ఇన్ఫీ కొత్త చీఫ్.. కత్తిమీదసామే!
♦ ఎంపికపై వెంటాడుతున్న మూర్తి నీడ
♦ ప్రమోటర్ల జోక్యంతో అభ్యర్థుల వెనుకంజ!
♦ ఎవరూ పెద్దగా ఆసక్తి వ్యక్తంచేయకపోవచ్చు....
♦ మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం...
♦ సీఈఓ ఎంపికకు 2018 మార్చి వరకూ గడువు
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ప్రమోటర్లు–మేనేజ్మెంట్ మధ్య పోరు తీవ్రతరం కావడంతో ఇప్పుడు ఆ కంపెనీ కొత్త చీఫ్ ఎంపిక కత్తిమీద సాముగా మారుతోంది. ప్రధానంగా ఇన్ఫీ విధానాలపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తితో సహా మరికొందరు ప్రమోటర్లు నీడలా వెంటాడుతుండటంతో... కంపెనీకి సారథ్యం వహించేందుకు ఎవరూ పెద్దగా ఇష్టపడకపోవచ్చని పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనపై కంపెనీ ప్రమోటర్లు పదేపదే నిరాధార ఆరోపణలు, విమర్శల దాడి చేయడాన్ని సహించలేక సీఈఓ, ఎండీ పదవికి విశాల్ సిక్కా గత శుక్రవారం అర్ధంతరంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన గుడ్‌బై చెప్పడానికి మూర్తే కారణమని ఇన్ఫోసిస్ బోర్డు తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా గుప్పించింది.
దీంతో ప్రమోటర్లకు ప్రస్తుత మేనేజ్మెంట్కు మధ్య వ్యవహారం మరింత చెడింది. కాగా, కొత్త సీఈఓ నియామకానికి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ డెడ్‌లైన్‌ను బోర్డు నిర్ధేశించింది. తాత్కాలిక సీఈఓగా కంపెనీ ప్రస్తుత సీఎఫ్ఓ యూబీ ప్రవీణ్ రావుకు బాధ్యతలు అప్పగించారు. కొత్త చీఫ్ అన్వేషణలో కంపెనీలోని వ్యక్తులతోపాటు బయటివారిని కూడా బోర్డు పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఇన్ఫీకి తొలి ప్రమోటరేతర సీఈఓగా ఏరికోరి తీసుకొచ్చిన సిక్కాపై ప్రమోటర్ల ధోరణిని చూస్తుంటే బయటి వ్యక్తులు అంతగా ఆసక్తి చూపకపోవచ్చనేది నిపుణుల వాదన. కంపెనీలోని వ్యక్తులకే ప్రాధాన్యం ఇస్తే గనుక... ప్రవీణ్ రావుతో పాటు సీఎఫ్ఓ డి. రంగనాథ్, డిప్యూటీ సీఓఓ రవికుమార్, కీలకమైన బీఎఫ్ఎస్ఐ, హెల్త్‌కేర్ విభాగాల హెడ్ మోహిత్ జోషి రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
బహిరంగ విమర్శలతో కష్టమే...
కంపెనీ తీసుకునే విధానపరమైన చర్యలను గుచ్చిగుచ్చి ప్రశ్నించడం, బహిరంగంగా విమర్శించడం వంటి ప్రమోటర్ల చర్యలతో ఎవరైనా మంచి నైపుణ్యం ఉన్న అభ్యర్థులు సీఈఓగా రావాలనుకున్నా జంకుతారని ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ అడ్వయిజరీ సర్వీసెస్ అనే సంస్థ వ్యాఖ్యానించింది. ప్రమోటర్లకు నమ్మకంగా ఉండే కంపెనీలోని వ్యక్తులను ఎంపికచేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సులువైన వ్యవహారమని పేర్కొంది. అయితే, సయోధ్య కోసం ఇలా రాజీపడిపోవడం కంపెనీ పోటీతత్వం, ప్రతిష్టపై ప్రతికూల ప్రభావానికి దారితీస్తుందని అభిప్రాయపడింది. ఇన్ఫీలో కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించి లోపాలు ఉన్నాయంటూ ప్రమోటర్లు ప్రధానంగా మూర్తి బహిరంగంగా ఆరోపణల దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క, కంపెనీ మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సాల్ కు భారీగా వీడ్కోలు ప్యాకేజీ ఇవ్వడాన్ని, సీఈఓ విశాల్ సిక్కా వేతన ప్యాకేజీ పెంపుపైనా మూర్తి బహిరంగంగా విమర్శలు గుప్పించడంతోపాటు తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. కాగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ఫీకి కొత్త సీఈఓ అన్వేషణ చాలా కష్టతరమైన అంశమేనని ఐటీ పరిశ్రమ నిపుణుడు ప్రమోద్ బాసిన్ పేర్కొన్నారు.
విశ్వాసం పెంచాలి: నటరాజన్
విశాల్ సిక్కా ఆకస్మిక రాజీనామా నేపథ్యంలో కంపెనీ కార్యకలాపాల్లో ఎలాంటి సమస్యలూ లేవన్న భరోసాను, నమ్మకాన్ని కల్పించే చర్యలు ఇప్పుడు చాలా అవసరమని ఐటీ పరిశ్రమకు చెందిన గణేశ్ నటరాజన్ వ్యాఖ్యానించారు. ఇందుకోసం కొత్త సీఈఓ అన్వేషణ ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా సిక్కా వెళ్లిపోయినా... కంపెనీని ముందుండి నడిపించేందుకు, సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు చాలామంది నిపుణులు వరుసలో ఉన్నారన్న బలమైన సందేశాన్ని ఇన్ఫోసిస్ యాజమాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రొఫెషనల్ నాయకత్వం దిశగా భారత్ కొర్పొరేట్లు అడుగులేస్తున్న ప్రస్తుత తరుణంలో ఇన్ఫీలో తలెత్తిన సంక్షోభం.. చాలా కీలకమైన ప్రశ్నలను లేవనెత్తిందని ఐటీ పరిశ్రమ చాంబర్ నాస్కామ్ మాజీ ప్రెసిడెంట్ సోమ్ మిట్టల్ వ్యాఖ్యానించారు. కంపెనీ యాజమాన్య వ్యవహరాల నుంచి పూర్తిగా వైదొలగిన ఓనర్లు/వ్యవస్థాపకులు... భావి నాయకత్వ ప్రణాళికలకు సంబంధించి తమ పాత్ర ఏంటనే విషయంలో చాలా జాగ్రత్తగా, స్పష్టమైన రీతిలో వ్యవహరించాలని మిట్టల్ సూచించారు.
క్లయింట్లు చేజారే ప్రమాదం...!
ఇన్ఫీలో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు ఉన్నాయంటూ స్వయంగా ప్రమోటర్లే గొంతెత్తడం.. చివరకు ఇది సిక్కా వైదొలగేవరకూ వెళ్లడంతో ఇప్పుడు కంపెనీలో ఉద్యోగులు, క్లయింట్లలో స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత అనిశ్చితి నేపథ్యంలో సిబ్బంది వలసలు పెరిగిపోవడంతోపాటు కొంతమంది క్లయింట్లు కూడా చేజారే ప్రమాదం పొంచి ఉందని పేరువెల్లడించడానికి ఇష్టపడని ఐటీ రంగానికి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఇన్ఫీలో జరుగుతున్న ఉదంతంపై క్లయింట్లలో కచ్చి తంగా ఆందోళన నెలకొంటుంది. పటిష్టమైన నాయకత్వం లేకపోవడంతో కంపెనీని మరిన్ని సమస్యలు చుట్టుముట్టొచ్చు. ఐటీ పరిశ్రమలో తీవ్ర పోటీ దృష్ట్యా.. ప్రత్యర్థి కంపెనీలు దీన్ని అనుకూలంగా మలచుకొని ఇన్ఫీ క్లయింట్లను తమవైపు తిప్పుకోడానికి అవకాశం లభిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. మరోపక్క, ఇన్ఫీలో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలపై అమెరికాలో క్లాస్ యాక్షన్ దావాలు దాఖలయ్యే అవకాశాలు ఉండటం కూడా అటు క్లయింట్లు ఇటు ఇన్వెస్టర్లలో భయాందోళనలు సృష్టించవచ్చని పరిశీలకులు పేర్కొంటున్నారు.
చిచ్చురేపిన పనయా డీల్!
సిక్కా సారథ్యంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ కంపెనీ పనయాను ఇన్ఫోసిస్ 2015లో 20 కోట్ల డాలర్లకు(దాదాపు రూ. 1250 కోట్లు) కొనుగోలు చేసింది. అయితే, ఈ డీల్‌లో అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ కంపెనీ అంతర్గత వేగులు(విజిల్ బ్లోయర్స్) ఆరోపించడం, నియంత్రణ సంస్థలకు ఫిర్యాదు చేయడంతో వివాదం రాజుకుంది. దీనిపై ఆతర్వాత ప్రమోటర్లు కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో స్వతంత్ర న్యాయ సంస్థతో కంపెనీ దర్యాప్తు జరిపించడం తెలిసిందే. అయితే, ఎలాంటి అవకతవకలూ జరగలేదని న్యాయ, ఫోరెన్సిక్ ఆడిట్ సంస్థలు నివేదిక ఇచ్చాయి. ఈ నివేదికను బహిరంగపరచాలన్న మూర్తి డిమాండ్‌ను కంపెనీ బోర్డు తోసిపుచ్చింది. నివేదికను బయటపెట్టకపోవడం అంటే దర్యాప్తు పారదర్శకంగా జరగలేదనే అర్ధమంటూ మూర్తి వ్యాఖ్యానించడం, ఆయనకు మరికొందరు మాజీలు మద్దతుతెలపడంతో యాజమాన్యానికి, ప్రమోటర్లకు మధ్య విభేదాలను మరింత పెంచేలా చేసింది. ఇది కూడా సిక్కా రాజీనామాకు ప్రధాన కారణాల్లో ఒకటని పరిశీలకులు పేర్కొంటున్నారు.