Director Chandra Mahesh
-
నాలుగు భాషల్లో సినిమా చేయడం ఓ రికార్డ్ : దర్శకుడు చంద్రమహేశ్
‘‘ఈ చిత్రకథానాయకుడు మహదేవ్ నాన్నగారు శ్రీరామ్‌రెడ్డిగారు... మా నాన్నగారికి మంచి స్నేహితుడు. చంద్రమహేశ్ మా సంస్థకు సన్నిహితుడు. ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’’ అని హీరో రానా అన్నారు. మహదేవ్, అంజనా మీనన్ జంటగా సినీ నిలయ క్రియేషన్స్ పతాకంపై తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చంద్రమహేశ్ దర్శకత్వంలో పీవీ శ్రీరామ్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘రెడ్ ఎలర్ట్’. రవివర్మ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రం ఆడియో సీడీని రానా ఆవిష్కరించారు. చంద్రమేహ శ్ మాట్లాడుతూ- ‘‘ఏకకాలంలో నాలుగు భాషల్లో సినిమా చేయడం ఓ రికార్డ్. అందుకే ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’వారు మా రికార్డ్‌ను గుర్తించారు. కన్నడ, మలయాళ భాషల్లో ఇటీవలే విడుదలై, మంచి విజయం సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో త్వరలో విడుదల చేయనున్నాం’ అని తెలిపారు. ‘‘మా నాన్నగారు మన మధ్య ఉండి ఉంటే బాగుండేది. ఆయన ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నా. చంద్రమహేశ్గారు కష్టపడి సినిమా తీశారు. మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అని హీరో మహదేవ్ చెప్పారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, చిత్రసమర్పకుడు త్రిలోక్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత జైపాల్‌రెడ్డి, అంజనా మీనన్ తదితరులు మాట్లాడారు. -
మంచి నిర్మాతను కోల్పోయాం : దర్శకుడు చంద్రమహేశ్
‘‘ఏక కాలంలో నాలుగు భాషల్లో నిర్మితమైన తొలిచిత్రం ‘రెడ్ అలర్ట్’. ఈ చిత్ర నిర్మాత పి.వి. శ్రీరాంరెడ్డి సినిమా రంగం గురించి ఎన్నో కలలు కన్నారు. ఇంత మంచి నిర్మాతను కోల్పోవడం తెలుగు సినిమా దురదృష్టం’’ అని చంద్రమహేశ్ పేర్కొన్నారు. హెచ్.హెచ్. మహాదేవ్, రవి, అమర్, తేజ హీరోలుగా చంద్రమహేశ్ దర్శకత్వంలో సినీ నిలయ క్రియేషన్స్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ మలయాళ భాషల్లో పీవీ శ్రీరాంరె డ్డి నిర్మించిన చిత్రం ‘రెడ్ అలర్ట్’. గురువారం హైదరాబాద్‌లో ఈ సినిమా థియేటర్ ట్రైలర్‌ను నటుడు పోసాని కృష్ణమురళి ఆవిష్కరించారు. ఇటీవలే మృతిచెందిన నిర్మాత శ్రీరాం రెడ్డికి యూనిట్ సభ్యులు నివాళులు అర్పించారు. డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. హెచ్.హెచ్. మహాదేవ్ మాట్లాడుతూ- ‘‘ నాన్న చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఈ రోజు నాలుగు భాషల్లో సినిమా విడుదల చేయాలని నాన్న అనుకున్నారు. త్వరలోనే పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. నటుడు ‘గుండు’ సుదర్శన్ మాట్లాడుతూ- ‘‘శ్రీరాంరెడ్డి గారు బంగారం లాంటి మనిషి. కొత్త దర్శకులను ప్రోత్సహించాలని ఎన్నో ప్రణాళికలు రచించారు. ఆయన లోటు ఎన్నటికీ తీరనిది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు అమర్, తేజ, రచయిత వెనిగళ్ల రాంబాబు, శ్రీరాం చౌదరి, ఛాయాగ్రాహకుడు కల్యాణ్ సమి, నృత్య దర్శకులు ప్రకాశ్, చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు.