మంచి నిర్మాతను కోల్పోయాం : దర్శకుడు చంద్రమహేశ్
‘‘ఏక కాలంలో నాలుగు భాషల్లో నిర్మితమైన తొలిచిత్రం ‘రెడ్ అలర్ట్’. ఈ చిత్ర నిర్మాత పి.వి. శ్రీరాంరెడ్డి సినిమా రంగం గురించి ఎన్నో కలలు కన్నారు. ఇంత మంచి నిర్మాతను కోల్పోవడం తెలుగు సినిమా దురదృష్టం’’ అని చంద్రమహేశ్ పేర్కొన్నారు. హెచ్.హెచ్. మహాదేవ్, రవి, అమర్, తేజ హీరోలుగా చంద్రమహేశ్ దర్శకత్వంలో సినీ నిలయ క్రియేషన్స్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ మలయాళ భాషల్లో పీవీ శ్రీరాంరె డ్డి నిర్మించిన చిత్రం ‘రెడ్ అలర్ట్’.
గురువారం హైదరాబాద్‌లో ఈ సినిమా థియేటర్ ట్రైలర్‌ను నటుడు పోసాని కృష్ణమురళి ఆవిష్కరించారు. ఇటీవలే మృతిచెందిన నిర్మాత శ్రీరాం రెడ్డికి యూనిట్ సభ్యులు నివాళులు అర్పించారు. డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. హెచ్.హెచ్. మహాదేవ్ మాట్లాడుతూ- ‘‘ నాన్న చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఈ రోజు నాలుగు భాషల్లో సినిమా విడుదల చేయాలని నాన్న అనుకున్నారు.
త్వరలోనే పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. నటుడు ‘గుండు’ సుదర్శన్ మాట్లాడుతూ- ‘‘శ్రీరాంరెడ్డి గారు బంగారం లాంటి మనిషి. కొత్త దర్శకులను ప్రోత్సహించాలని ఎన్నో ప్రణాళికలు రచించారు. ఆయన లోటు ఎన్నటికీ తీరనిది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు అమర్, తేజ, రచయిత వెనిగళ్ల రాంబాబు, శ్రీరాం చౌదరి, ఛాయాగ్రాహకుడు కల్యాణ్ సమి, నృత్య దర్శకులు ప్రకాశ్, చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు.