంకా ఎంతో పరిణతి సాధించాల్సి ఉంది. ‘స్వచ్ఛభారత్’ను ఆవిష్కరించడానికి ముందు మనం కొన్ని మౌలిక విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. పారిశుధ్యం విషయంలో ఎవరి పనులు వారు చేసుకోవడంలోనే గొప్పతనం ఉందని ప్రపంచమంతా గ్రహించింది. ఏ అభివృద్ధి చెందిన దేశాన్ని తీసుకున్నా, ఆయా దేశాల్లో ఎన్ని అభివృద్ధి చెందిన కుటుంబాల్ని తీసుకున్నా శుభ్రతకు వారిచ్చే ప్రాధాన్యత ఆశ్చర్యం కలిగిస్తుంది.
మన సమాజంలో అది లేకపోగా, విధి లేక అటువంటి విధుల్లో ఉన్నవారి పట్ల చిన్న చూపు, తూష్ణీభావం నెలకొని ఉన్నాయి. శ్రమను గౌరవించే సంస్కృతి మన దగ్గర మరుగున పడి, ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ పేరిట పాశ్చాత్య దేశాల్లో ఆదరణ పొందడాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎవరు, ఎటునుంచి ఎటు పయనిస్తున్నారో శ్రద్ధగా గ్రహించాలి.
అభివృద్ధి గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పుకునే మనం పారిశుధ్యం విషయంలో ఎంత వెనుకబడి ఉన్నామో తెలిస్తే గుండె జారిపోతుంది. పొరుగునున్న అభివృద్ధి చెందని దేశం బంగ్లాదేశ్ కంటే కూడా మనమీ విషయంలో వెనుకబడి ఉన్నామంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నేటికీ పెద్ద సంఖ్యలో కుటుంబాలకు మరుగుదొడ్డి సదుపాయం లేక బహిర్భూమినే నమ్ముకోవాల్సిన దురవస్థ నెలకొని ఉంది. పట్టణ ప్రాంతాల్లో మరింత దయనీయ స్థితి. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు పాలకులు చిత్తశుద్ధితో చేసిన యత్నాలు తక్కువ.
ఇప్పటికైనా ఏలినవారు నిర్దిష్ట ప్రణాళికలు రచించి ‘స్వచ్ఛ భారత్’ను ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. అంతకన్నా ముందు, దేశంలోని ప్రతి మనిషి కూడా, మహాత్ముడు బాపూజీ చెప్పినట్టు తానాశించిన మార్పు తన నుంచే మొదలుకావాలనే స్ఫూర్తిని అందుకోవాలి. ‘‘ఒక్క రోజీవు వీథుల నూడ్వకున్న తేలిపోవును మా పట్టణాల సొగసు: బయటపడునమ్మ బాబుల బ్రతుకులెల్ల ఒక క్షణమ్మీవు గంప క్రిందకును దింప’’ అన్న కరుణశ్రీ మాటలు మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాయి. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆహ్వానిస్తూ, ఆస్వాదిస్తూ... ఎవరికి వారం ‘స్వచ్ఛ భారత్’ ఆవిష్కరణలో ఆచరణాత్మక పాత్ర పోషించడమే మనందరి ముందున్న కర్తవ్యం!