Deputy Governor R. Gandhi
-
బంగారానికి ప్రత్యేక బ్యాంకు ఉండాలి
ముంబై: ప్రజల దగ్గరున్న భౌతిక రూపంలోని బంగారాన్ని (ఆభరణాలు, కడ్డీలు వంటివి) నగదీకరించడానికి ప్రత్యేకంగా బంగారం బ్యాంకులాంటిది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ తెలిపారు. ప్రత్యేకంగా బంగారం డిపాజిట్లు స్వీకరించడం, కేవలం పసిడి రుణాలకే పరిమితం కావడం లేదా ఎక్కువగా పుత్తడి రుణాలే ఇచ్చేట్లుగా దీన్ని రూపొందించవచ్చని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. భారత్ వంటి వర్ధమాన దేశాలు నిలకడగా అధిక స్థాయిలో వృద్ధి సాధించాలంటే బోలెడంత పెట్టుబడి అవసరం అవుతుందని గాంధీ పేర్కొన్నారు. ఇందుకు గోల్డ్ బ్యాంక్ తోడ్పడగలదని ఆయన చెప్పారు. ‘ప్రజల దగ్గరున్న బంగారాన్ని డిపాజిట్లాగా సేకరించేందుకు వినూత్నమైన ఆలోచనలు చేయాలి. ఉదాహరణకు.. బంగారం జ్యుయలరీని డిపాజిట్ చేసే వారికి.. కాలవ్యవధి తీరిపోయిన తర్వాత అదే డిజైన్ లేదా అదే తరహా ఆభరణాన్ని తిరిగి ఇచ్చేలా స్కీములు ఆఫర్ చేయొచ్చు‘ అని ఆయన వివరించారు. దేశీయంగా ప్రజల దగ్గర, ఆధ్యాత్మిక సంస్థల దగ్గర దాదాపు రూ. 23,000–24,000 టన్నుల బంగారం ఉందని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
పనితీరు ఆధారంగా బ్యాంకులకు మూలధనం సరైందే
న్యూఢిల్లీ: బ్యాంకులకు కేంద్రం తాజా మూలధనాన్ని సమకూర్చే విషయంలో వాటి ‘పనితీరు’ను ప్రామాణికంగా తీసుకోవాలన్న కేంద్రం యోచన సరైందేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ సోమవారం అభిప్రాయపడ్డారు. బ్యాంకుల సామర్థ్యం మెరుగుదలకు ఇది తగిన సంకేతమని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఐసీఐసీఐ బ్యాంక్, ఐఎన్జీ వైశ్యా వంటి ప్రైవేటు రంగంలోని బ్యాంకుల్లో సైతం మొండిబకాయిల సమస్య ప్రారంభమైందన్నారు. డిసెంబర్ త్రైమాసికంలో కార్పొరేట్ రుణాలు మొండిబకాయిలుగా మారడం దీనికి కారణమని అన్నారు. గత వారాంతంలో రూ.6,990 కోట్ల తాజా కేపిటల్ ప్రకటన విషయాన్ని గాంధీ ప్రస్తావిస్తూ, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి సంస్థలకు తాజా నిధులు అందే అవకాశం ఉందన్నారు.