వారి రొమాన్స్ ఇప్పట్లో చూడలేమా!
ముంబై: బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే, కండలవీరుడు సల్మాన్ ఖాన్ లపై గత కొన్ని రోజులుగా ప్రచారమవుతున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, బిగ్ బీ అమితాబ్ లాంటి అగ్రనటులతో స్ర్కీన్ షేర్ చేసుకున్న దీపికా.. సల్మాన్ తో రొమాన్స్ చేయాలని ఆశపడింది. కానీ ఆమె ఆశలు ఇప్పటివరకు తీరలేదు. అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ గతంలో సల్మాన్ తో 'ఎక్ థా టైగర్', 'బజరంగీ బాయిజాన్' లాంటి సక్సెస్ ఫుల్ మూవీలను తీశాడు. ఇప్పుడు వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడవ సినిమాకు శ్రీకారం చుట్టారు. 'ట్యూబ్ లైట్' అనే టైటిల్ తో ఓ మూవీని కబీర్ తీయనున్నాడు.
ఇందులో సల్మాన్ కు జోడీగా దీపికా కనిపించనుందని ప్రచారం జరిగింది. ఇందులో వాస్తవం లేదని ఓ బాలీవుడ్ వెబ్సైట్ తేల్చేసింది. కథ, హీరోహీరోయిన్ల విషయంలో కబీర్ చాలా కఠినంగా ఉంటాడు. క్రేజీ కాంబినేషన్లు అంటూ వాటి జోలికెళ్లకుండా కేవలం పనిని నమ్ముకుని పనిచేసే దర్శకుడు ఆయన. అందుకే బాలీవుడ్ ఫ్యాన్స్ తో పాటు దీపికా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా ఈ కాంబినేషన్ పై కబీర్ ఇష్టం చూపలేదట. 1960 దశకంలో ఇద్దరు సోదరుల వాస్తవకథనే 'ట్యూబ్ లైట్' రూపంలో తెరకెక్కించనున్నాడు కబీర్. హీరోయిన్ ఎంపిక కోసం కబీర్ చాలా ఆడిషన్స్ నిర్వహించడంతో దీపికాకు అవకాశం లేదన్న విషయం వెల్లడైంది.