స్మార్ట్ ...స్మార్ట్ గా...
మార్కెట్లో 3డీ టీవీల హవా..
జిల్లాలోని మార్కెట్లో 3డీ (డైమన్షన్ పిక్చర్) టీవీలు అమ్మకాలు కొనసాగుతున్నాయి. మామూలుగా థియేటర్లలో సినిమాలు చూడడం కంటే భిన్నంగా ఉండాలని భావించే వారు 3డీ టీవీలను కొనుగోలు చేస్తున్నారు. 3డీ టీవీతోపాటు ప్రత్యేకమైన కళ్ల అద్దాలు ఇస్తారు. అందులో సినిమాలు చూస్తే కొన్ని సన్నివేశాలు మన మీదకు వచ్చినట్లుగా అనుభూతి కలుగుతుంది. 3డీలో అలాంటి సినిమాలు చూడడం థ్రిల్లింగ్ గా ఉంటుంది. అంతేకాకుండా ఈ టీవీలో ఇంటర్నెట్ వినియోగించే సౌలభ్యం కూడా ఉంది.
స్మార్ట్ టీవీలో ఇంటర్నెట్..
స్మార్ట్ టీవీకి ఎంతో క్రేజీ పెరిగింది. టీవీలో అనేక సౌలభ్యాలున్నాయి. ఖరీదెక్కువైనా ఉపయోగాలు కూడా బాగానే ఉన్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. టీవీ కార్యక్రమాలు చూడడంతో టీవీలోనే ఇంటర్నెట్ కావాలనుకునే వారికి టీవీ ఎంతో ఉపయోగకరంగా ఉంది. కంప్యూటర్ తరహాలో టీవీలోనే ఇంటర్నెట్ వినియోగించవచ్చు. ప్రత్యేకంగా కంప్యూటర్ కొనుగోలు చేయనవసరం లేదు. విదేశాల్లో ఉన్న వారితో చిన్న స్క్రీన్ కంప్యూటర్లో ఇంటర్నెట్ సహాయంతో కెమెరాల ద్వారా నేరుగా మాట్లాడుకునే వారు. స్మార్ట్ టీవీలో కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఉండడంతో పెద్ద తెర పై తమ వారితో మాట్లాడుకునే సౌలభ్యం ఉంది.
ఇలా నెట్లోకి వెళ్లాలి..
స్మార్ట్, 3డీ టీవీల్లో ముందుగా నెట్లో అవాంతరాలు లేని నెట్ వర్క్‌ను ఎం పిక చేసుకోవాలి. టీవీలో హోం అనే ఆప్షన్ ఉంటుంది. అందులో వైఫై, నెట్ కనెక్షన్ వస్తుంది. నెట్లోకి వెళ్లగానే గూగుల్ సెర్చ్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మనకు అవసరమైన గూగుల్, జీమెయిల్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా ఎందులోకైనా వెళ్లవచ్చు.
స్క్రీన్ మిర్రర్..
3డీ, స్మార్ట్ టీవీలకు స్క్రీన్ మిర్రర్ అనే సౌలభ్యం ఉంది. వైఫై సెల్ఫోన్లో ఉన్న సినిమాలు, పాటలు, ప్రోగ్రాంలను టీవీలకు అనుసంధానం చేస్తే టీవీలో కనిపిస్తుంది. కేవలం ఈ సౌలభ్యం స్మార్ట్ టీవీలకు మాత్రమే ఉంటుంది.
నలుపు తెలుపు నుంచి.. స్మార్ట్ వరకు
సుమారు మూడు దశాబ్దాల క్రితం నలుపు తెలుపు టీవీలు మార్కెట్‌ను శాసించాయి. ఆ తర్వాత కలర్ టీవీలు వచ్చాయి. రెండేళ్ల క్రితం వరకు కలర్ టీవీలు మార్కెట్‌ను ఏలాయి. అవి కనుమరుగయ్యాయి. ఎల్సీడీలు వచ్చాయి. వాటి వెనకాలే ఎల్ఈడీలు వచ్చాయి. వాటి అమ్మకాలు జరుగుతున్న తరుణంలో స్మార్ట్, 3డీ టీవీలు వచ్చాయి. దీంతో కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వారు స్మార్ట్, 3డీ టీవీలకు ఆకర్షితులవుతున్నారు. కొద్ధి రోజుల్లో ఎల్సీడీ, ఎల్ఈడీలు కూడా కనుమరుగయ్యే పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఆర్గానిక్ ఎల్ఈడీ మార్కెట్లోకి విడుదలయ్యాయి