డిప్యూటీ సీఎం తనయుడిపై ఎంఐఎం దాడి!
హైదరాబాద్: అజంపురలోని తెలంగాణ డిప్యూటీ సీఎం మహముద్ అలీ నివాసం వద్ద మంగళవారం సాయంత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు రిగ్గింగ్ చేశారని ఆరోపిస్తూ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల డిప్యూటీ సీఎం ఇంటి ఎదురుగా ఆందోళనకు దిగారు. నివాసం వద్ద ఉన్న ఆయన తనయుడు అజం అలీపై ఎమ్మెల్యే బలాల దాడికి యత్నించారు.
దీంతో బలాల తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడికి యత్నించిన ఎమ్మెల్యే బలాలను చాదర్ఘాట్ పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు మహముద్ అలీ కుటుంబాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పరామర్శించారు. టీఆర్ఎస్ను చూసి ఎంఐఎం భయపడుతోందని, అందుకే దాడికి ప్రయత్నించిందని డిప్యూటీ సీఎం తనయుడు అజం అలీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.