దీపపై ట్వీట్ చేసినందుకు లైంగికంగా వేధించారు!
జైపూర్: భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై ట్వీట్ చేసినందుకు ఓ జైపూర్ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఫొటోలను ఆన్లైన్లో సర్క్యులేట్ చేయడమే కాకుండా లైంగికంగా హింసిస్తామని బెదిరిస్తూ ఆమెకు బెదిరింపులు వెల్లువెత్తాయి. ఈ బెదిరింపుల నుంచి తనను కాపాడాలని ఆమె విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, కేంద్రమంత్రి మేనకా గాంధీ, రాజస్తాన్ సీఎం వసుంధరారాజేకు ఆన్లైన్లో విజ్ఞప్తి చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను ఆన్లైన్లో వేధించిన వారిపై సైబర్ కేసు నమోదుచేశారు. ఐటీ చట్టం సెక్షన్ 67, 66 డీ కింద కేసులు నమోదుచేశారు. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు జైపూర్ పోలీసు కమిషనర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు.
ఒలింపిక్స్ వాల్ట్ విభాగంలో ఫైనల్లో దీపా కర్మాకర్ పాల్గొంటున్న నేపథ్యంలో గత ఆదివారం రాత్రి 26 ఏళ్ల యువతి ట్వీట్ చేసింది. 'డేత్ వాల్ట్ గా పేరొందిన ప్రోడోనోవా విన్యాసాలు చేయడం ధనిక దేశాల జిమ్నాస్ట్‌లకు చాలా సులువు. వారికి మంచి మౌలిక వసతులు, మెరుగైన శిక్షణ, అన్నీ వారికి అందుబాటులో ఉంటాయి. కానీ ఈరోజు దీప ఒలింపిక్స్ పతకం కోసం తన ప్రాణాలకు పణంగా పెట్టబోతున్నది. ఏ దేశంలోనైనా మెడల్ కన్నా ప్రాణం విలువైనది' అని ఆమె పేర్కొంది. అయితే దేశాన్ని ఉద్దేశించి 'డ్యామ్' అన్న పదాన్ని వాడినందుకు ఆమెను తప్పుపడుతూ.. లైంగికంగా దాడులు చేస్తామని కొందరు నికృష్టులు ఆన్లైన్లో పోస్టులు పెట్టారు. ఆమె ఫొటోలను వ్యాప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదుచేసుకున్న పోలీసులు బాధితురాలిని విచారించారు. ఈ సందర్భంగా ఆ పదం ఎందుకు వాడారని పోలీసులు కూడా అడిగారని, అది భారత్ ను ఉద్దేశించి తాను వాడలేదని చెప్పడంతో వారు ఆ విషయాన్ని వదిలిపెట్టారని బాధితురాలు తెలిపింది.