Suchitra Divvela: అరటి ఆకు లేకపోతేనేం.. అరెక్కా పళ్లెం ఉందిగా!
పెళ్లంటే... బంధువులు, స్నేహితులతో కలిసి పచ్చటి ఆరిటాకులో పిండివంటలన్నీ చక్కగా వడ్డించుకుని ఆకు పచ్చిదనాన్ని, పచ్చదనాన్నీ ఆస్వాదిస్తూ భోజనం చేయాలని ఎవరికి మాత్రం ఉండదు? అయితే ఇప్పుడన్నీ నిలబడి తినే బఫే భోజనాలే. అరటి ఆకు లేకపోతేనేం... అరెక్కా ప్లేట్ ఉంది.
సుచిత్ర దివ్వెలది మచిలీపట్నం. చదువు, ఉద్యోగం అన్నీ హైదరాబాద్‌లోనే. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా జీతం బాగానే ఉంది. లైఫ్ అంటే నెల చివర బ్యాంకు బాలెన్స్‌లో మిగులు చూసుకుని సంతృప్తి చెందడం కాదనిపించేది. పిల్లలు వేసే అనేక ప్రశ్నల్లోంచి ఆమెకు అనేక సందేహాలు వస్తుండేవి. ఉద్యోగం, మోడరన్లైఫ్ పరుగులో పడి ఏదో కోల్పోతున్నామని కూడా అనిపిస్తుండేది. ఇప్పుడు మనం కాలుష్యరహితంగా జీవించిన గడచిన తరాన్ని చూస్తున్నాం.
రేపటి రోజున పిల్లలకు ఎలాంటి జీవితాన్ని మిగులుస్తున్నాం... అని తనను తాను ప్రశ్నించుకునేది. నిజానికి ఇది తన ఒక్క ఇంటి సమస్య కాదు. కొంత సమయం తీసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తే రాబోయే తరంలో ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులకు పిల్లల నుంచి ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతాయి. ఇంత ఆలోచించిన తర్వాత సుచిత్ర తనవంతుగా ఏదో ఒకటి చేయాలనుకున్నారు.
కర్ణాటకలో ఉన్న తన స్నేహితుల ద్వారా అక్కడ విరివిగా లభించే పోకచెట్ల బెరడును ఇలా ఉపయోగించవచ్చని తెలుసుకుంది. ఇక ఆ ప్రయత్నాన్ని ఒక క్రమపద్ధతిలో పెట్టగలిగింది. వెయ్యిలో ఒకరైనా ఇలాంటి ప్రయత్నం చేస్తే ఇకపై ఏ వేడుకలోనూ ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు వాడాల్సిన అవసరం ఉండదంటారామె.
చెట్టును కొట్టకుండానే..!
‘‘పోక చెట్టు నుంచి సేకరించిన మెటీరియల్‌తో ప్లేట్ అనగానే చెట్టుకు హాని కలిగిస్తారని అపోహ పడడం సహజమే. కానీ పోకచెట్టు కూడా కొబ్బరి చెట్టులాగానే కాయల కోసం గెల వేస్తుంది. పూత దశలోనే గెలను కప్పి ఉంచిన పొర విచ్చుకుంటుంది. కాయలు ముదిరి, గెలను కోసే సమయానికి ఈ పొర కూడా ఎండిపోయి రాలిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అలా సేకరించిన బెరడు లాంటి పొరను శుభ్రం చేసి, గుండ్రగా కానీ నలుచదరంగా కానీ కత్తిరించి మౌల్డ్‌లో పెట్టి వేడి చేస్తే ప్లేట్ రెడీ అవుతుంది.
స్పూన్లు, కప్పులకు కూడా ఇదే పద్ధతి. ఈ చెట్లు కర్ణాటకలో దావణగెరె, చెన్నగిరి, షిమోగా, తుమ్కూరులో ఎక్కువ. ఇక కేరళ, అస్సాంలో కూడా ఉంటాయి. కానీ నాకు పరిచయమైన మిత్రులు కర్ణాటక వాళ్లు కావడంతో నేను అక్కడి నుంచి నా యాక్టివిటీని మొదలుపెట్టాను. మనిషి పుట్టినప్పటి నుంచి పోయే వరకు ప్రతి అవసరాన్నీ చెట్టు తీరుస్తుంది. మనం చెట్టుకు హాని కలిగించకుండా, ఇచ్చిన వాటిని ఉపయోగించుకుంటే చాలు.
ఆదాయం తక్కువే!
అరెక్కా ప్లేట్, కప్పుల యూనిట్లు భారీస్థాయిలో రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఇందులో లాభాలు పరిమితంగా ఉంటాయి. నాలాగ ఉద్యోగం చేసుకుంటూ, ప్రవృత్తిగా వీటిని ప్రచారంలోకి తీసుకురావడమే తప్ప, పూర్తిస్థాయి వృత్తిగా చేపట్టాలంటే కొంచెం ముందువెనుకలు ఆలోచిస్తారు.
అందుకే పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి ఉన్న వాళ్లు, పర్యావరణ పరిరక్షణ కోసం పని చేయాలనుకునే వాళ్లు తమ వంతు బాధ్యతగా ఇలాంటి ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాను. ’’ అన్నారు సుచిత్ర.
మనకు వేడుకలు చాలానే ఉంటాయి. శ్రావణ మాసం నోముల నుంచి, గణేశ చతుర్థి, దసరా వేడుకల్లో ప్రసాదాలు పంచుకుంటారు. దేవుడి వేడుకలకు విరాళాలిచ్చే వాళ్లు తమవంతు విరాళంగా ఇలాంటి కప్పులను ఇవ్వడం అలవాటు చేసుకుంటే ‘ప్లాస్టిక్‌ని వాడవద్దు’ అని గొంతెత్తి చాటే పనే ఉండదు. ప్లాస్టిక్ దానంతట అదే కనుమరుగవుతుంది.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి