ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తున్నారా? జర జాగ్రత్త..
ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తున్నారా? జర జాగ్రత్త..
Published Sun, Feb 19 2017 11:15 AM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM
దేశంలో ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాకంపై కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఒక రోగికి ఒకమారు మాత్రమే వినియోగించాల్సిన మెడికల్ కిట్‌లను పదేపదే ఇతర రోగులకూ వినియోగిస్తూ ఆరోగ్యానికి ఎసరు పెడుతున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు. ముఖ్యంగా కార్డియాలజీ విభాగంలో మెడికల్ వస్తువులను(ఒకమారు వినియోగించాల్సినవి) ప్రైవేటు ఆసుపత్రులు నెలల తరబడి వాడుతున్నట్లు తెలిసింది.
దీనిపై సీరియస్ అయిన ఆరోగ్యశాఖ ప్రైవేటు ఆసుపత్రులకు మెమోరండం జారీ చేసింది. కేవలం కార్డియాలజీయే కాకుండా మిగితా సర్జికల్ వస్తువుల వినియోగంలో కూడా ఆసుపత్రులు ఇదే ధోరణి కొనసాగిస్తున్నట్లు తెలిసింది. మామూలుగా కార్డియాలజీకి సంబంధించిన చికిత్సలకు ఒకమారు ప్రైవేటు ఆసుపత్రికి వెళితే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ బిల్లు వస్తుంది. ఈ బిల్లుల్లో అధిక మొత్తం మిగుల్చుకోవడానికి ఒకసారి వినియోగించిన మెడికల్ కిట్‌నే అందరికీ వాడుతూ ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తున్నాయి.
ఈ మేరకు గతేడాది డిసెంబర్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం(సీజీహెచ్‌ఎస్) కింద ఉన్న ఆసుపత్రులపై చర్యలకు ఉపక్రమించింది. అయితే, సీజీహెచ్‌ఎస్ కిందకు రాని కార్పోరేట్ ఆసుపత్రుల విషయంలో మాత్రం మిన్నకుండి పోయింది. రోగి అనుమతి లేకుండా ఒకరికి వినియోగించిన మెడికల్ కిట్‌ను మరొకరికి వినియోగించడం చట్ట రీత్యా నేరమని ఓ కార్డియాలజిస్ట్ చెప్పారు. పేషెంట్ల కళ్లుగప్పి డబ్బు దోపిడికి పాల్పడుతున్న కార్పోరేట్ ఆసుపత్రుల చిట్టా చాలనే ఉందని తెలిపారు. ఆసుపత్రుల్లో నిర్వహించిన యాంజియోప్లాస్టీ సంఖ్యతో అందుకు వినియోగించిన మెడికల్ కిట్‌ల బిల్లులను అడగడం ద్వారా తప్పు చేస్తున్న వారిని పట్టుకోవచ్చని చెప్పారు.
Advertisement
Advertisement