Dil: ‘దిల్’ రాజు.. బాక్సాఫీస్ రారాజు
తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌కు, ఆ సంస్థ అధినేత దిల్ రాజుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దిల్ రాజు కాంపౌండ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే.. హీరో,హీరోయిన్ ఎవరనేది చూడకుండా థియేటర్స్‌కి వస్తున్నారు సినీ ప్రియులు. అయితే ఇదంత ఒక్కరాత్రిలో వచ్చిన సక్సెస్ కాదు. ఎన్నో ఒడిదుడుకులు..అనుభవాలతో నేడు ఈ స్థానంలో నిలబడ్డారు.
డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారాడు. 20 ఏళ్ల క్రితం (2003, ఏప్రిల్ 4) ‘దిల్’ సినిమా విడుదలై ప్రేక్షకుల ‘దిల్’గెలుచుకుంది. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని వెలమకుచ వెంకటరమణారెడ్డి(దిల్ రాజు) తన స్నేహితుడు గిరి, తమ్ముడు శిరీష్ తో కలిసి నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. అప్పటి నుంచి వెంకటరమణారెడ్డి కాస్త ‘దిల్ రాజు’గా మారిపోయాడు.
ఇక ఆ తర్వాత నుంచి వరుసగా తన సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై సినిమాలు నిర్మిస్తూ కెరీర్ లో ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకుని గోల్డెన్ లెగ్ నిర్మాతగా మంచి పేరు దక్కించుకున్నారు. ఈ 20 ఏళ్లతో 50 చిత్రాలను నిర్మించి అత్యధిక సక్సెస్ రేటు సాధించారు. మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, ప్రభాస్ లతో పాటు టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితోనూ దిల్ రాజు సినిమాలు చేశాడు. మరోవైపు రౌడీ బాయ్స్ చిత్రంతో తన తమ్ముడు శిరీష్ కొడుకు ఆశిష్‌రెడ్డి హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులను పరిచయం చేశాడు. 2004లో ఆర్య సినిమాతో సుకుమార్‌ని పరిచయం చేశాడు. ఇక 2006లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాతోనే భాస్కర్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మున్నా సినిమాతో వంశీ పైడిపల్లిని, కొత్త బంగారులోకం సినిమా ద్వారా శ్రీకాంత్ అడ్డాలను టాలీవుడ్‌కి అందించారు.
‘వారిసు’చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ హీరోగా నటించిన ఆ చిత్రం.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ 20 ఏళ్ల జర్నీలో దిల్ రాజు ఎన్నో అవార్డులను పొందారు. ‘శతమానం భవతి’తో జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. బలగంతో అంతర్జాతీయ అవార్డును గెలుచుకున్నారు.
దిల్ రాజు ప్రొడక్షన్స్..
కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేశాడు. ఈ ప్రొడక్షన్ హౌస్‌కు దిల్‌రాజు కూతురు హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ బ్యానర్లో ఇటీవల ‘బలగం’సినిమాను నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. కమెడియన్ వేణు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించాలని దిల్ రాజు తపిస్తాడు. అందువల్లే దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే.. ఏదో ఒక వెరైటీ ఉంటుందని ప్రేక్షకులు విశ్వసిస్తారు.