directer
-
ఎస్పీజీ డైరెక్టర్‌కు సోనియాగాంధీ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : తమ కుటుంబానికి 28 ఏళ్లుగా రక్షణగా ఉన్న ఎస్పీజీ భద్రతా విభాగానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలకు ఎస్పీజీ రక్షణ హోదా తొలగిస్తూ కేంద్రప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎస్పీజీ స్థానంలో సీఆర్పీఎఫ్ దళాలతో జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించారు. ఈ నిర్ణయంపై రాహుల్ గాంధీ ఆరోజే స్పందించగా, సోనియా గాంధీ ఒకరోజు ఆలస్యంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఎస్పీజీ డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హాకు లేఖ రాశారు. పని పట్ల నిబద్దత, అంకితభావంలలో ఎస్పీజీ సిబ్బంది పనితీరు అత్యుత్తమమని ఆ లేఖలో ప్రశంసించారు. మరోవైపు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. వ్యక్తిగత, రాజకీయ కక్షలతో నెహ్రూ కుటుంబాన్ని వేధిస్తున్నారని మండిపడుతున్నారు. కాగా, 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం నెహ్రూ కుటుంబానికి ఎస్పీజీ రక్షణ కల్పిస్తూ అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి ఉత్తర్వులు జారీ చేశారు. -
సినిమాటోగ్రాఫర్ అశోక్‌కుమార్ కన్నుమూత
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు అశోక్ కుమార్ అగర్వాల్ మరణించారు. ఆయన గత ఆరు నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని పలు ఆస్పత్రులలో గత ఆరు నెలలుగా ఆయనకు వివిధ చికిత్సలు అందించారు. ఆయన ఆరోగ్యం మరీ విషమించడంతో కొన్ని రోజుల క్రితమే ఇంటికి తీసుకొచ్చారు. పలు భారతీయ భాషల్లో దాదాపు వంద సినిమాలకు ఆయన కెమెరామన్‌గా పనిచేశారు. జీన్స్ లాంటి అద్భుతమైన చిత్రాలు ఆయన కెమెరా నుంచి జాలువారినవే. 1980లో 'నెంజాతై కిల్లాతె' అనే తమిళ చిత్రానికి గాను ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు. సచ్చాప్యార్ లాంటి హిందీ, బ్యాక్ వాటర్స్ లాంటి ఇంగ్లీషు సినిమాలకు కూడా ఆయన సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. 1988లో తెలుగులో సంచలన విజయం సాధించిన ప్రేమకథా చిత్రం 'అభినందన' సహా కొన్ని తమిళ, హిందీ సినిమాలకు కూడా అశోక్ కుమార్ దర్శకత్వం వహించారు. భారతీయ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలతో కలిసి ఆయన పనిచేశారు. (ఇంగ్లీషు కథనం)