District Mineral Foundation Trust
-
‘మైనింగ్’ నిధులకు కొత్త నిబంధనలు!
సాక్షి, హైదరాబాద్: గనులు, గనుల కార్యకలాపాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమవుతున్న ప్రాంతాల్లో 30:70 నిష్పత్తిలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ నిధులను ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫౌండేషన్ ట్రస్ట్ రూల్స్–2015ను సవరిస్తూ తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ రూల్స్–2018ను ప్రకటించింది. గనులు, ఖనిజ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మైనింగ్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రక్రియను సరళీకరించడం, ప్రధాని ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన కింద నిర్దేశించిన సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు సవరణలు జరిపినట్లు తెలిపారు. కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ప్రతి జిల్లాలో కలెక్టర్ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ కమిటీ వేయాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు శాఖల జిల్లాధికారులను సభ్యులుగా నియమించాలి. రాష్ట్రంలోని గనుల ప్రభావిత ప్రాంతాల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం డీఎంఎఫ్ కింద రూ.1,537 కోట్లు ప్రభుత్వం వద్ద మురుగుతున్నాయి. గనులకు 10 కి.మీ. పరిధిలో ఉంటే ప్రభావిత ప్రాంతమే గనులు, వాటి కార్యకలాపాలున్న గ్రామాలు, పట్టణాలతోపాటు గనులు, గనుల క్లస్టర్‌కు 10 కి.మీ. పరిధిలో ఉంటే మైనింగ్ ప్రభావిత ప్రాం తాలుగా పరిగణిస్తారు. పొరుగు జిల్లాల్లోని ప్రాంతాలున్నా వాటినీ మైనింగ్ ప్రభావిత ప్రాంతాలుగానే గుర్తిస్తారు. మైనింగ్ ప్రభావిత కుటుంబాలను స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదింపుల ద్వారా గుర్తించాలి. నిధులను సమంగా పంచాలి: బొగ్గు గనులున్న 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే వసూలైన డీఎంఎఫ్ నిధులను ఆ నియోజకవర్గాల మధ్య సమంగా పంచాలి. వాటి పరిధిలోని ప్రభావిత, పరోక్ష ప్రభావిత ప్రాంతాల్లో 30:70 నిష్పత్తిలో ఖర్చు చేయాలి. ఇకపై ఈ 13 నియోజకవర్గాల్లోని గనుల నుంచి వసూలు చేసే నిధులను అవి ఉన్న ఆరు జిల్లాల డీఎంఎఫ్ కమిటీల ఖాతాల్లో జమా చేయాలి. బొగ్గేతర మైనింగ్ కార్యకలాపాలున్న జిల్లాల్లో వసూలు చేసే నిధులను 30:70 శాతం నిష్పత్తిలో ఆయా జిల్లాలోని ప్రభావిత, పరోక్ష ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయాలి. ట్రస్ట్ ఫండ్ నుంచి పరిపాలన ఖర్చులు 4 శాతానికి మించొద్దు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు ట్రస్ట్ ఫండ్‌ను వినియోగించరాదు. ఇప్పటికే చేపట్టిన పనులు, పథకాలకు నిధుల కొరత ఉంటే వీటిని వినియోగించవచ్చు. -
జిల్లాల్లో మినరల్ ఫౌండేషన్ ట్రస్టులు
నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం మైనింగ్ ప్రభావిత ప్రాంతాల పరిరక్షణ కోసం హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరించిన గనులు, ఖనిజాలు(అభివృద్ధి, ని యంత్రణ) చట్టం-2015 నిబంధనలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టు(డీఎంఎఫ్టీ)లు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం డీఎంఎఫ్‌టీల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చింది. మైనింగ్ ద్వారా ప్రభావితమయ్యే వ్యక్తులు, ప్రాంతాల ప్రయోజనాలు కాపాడటం లక్ష్యంగా ఈ ట్రస్టు పనిచేస్తుంది. పరిశ్రమలు, భూగర్భ వనరులశాఖ కార్యదర్శి ‘సెట్లర్’ హోదాలో ట్రస్టుల నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటయ్యే పాలకమండలిలో జాయింట్ కలెక్టర్, ఎస్పీ కో చైర్మన్లుగా వ్యవహరిస్తారు. అటవీ, గిరిజనాభివృద్ధి, జడ్పీ, నీటి పారుదల, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు భవనాలు, గనులు, భూగర్భ జలవనరులు, కాలుష్య నియంత్రణ మండలి తదితర విభాగాల జిల్లాస్థాయి అధికారులు, మినరల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధి ట్రస్టీలుగా ఉంటారు. జిల్లా పంచాయతీ అధికారి ట్రస్టీ కార్యదర్శిగా పనిచేస్తారు. పాలకమండలి ట్రస్టు విధివిధానాలను రూపొందించడంతోపాటు, ట్రస్టు కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. వార్షిక ప్రణాళిక తయారి, మైనింగ్ ప్రాంతాలు, వ్యక్తులకు లబ్ధి చేకూర్చే పథకాల రూపకల్పన పాలకమండలి విధుల్లో చేర్చారు. దీనితోపాటు జిల్లా పరిషత్ సీఈవో చైర్మన్‌గా గనులు, భూగర్భ వనరులశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ సభ్యుడిగా, జిల్లా పంచాయతీ అధికారి సభ్యకార్యదర్శిగా మేనేజింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. మైనింగ్ లీజుదారుల నుంచి కంట్రిబ్యూషన్ ఫండ్ వసూలు చేయడం తదితరాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.