మీటింగ్‌లకూ వెయిటింగే!
రంపచోడవరం : ఐటీడీఏ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరుతెన్నులు తెలుసుకుని వాటి అమలుపై చర్చించేందుకు వేదికైన ఐటీడీఏ పాలకవర్గ సమావేశాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధుల తీరుతో పాలకవర్గ సమావేశాలు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి. ఏడాదికి మూడుసార్లు పాలకవర్గ సమావేశాలు నిర్వహించాలని నిబంధన ఉన్నా...దానిని పూర్తిగా విస్మరిస్తున్నారు. సుమారు పది నెలల తర్వాత ఈ నెల 29న ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేశారంటే ప్రజాసమస్యలపై వారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.
అమలు కాని తీర్మానాలు
ఐటీడీఏ పాలకవర్గం సమావేశం ఐటీడీఏ చైర్మన్, జిల్లాకలెక్టర్ అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావే శాలు ఏడాదికి సుమారు మూడు సార్లు నిర్వహించాల్సి ఉంది. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై చేసిన తీర్మానాలు అమలు కావడం లేదు. సమావేశం ముగిసిన తరువాత తిరిగి సమావేశం నిర్వహించే వరకూ వాటి ఊసే ఎవరూ ఎత్తడం లేదు. పాలకవర్గ సమావేశానికి వచ్చే ప్రజాప్రతినిధులు(ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, తదితరులు) స్థానికంగా అనేక ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు తదితర కార్యక్రమాల్లో బిజీబిజీగా పాల్గొనడంతో సమావేశ తేదీ ఖరారు కష్టమవుతున్నట్టు సమాచారం.
దీంతో సమావేశాలు నిర్ణీత సమయాల్లో జరగక అనేక శాఖల పనితీరుపై చర్చ జరగడం లేదు. గత సమావేశంలో మైనర్ ఇరిగేషన్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణల పై చర్చ జరిగింది. ఏజెన్సీలో నిర్మించిన చెక్‌డ్యామ్‌ల ద్వారా ఎంత మేరకు సాగు నీరందుతుందనే దానిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే దానిపై ఏ అధికారీ స్పందించలేదు. ఏ నివేదిక ఐటీడీఏకు అందలేదు. అప్పటి ఎమ్మెల్సీ జార్జివిక్టర్ వై.రామవరం అప్పర్ పార్ట్, మారేడుమిల్లిలో చెక్‌డ్యామ్ నిర్మాణాలలో రూ.1.85 కోట్లు దుర్వినియోగమైనట్టు తెలిపారు.
వాటిపై విచారణ చేపట్టలేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అనేక చోట్ల నిధులు స్వాహా జరిగి, లబ్ధిదారులు ఇళ్లు పునాదుల స్థాయిలోనే నిలచిపోయాయి. వై.రామవరం మండలం కానివాడలో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై అప్పటి పాలకవర్గంలో చర్చ జరిగినా నేటికి పరిస్థితిలో ఏ మార్పు లేదు. అప్పట్లో పనిచేసిన అధికారులు బదిలీపై వెళ్లిపోయారు తప్ప గిరిజనులకు న్యాయం జరగలేదు. ఇలాంటి అంశాలపై చర్చ జరిగి గిరిజనులకు న్యాయం జరగాలంటే సకాలంలో పాలకవర్గ సమావేశాలు నిర్వహించాలి.