ఏడాది హుద్‌హుద్‌కు ఏపైన పలకరింపు
ఆసియాలో శరవేగంగా పెరుగుతున్న నగరాలలో ఒకటైన విశాఖపట్నం 2014 అక్టోబర్ 12న హుద్‌హుద్ తాకిడికి అల్లల్లాడింది. పదిహేను రోజుల్లో ఒక్కసారిగా శతాబ్దం వెనుకకు విసిరివేయబడింది. నీళ్లు, కరెంటు లేకుండా బతుకీడ్చింది. 1930లో నెల్లూరులో భయానక గాలివాన వచ్చినప్పుడు దీపాల పిచ్చయ్య శాస్త్రి ‘నెల్లోరి గాలివాన’ దీర్ఘకవిత రాసేరు. అలా అక్షరీకరించిందే రామతీర్థ ‘హుద్‌హుద్ నగర కవిత్వం’. ‘పన్నెండు గంటలలో/ పన్నెండు దశాబ్దాలు వెనక్కి/ పిలకట్టుకు విసిరి పారేయడం/ అదీ యుద్ధ ప్రాతిపదిక/ పరిచయం చేసుకో/ నా పేరు జలశిఖ’ అంటూ హుద్‌హుద్ తనను తాను పరిచయం చేసుకుని, ‘ప్రకృతి యుద్ధ ప్రాతిపదిక ముందు/ మీదెప్పుడూ/ మందకొడి వృద్ధ ప్రాతిపదిక’ అంటూ నగరానికి సవాల్ విసురుతుంది.
కళ్లెదుటే కూలిపోతున్న పెద్దచెట్లనూ, ఒక పైశాచిక తెరలా వచ్చి కొబ్బరిచెట్ల శిరస్సులను ఉత్తరించేసి పోతున్న గాలినీ చూస్తూ ఆవేదనతో, ‘చెట్టు పడిపోయిన ప్రతిచోటా/ఒక కవితను నిలబెడదాం/చెట్టు కూలిన వేళను/మళ్లీ ఒక మొక్క నాటి రద్దు చేద్దాం’ అంటూ చెట్లు మానవాళి మనుగడకు ఆకుపచ్చని ఊపిరితిత్తులని చెబుతాడు కవి. కేవలం ప్రకృతి బీభత్సాన్నే కాదు, ఆ సమయంలో బయటపడిన మానవస్వభావాన్ని, స్వీయానుభవాల్ని కూడా కవి అందించాడు. పదినెలల తర్వాత కవితలో మళ్లీ ప్రసవ శ్రమతో పత్రహరితాన్ని ప్రసవించి పచ్చి బాలింతలా కళకళలాడుతున్న విశాఖను ‘అంతరాయాలుంటాయి/అంతరించి పోవడం ఉండదు’ అని ప్రస్తుతిస్తాడు.
- జగద్ధాత్రి
8712293994