హృద్రోగ సమస్యలు... హోమియో చికిత్స
గుండెకు సంబంధించిన అనేక సమస్యలకు హోమియోలో మంచి పరిష్కారాలున్నాయి. కాన్స్టిట్యూషన్ పద్ధతిలో
లక్షణాల ఆధారంగా ఇచ్చే ఈ మందులతో గుండెకు సంబంధించిన ఎన్నో రకాల జబ్బులను సమర్థంగా నయం చేయవచ్చు. గుండె సమస్యలకు వాడే హోమియో మందులలో కొన్ని...
డిజిటాలిస్ : గుండెకు సంబంధించిన వ్యాధులకు డిజిటాలిస్ చాలా ప్రధానమైనది. రోగికి నాడి నెమ్మదిగా కొట్టుకోవడం, గుండె బలహీనంగా ఉండటం, ఒత్తిడి వల్ల వేగం పెరగడం, నాడీకంపన క్రమం తప్పడం, ఆగి ఆగి నెమ్మదిగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వీరికి చిన్నపాటి కదలికలకు కూడా గుండె వేగంగా కొట్టుకోవడం లేదా రోగికి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించడం వంటివి ప్రధాన లక్షణాలు. గుండె గోడ కండరం బలహీనపడి ఉబ్బడం, చర్మం చల్లబడటం, నీలివర్ణంలోకి మారడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం... కొందరిలో కామెర్లు, కాలేయం వాపు వంటి వాటికి కూడా డిజిటాలిస్ చక్కగా పనిచేస్తుంది. వికారం, వాంతులు, విరేచనాలు, కడుపులో మంట, మూత్రంలో ఆల్బుమిన్ పోవడం, కాళ్లు వాపు వంటి ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. ఇక బృహద్ధమని (అయోర్టా) ఉబ్బడం, గుండెనొప్పి, గుండెవాపు, కొవ్వు చేరి గుండె కణజాలం క్షీణత, హృదయ స్పందనల వేగం తక్కువగా ఉండటం వంటి వివిధ రకాల గుండె సమస్యలకు ఇది వాడదగ్గ ఔషధం.
కాక్టస్ : హృదయ సంబంధిత హోమియో ఔషధాలతో తదుపరి ముఖ్యమైన ఔషధం కాక్టస్ అని చెప్పవచ్చు. కాక్టస్ రోగుల్లో గుండెను ఇనుముతో గట్టిగా కట్టినట్లుగా అనిపించడం, గుండె సాధారణ కదలికలు స్తంభించినట్లుగా / అదిమివేసినట్లుగా అనిపించడం ఈ ఔషధం ముఖ్య లక్షణం. గుండెను బంధించినట్లుగా, ఛాతీపై బరువు పెట్టిన భావనకు వీళ్లు గురవుతారు. గుండెనొప్పి, ముళ్లతో గుచ్చినట్లుగా, మెలిదిప్పినట్లుగా ఉండటం... ఈ నొప్పి ఎడమచేతి వరకు పాకడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ ఔషధం ఉపయోగకరం. విపరీతమైన గుండెదడ, పడుకున్నప్పుడు ఊపిరి ఆగిపోయినట్లుగా అనిపించడం, ఎడమచేతిలో తిమ్మిర్లు వంటి లక్షణాలు ఉంటాయి. దీనిని ఎలెవనో క్లాక్ రెమిడీ అని కూడా అంటారు. అనగా ఉదయం 11 గంటలు లేదా రాత్రి 11 గంటలకు గాని వ్యాధి లక్షణాలు అధికం కావడం ఈ ఔషధం ప్రత్యేకత.
కాల్మియా లాటిఫోలియా : కాల్మియా ముఖ్యంగా నరాలు, గుండె, రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. ‘రుమాటిక్ గుండెజబ్బు’ అంటే కీళ్లవాతం వల్ల కలిగే గుండెజబ్బులకు వాడదగిన మందు. విపరీతమైన గుండెదడ, కీళ్లవాతం కారణంగా గుండె కణాలు, గుండె కవాటం మందంగా మారడం, ఆందోళన కలగడం, గుండె స్పందనలు సంకోచవ్యాకోచాలు త్వరితగతిన సంభవిస్తూ ఉండటంతోపాటు మంటతో కూడిన గుండెనొప్పి, ఈ నొప్పి వెనక్కి లేదా చేతికి పాకుతున్నట్లుగా అనిపించడం ప్రధాన లక్షణాలు. గౌట్, కీళ్లవాతం గుండెకు పాకినప్పుడూ, ఎక్కువగా పొగాకు వాడేవారిలో వచ్చే ‘టొబాకో హార్ట్’ వ్యాధికి కూడా ఇది ఉపయోగకరం.
అకోనైట్ : ఆందోళన, చనిపోతానేమోనన్న భయం ఈ ఔషధం ముఖ్యలక్షణం. హృదయ స్పందన వేగంగా ఉండటం, ఎడమభుజంలో నొప్పి, ఛాతీలో నొప్పి, గుండెదడ, చేతివేళ్లలో తిమ్మిర్లు వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇది వాడదగ్గ ఔషధం. రక్తపోటు అధికంగా ఉండి, ఎడమచేతిలో సూదులు గుచ్చినట్లుగా ఉండటం, హఠాత్తుగా వచ్చే గుండెనొప్పికి అకోనైట్ బాగా పనిచేస్తుంది. బృహద్ధమని వాపు, గుండె గోడ కండరం వాపునకూ అకోనైట్ ఉపయోగకరం.
నాజా ట్రిపుడియన్స్ : నొప్పి మెడ వెనక భాగంలోకి పాకి, అక్కడి నుంచి ఎడమభుజం, చేతికి వ్యాపించడం, సూదులతో గుచ్చినట్లుగా విపరీతమైన గుండెనొప్పి, నాడి కంపన క్రమం తప్పడం, ఛాతీపైన అదిమినట్లుగా, బరువు పెట్టినట్లుగా అనిపించడం, ఆందోళన, భయంతో పాటు శారీరక శ్రమ పెరిగినప్పుడు గుండెదడ అధికమవ్వడం వంటి లక్షణాలు కలిగి ఉంటాయి. గుండె కణజాల పరిమాణం పెరగడం, కీళ్లవాతం వల్ల వచ్చే హృదయకండరాల వాపు, కంఠవాతం వల్ల వచ్చే పొడిదగ్గు ఉన్నవారికి నాజా చక్కగా పనిచేస్తుంది.
లిలియం టిగ్రినం : గుండెనొప్పి, గుండెదడ, వణుకు, తొందరపాటు, ఆవేదన వంటి లక్షణాలు కలిగి ఉండటం, ఛాతీ ఎడమవైపుగా విపరీతమైన నొప్పి కలగడం, ఛాతీ బరువెక్కడం, నొప్పి ఒక అవయవం నుంచి మరొక అవయవానికి పాకడం, నాడీ కంపన వేగం పెరగడం వంటి లక్షణాలు ఉన్నవారికి ‘లిలియం’ ఉపయోగకరం.
లిథియం కార్బ్ : దీర్ఘకాలికమైన కీళ్లవాతంతో పాటు హృద్రోగ సమస్యలు, కంటిసమస్యలు ఉన్నవారికి వాడదగిన ఔషధం. చిన్న కీళ్లలో తరచుగా వచ్చే వాపు, గుండెనొప్పి బాదినట్లుగా, సూదులతో గుచ్చినట్లుగా ఉండి, నొప్పి వెనకకు వ్యాపించడం, ముందుకు ఒంగినప్పుడు లేదా మూత్ర విసర్జనకు వెళ్లే ముందు నొప్పి అధికం కావడం, మూత్ర విసర్జన తర్వాత ఉపశమనం... ఈ ఔషధ లక్షణాలు.
బెరైటా మూర్ : ఇది ముఖ్యంగా ధమనులు గట్టిపడినప్పుడు, హృదయ సంకోచ ఒత్తిడి (సిస్టోలిక్ ప్రెషర్) పెరిగినప్పుడు, హృదయ వ్యాకోచ ఒత్తిడి (డయాస్టోలిక్ ప్రెషర్) తక్కువ అయినప్పుడు వాడదగిన దివ్యౌషధం. పైన పేర్కొన్న మందులు రోగుల అవగాహన కోసం మాత్రమే. వీటిని నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో, సరైన మోతాదులో మాత్రమే వాడాలి.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్,
హోమియోకేర్ ఇంటర్నేషనల్