డిప్యూటీ తహసీల్దార్ నారాయణపై సస్పెన్షన్ వేటు
సాక్షి, మెదక్ : జిల్లాలోని నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలో 112 ఎకరాలకు ఎన్ఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ ఘటనలో అదనపు కలెక్టర్ నగేశ్, నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డితోపాటు మరో ముగ్గురు కటకటాలపాలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ బాగోతాన్ని మరువక ముందే మెదక్ కలెక్టరేట్లో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న నారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో పనిచేసిన జిన్నారం మండలంలో మృతిచెందిన తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి.. నకిలీ పట్టాపాస్ బుక్కులు సృష్టించడంలో ఆయన పాత్ర ఉన్నట్లు తేలింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం రాత్రి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. (రూ.80 కోట్ల భూమికి ఎసరు)
అదేవిధంగా.. ఆ సమయంలో అక్కడ వీఆర్వోగా ఉండి.. ఆ తర్వాత మెదక్ జిల్లా నర్సాపూర్‌లో గిరిధావర్‌గా పని చేసి 2016లో రిటైర్డ్ అయిన జె.వెంకటేశ్వర్రావు హస్తం కూడా ఉన్నట్లు గుర్తించగా.. క్రిమినల్ చర్యలకు సర్కారు ఆదేశించడం కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఖాజీపల్లి గ్రామంలో సర్వే నంబర్ 181లో అసైన్డ్ భూమి ఉంది. ఈ భూములు రూ.కోట్ల విలువ చేస్తుండడంతో ఇదివరకే కన్నేసిన ఎక్స్ సర్వీస్మెన్లకు సహకరించి.. భారీగా దండుకునేందుకు అప్పటి మండల రెవెన్యూ శాఖ అధికారులు స్కెచ్ వేశారు. 2013లో దరఖాస్తు రాగా.. అప్పుడు తహసీల్దార్‌గా పనిచేసిన, ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓ జి.నరేందర్, డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసిన, ప్రస్తుత మెదక్ కలెక్టరేట్లో విధులు నిర్వర్తిస్తున్న డీటీ కె.నారాయణ, ఖాజీపల్లి వీఆర్ఓగా పనిచేసి.. నర్సాపూర్‌లో గిరిధావర్‌గా రిటైర్డ్ అయిన జె.వెంకటేశ్వర్రావు కుట్రకు తెరదీశారు. (అడిషనల్ కలెక్టర్ కేసుపై కోర్టులో ఏసీబీ పిటిషన్)
స్థానికంగా పనిచేసి మృతిచెందిన తహసీల్దార్ పేరుతో ఫోర్జరీ సంతకం చేసి నకిలీ పట్టా సర్టిఫికెట్లు సృష్టించారు. నలుగురు ఎక్స్సర్వీస్మెన్లు ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున రూ.80 కోట్ల విలువైన 20 ఎకరాలు కట్టబెట్టారు. అసైన్డ్ భూమి కావడంతో ఎన్ఓసీ తప్పనిసరి అయింది. ఈ క్రమంలో 2019లో సదరు వ్యక్తులు దరఖాస్తు చేసుకోగా.. సంగారెడ్డి కలెక్టర్‌కు అనుమానం వచ్చి విచారణ జరిపించారు. మృతి చెందిన తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి.. నకిలీ పట్టాలు సృష్టించినట్లు విచారణాధికారి నిగ్గు తేల్చడంతో వీరిపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ ఘటనలో భాగస్వాములైన ముగ్గురిపై బొల్లారం పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓతోపాటు మెదక్ కలెక్టరేట్ డీటీపై సస్పెన్షన్ వేటు పడింది.
ఏసీబీ నజర్..
112 ఎకరాలకు రూ.1.12 కోట్ల లంచం ఘటనలో అదనపు కలెక్టర్ నగేశ్, నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డి, చిలప్‌చెడ్ తహసీల్దార్ సత్తార్, సర్వే, ల్యాండ్ జూనియర్ అసిస్టెంట్ వసీంతోపాటు ఏసీ బినామీ కోల జీవన్ గౌడ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న వీరిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఖాజీపల్లి భూబాగోతంలో మెదక్ కలెక్టరేట్ డిప్యూటీ తహసీల్దార్ ఉండడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనపై నజర్ వేసినట్లు తెలుస్తోంది.
ముందస్తు బెయిల్ కోసం..
ఫోర్జరీ.. నకిలీ పట్టాలు సృష్టించి రూ.80 కోట్ల భూమిని కట్టబెట్టిన ఘటనలో ఎనిమిది మంది రెవెన్యూ అధికారులు, నలుగురు ఎక్స్ సర్వీస్మెన్లపై కేసు నమోదైన విషయం తెలిసిందే. పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో డీటీ నారాయణతోపాటు మిగిలిన వారు తమ అడ్వకేట్ ద్వారా మెదక్ జిల్లా కోర్టులో ముందస్తు (యాంటిసిపేటరీ) బెయిల్‌కు అప్లై చేసినట్లు సమాచారం. కాగా, డిప్యూటీ తహసీల్దార్ నారాయణ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. సుమారు నెల రోజులుగా విధులకు రావడం లేదని జిల్లా ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా వరుసగా అవినీతి కోణాలు వెలుగు చూడడం రెవెన్యూ వర్గాల్లో అలజడి రేపుతోంది.