నిరుపేదలకు ఇళ్లస్థలాలిస్తాం
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
బహదూర్‌పురా : నిరుపేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం పాతబస్తీలో నాలుగెకరాల స్థలాన్ని కేటాయించేలా కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ హలై మెమోన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బహదూర్‌పురా తాడ్బన్ చౌరస్తాలో నిరుపేద ప్రజల కోసం నిర్మించిన 147 గృహాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.... మైనార్టీ నిరుపేదల కోసం స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి ఇళ్లు కట్టించడం అభినందనీయమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలందరికీఇళ్లు, ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు ప్రణాళికలను రూపొందించిందని తెలిపారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.... పాతబస్తీలో ఇప్పటికీ అనేక ముస్లిం కుటుంబాలు సొంత ఇళ్లు లేక, అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హలై మెమోన్ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ అధ్యక్షుడు మహ్మద్ అషఫ్ ్రమాట్లాడుతూ.... రూ.10 కోట్లతో... ఎకరా స్థలంలో నిరుపేదలకు 147 ఇళ్లను జి ప్లస్ 3 పద్ధతిలో నిర్మించామన్నారు.
ప్రభుత్వం స్థలం కేటాయిస్తే మరిన్ని ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల వంతున డిపాజిట్‌గా తీసుకొని ఇళ్లు కేటాయించామన్నారు. ఈ డబ్బును మున్ముందు ఇళ్ల మరమ్మతులకు వినియోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్ మోజంఖాన్, మాజీ కార్పొరేటర్లు మొబీన్ అలీ, మహ్మద్ సలీం, మహ్మద్ ఆరీఫ్ జైన్, మహ్మద్గఫార్, హైదరాబాద్ హలై మెమోన్ స్వచ్ఛంద సంస్థ ఆలిండియా అధ్యక్షుడు ఎక్బాల్ తౌఫిక్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.