నిర్వీర్యమవుతున్న ఎత్తిపోతల పథకాలు
- 559 పథకాల్లో పనిచేస్తున్నవి 117 మాత్రమే
- వినియోగంలో లేకుండా పోయిన 259 పథకాలు
- మొత్తం ఆయకట్టు 3.52 లక్షలు.. నీరందుతోంది 1.55 లక్షల ఎకరాలకే
- గత ఏడాది రూ.370 కోట్లు కేటాయించినా ఖర్చు చేసింది 184.52 కోట్లే
- 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లక్ష్యం.. ఇచ్చింది 3,661 ఎకరాలకు
- మోటార్ల రిపేర్లు, నిర్వహణ వ్యయాన్ని భరించలేక చేతులెత్తేస్తున్న నీటి సంఘాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి అభివృద్ధి కార్పొరేషన్(ఐడీసీ) ద్వారా చేపట్టిన సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ ఉత్తిపోతలుగా మిగులుతున్నాయి. ఓవైపు భారీ ఎత్తిపోతల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం వీటి విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన నిధులతో చిన్న, సన్నకారు రైతులకు సాగునీటి సదుపాయాన్ని కల్పించాల్సి ఉన్నా.. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎత్తిపోతల పథకాలన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగుఫలాలు అందించకుండా పోతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 559 పథకాల కింద 3.52 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉండగా.. అధికారుల అలక్ష్యంతో అది 1.55 లక్షల ఎకరాలను మించడం లేదు.
259 పథకాలు వట్టిపోయాయి..:
తెలంగాణలో ఇప్పటివరకు 3.52 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.1,001 కోట్ల వ్యయంతో మిగతా 559 సాగునీటి ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. ఈ ఎత్తిపోతల నిర్వహణను సాగునీటి రైతు సంఘాలే చూసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలాచోట్ల సంఘాలు ఆర్థికంగా, సాంకేతికంగా సమన్వయం చేసుకోవడంలో విఫలమవడంతో పథకాలు చతికిలపడ్డాయి.
దీనికి తోడు ఎత్తిపోతల పథకాలంటే పూర్తిగా ఆరుతడి పంటలే వేయాల్సి ఉన్నా.. అవగాహణ లేక రైతులు వరిసాగుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో చివరి ఆయకట్టు రైతుకు నీరు చేరడం లేదు. దీనికి తోడు మోటార్లకు రిపేర్లు వచ్చినా, వాటి నిర్వహణలో సాంకేతిక సమస్యలు తలెత్తినా పట్టించుకునే నాథుడే లేడు. దీంతో 559 పథకాల్లో 259 పథకాలు వినియోగంలో లేకుండా పోయాయి. వీటి కింద 77 వేల ఎకరాలకు కొన్నేళ్లుగా చుక్కనీరందడం లేదు. మరో 183 పథకాలు పాక్షికంగా పని చేస్తున్నాయి. వీటి కింద 1.51 లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా అందులో 84 వేల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది.
రూ.185 కోట్లు ఖర్చు.. 3,661 ఎకరాలకే నీరు..
పూర్తిగా పనిచేయని పథకాలను వృద్ధిలోకి తేవడం, పాక్షికంగా పనిచేస్తున్న వాటికి మరమ్మతులు చేయడం, కొత్తగా మరిన్ని ఎత్తిపోతల పథకాలు చేపట్టడానికి ప్రభుత్వం ఐడీసీకి కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. గతేడాది గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృధ్ధి నిధి(ఆర్ఐడీఎఫ్), సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం(ఏఐబీపీ)తో పాటు రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్ నుంచి మొత్తంగా రూ.370 కోట్లు కేటాయించినా అందులో రూ.184.52 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
ఐదు పథకాలకు సంబంధించిన రూ.28.27 కోట్ల ఆర్ఐడీ ఎఫ్ నిధులు ఈ ఏడాది జనవరి వరకు, మరో 62 పథకాలకు చెందిన రూ.63.04 కోట్ల ట్రైబల్ సబ్‌ప్లాన్ నిధులు ఈ ఏడాది మార్చి నాటికి కూడా ఇవ్వకపోవడం, మరో రెండు పథకాల పరిధిలో భూసేకరణ పూర్తికాకపోవడంతో నిధుల ఖర్చు జరుగలేదు. దీంతో 40,043 ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే 3,661 ఎకరాలకు మాత్రమే నీరిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మళ్లీ రూ.255.59 కోట్ల నిధులను కేటాయించారు.
గతేడాది నిధుల ఖర్చు.. (రూ.కోట్లలో)
పథకం కేటాయింపు ఖర్చు
ఆర్ఐడీఎఫ్ 90 55.80
రాష్ట్ర బడ్జెట్ 220 122.59
ఏఐబీపీ 60 6.13
మొత్తం 370 184.52