ఎర్రచందనం అక్రమరవాణాను కట్టడి చేయాలి
డీజీపీ వెంకటరాముడు
నెల్లూరు(క్రైమ్) : జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో కట్టడిచేయాలని డీజీపీ జాస్తి వెంకటరాముడు పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్హాల్లో జిల్లా పోలీసు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. తొలుత ఆయన సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాను అడవిలోనే అరికట్టాలన్నారు.
ఇందుకు గాను కూంబింగ్ దళాలను వెంటనే రంగంలోకి దించాలన్నారు. ఎర్రచందనం నిల్వలున్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించడంతో పాటు గస్తీని ముమ్మరం చేయాలన్నారు. స్మగ్లింగ్, అక్రమ రవాణాకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని, వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్ సైతం నమోదు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలతో పోల్చిచూస్తే నెల్లూరు జిల్లా ప్రశాంతమైనదన్నారు. శాంతిభద్రతల విషయంలో అవరోధాలు పెద్దగా ఉండవన్నారు.
సిబ్బంది అందరూ బాధ్యతయుతగా విధులు నిర్వహించి మెరుగైన శాంతిభద్రతలను ప్రజలకు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్పీ డాక్టర్ గజరావుభూపాల్ జిల్లాలో పోలీసు అధికారులు తీసుకుంటున్న చర్యలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూర్ రేంజ్ ఐజీ ఎన్.సంజయ్, ఏఎస్పీ రెడ్డి గంగాధర్, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.