అన్ని దశల్లోనూ నాణ్యత
సన్ ఫార్మా ఫౌండర్ దిలీప్ శాంఘ్వి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాణ్యత పరీక్షల్లో ఔషధం అర్హత సంపాదిస్తే సరిపోదు. తయారీ ప్లాంటు కూడా రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందేనని సన్ ఫార్మాస్యూటికల్ వ్యవస్థాపకులు దిలీప్ ఎస్ శాంఘ్వి అన్నారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వ్యవస్థాపకులు స్వర్గీయ కె.అంజరెడ్డి స్వయంగా రాసిన జ్ఞాపకాల సమాహారం ‘యాన్ అన్ఫినిష్డ్ ఎజెండా’ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు భారతీయ కంపెనీలపై పెరుగుతున్న నేపథ్యంలో ఆయనీ విధంగా స్పందించారు. ఎఫ్డీఏ తనిఖీల సమయంలో భారత అధికారులు తప్పనిసరిగా ఉండాల్సిన ఆవశ్యకత లేదని వ్యాఖ్యానించారు. కంపెనీల్లో ఉత్తమ తయారీ విధానం (జీఎంపీ) పెరిగేలా డీసీజీఐ కృషి చేస్తోందని అన్నారు. అంజిరెడ్డి స్ఫూర్తిని కొనసాగిస్తామని పుస్తకావిష్కరణ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ కె.సతీష్ రెడ్డి, సీఈవో జి.వి.ప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది భారత్తో పాటు అంతర్జాతీయంగా ఫార్మా రంగం వృద్ధి బాటన పడుతుం దన్నారు. యువతకు ఈ రంగంలో మంచి అవకాశాలు ఉంటాయన్నారు.