టీ. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల దూకుడు
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పక్ష్యాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ప్రతిపక్షనేత జానారెడ్డి సభలో లేకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దూకుడు పెంచారు. లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. అధికార టీఆర్ఎస్ను ఇరుకునపెట్టే యత్నం చేశారు.
చర్చ మధ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించడంతో సభలో దుమారం రేగింది. ఈ సమయంలో నిరసన తెలిపేందుకు మైక్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండుసార్లు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఏడు మండలాలపై ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అనంతరం ఈ విషయంపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ హరీశ్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చారు.