నవ్వుల రేడుకు కన్నీటి వీడ్కోలు
అద్దంకి, న్యూస్‌లైన్: ఊపిరితిత్తుల కేన్సర్‌తో హైదరాబాద్‌లోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందిన ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం అద్దంకి మండలం శింగరకొండలోని ఆయన ఫామ్‌హౌస్‌లో నిర్వహించారు. ధర్మవరపు భౌతికకాయాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ సందర్శించి నివాళులర్పించారు. ధర్మవరపు భార్య కృష్ణజ, కుమారులు రోహన్ సందీప్, బ్రహ్మతేజలను ఓదార్చారు.
తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఉంచి అంతిమయాత్ర నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫామ్‌హౌస్‌కు మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గరటయ్య, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన కుమారుడు కరణం వెంకటేష్, ఏపీ ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అడహక్ కమిటీ సభ్యుడు ఈదా శ్రీనివాసరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, నాగులపాడు సొసైటీ అధ్యక్షుడు సంది రెడ్డి రమేష్, నగర పంచాయతీ కమిషనర్ టీ వెంకటకృష్ణయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ధర్మవరపు కుమారుడు రోహన్ సందీప్ ఆయన చితికి నిప్పంటించారు. అంతిమయాత్ర సమయంలో ఆయన అభిమానులు పలువురు కన్నీటి పర్యంతమయ్యారు.