ఏజెన్సీని వణికిస్తున్న చలి
పాడేరు/చింతపల్లి: విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత రోజు రోజుకు అధికమవుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్నరోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పరిశోధన స్థానం శాస్త్రవేత్త దేశగిరి శేఖర్ తెలిపారు. మన్యమంతటా చలిగాలులు వీస్తున్నాయి. గురువారం పర్యాటక ప్రాంతాలైన లంబసింగిలో 6 డిగ్రీలు, పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడివద్ద 7 డిగ్రీలు, చింతపల్లిలో 9 డిగ్రీలు, పాడేరుకు సమీపంలోని మినుములూరు వద్ద 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీలో గత నెల 29 నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.
తుఫాన్ ప్రభావం వల్ల కొద్ది రోజులు చలి తీవ్రత తగ్గినప్పటికి 3 రోజులుగా ఈ ప్రాంతంలో మళ్లీ చలి విజృంభిస్తోంది. పొగమంచు దట్టంగా వర్షం మాదిరి కురుస్త్తోంది. ఏజెన్సీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి అందాలను వీక్షించేందుకు వస్తున్న పర్యాటకులు గజగజ వణుకుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. అర్థరాత్రి నుంచే మంచు దట్టంగా కురుస్తుంది. సూర్యోదయం ఆలస్యమవుతోంది. ఉదయం 10 గంటల వరకు సూర్యకిరణాలు కనిపించడం లేదు. గిరిజనులంతా చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. ఏజెన్సీలో ఉన్ని దుస్తుల వినియోగం కూడా అధికమైంది.