రైతురథం.. ఇరకాటం
►నేతల మధ్య చిచ్చురేపుతున్న ట్రాక్టర్లు
►పోటాపోటీగా ఇరువర్గాల సిఫారసులు
►త్రిముఖ పోరుతో బెంబేలెత్తుతున్న గ్రామనాయకులు
►కడపలో అంతా ఆయన చెప్పినట్టే
టీడీపీలోని గ్రామస్థాయి నాయకులు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లపై రగిలిపోతున్నారు. జాబితా తయారీలో కొందరి పేర్లు పొందుపరిచి, మరికొందరి పేర్లు చేర్చకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పార్టీ నాయకులు పార్టీపైన, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లపైన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఎప్పటినుంచో పార్టీలో ఉన్న తమను కాదని నిన్నా, మొన్నా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తూ ట్రాక్టర్లు మంజూరు చేయడమేమిటని వారు నిలదీస్తున్నారు.
కడప అగ్రికల్చర్:రైతురథం ట్రాక్టర్లు తమ్ముళ్ల మధ్య చిచ్చుపెడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా పోటీ పెరిగిపోయింది. తమ వర్గీయులకు మంజూరు చేయించుకోవాలనే పట్టుదలకు పోతుండటంతో వర్గపోరు ఎక్కువైంది. పోటాపోటీగా సిఫార్సులు చేస్తుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇన్చార్జి మంత్రి కూడా ఇరకాటంలో పడ్డట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలకు యాంత్రీకరణ పథకంలో రైతురథం కింద ట్రాక్టర్ల పంపిణీ చేసేలా ప్రణాళికలు రచించి రంగం సిద్ధం చేసింది. మండలానికి ఆరు ట్రాక్టర్ల చొప్పున పంపిణీ చేసేలా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు బాధ్యతలు అప్పగించింది. లబ్ధిదారుల జాబితాను నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు తయారుచేసి వ్యవసాయశాఖ డివిజనల్ అసిస్టెంట్ డైరెక్టర్లకు అందజేసేలా అవకాశం కల్పించింది. కాగా జమ్మలమడుగు, బద్వేలు, ప్రొద్దుటూరు, రాయచోటి, రైల్వేకోడూరు, పులివెందుల నియోజకవర్గాల్లో బహునాయకత్వం ఉండటంతో ఆయా నాయకులు తమవారికే ట్రాక్టర్లు ఇవ్వాలని, లేదు...లేదు... మావారికే ఇవ్వాలంటూ మంత్రి వద్ద పేచీపెట్టినట్లు సమాచారం.
ఉన్నతాధికారికి ఫోన్ ఒత్తిడి
పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడు ఇటీవల జిల్లా ముఖ్య ఉన్నతాధికారిని కలిసి తమవారి పేర్లు ట్రాక్టర్ల పంపిణీ జాబితాలో చేర్చలేదని, తాము ఇచ్చిన సిఫారసు లెటర్ ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించినట్లు తెలి సింది. వెంటనే ఆ ముఖ్య ఉన్నతాధికారి మరో ఉన్నతాధికారికి ఫోన్ చేసి ఏమండీ ఆర్జీఆర్ ఇచ్చిన లెటర్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించడంతో అందుకు ఆ అధికారి సమాధానమిస్తూ నియోజకవర్గ ఇన్చార్జి ఇచ్చిన జాబితానే తుది జాబితా అని చెప్పడంతో ఆ ముఖ్య ఉన్నతాధికారి ఏమీ చెప్పుకోలేక మిన్నకుండి పోయినట్లు సమాచారం. అదే విధంగా బద్వేలులో త్రిముఖ నాయకత్వం ఉండటంతో ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్లు సిఫారసు లేఖలు అనుచరులకు ఇవ్వడంతో సమస్య జఠిలంగా మారింది.
దీంతో జాబితాలో మాపేరు లేదంటే మాపేరు లేదని ఆయా నాయకుల వద్ద కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉత్తి పుణ్యానికి సిఫారసు లేఖలు ఇవ్వడం దేనికని ముఖం మీదనే చీవాట్లు పెట్టినట్లు నాయకులు చర్చించుకుంటున్నారు. జమ్మలమడుగులో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు ఆ పార్టీ గ్రామస్థాయి నాయకులు చర్చించుకుంటున్నారు. కార్యకర్తలకు ట్రాక్టర్లు ఇస్తున్నారంటే అబ్బా...ఎంత ఉదారమో అనుకున్నామని, తీరా చూస్తే అవి అయిన వారికే ఇస్తున్నట్లు అర్థమవుతోందని కార్యకర్తలు బాహాటంగా విమర్శిస్తున్నారు.
భారీగా దరఖాస్తులు
రైతురథం పథకం కింద జిల్లాకు 320 ట్రాక్టర్లు మంజూరుచేశారు. ఇందులో ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్‌కు రూ.2లక్షల సబ్సిడీ, టూవీల్ డ్రైవ్ ట్రాక్టర్‌కు రూ.1.50లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు. అయితే ట్రాక్టర్లు తక్కువ దరఖాస్తులు ఎక్కువ రావడంతోనూ, సిఫారసు లేఖలు అంతే స్థాయిలో ఇవ్వడంతో నేతలు, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. మండలానికి ఆరు ట్రాక్టర్లు మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు మాత్రం మండలానికి పది నుంచి ఇరవై మందికి సిఫారసు లేఖలు ఇచ్చారు.
తీరా మండల వ్యవసాయాధికారుల దగ్గరికి వెళ్లి నేను మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాను, దీన్ని తీసుకోండి అని వెళితే అక్కడి ఏఓలు నియోజకవర్గ ఇన్చార్జి ఇచ్చిన జాబితాలో నీ పేరు లేదు అని చెబుతుండటంతో కొంతమంది జేడీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. అక్కడి అధికారులు మీ నియోజకర్గ ఇన్చార్జులు ఇచ్చిన సిఫారసు లేఖల ఆధారంగానే మంజూరవుతాయని చెబుతుండటంతో ఎంత మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంటిముఖం పడుతున్నారు. ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి అంటూ ఈసడించుకుంటున్నారు.