సాక్షి, హైదరాబాద్: గనులు, గనుల కార్యకలాపాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమవుతున్న ప్రాంతాల్లో 30:70 నిష్పత్తిలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ నిధులను ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫౌండేషన్ ట్రస్ట్ రూల్స్–2015ను సవరిస్తూ తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ రూల్స్–2018ను ప్రకటించింది.
గనులు, ఖనిజ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మైనింగ్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రక్రియను సరళీకరించడం, ప్రధాని ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన కింద నిర్దేశించిన సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు సవరణలు జరిపినట్లు తెలిపారు.
కలెక్టర్ నేతృత్వంలో కమిటీ
ప్రతి జిల్లాలో కలెక్టర్ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ కమిటీ వేయాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు శాఖల జిల్లాధికారులను సభ్యులుగా నియమించాలి. రాష్ట్రంలోని గనుల ప్రభావిత ప్రాంతాల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం డీఎంఎఫ్ కింద రూ.1,537 కోట్లు ప్రభుత్వం వద్ద మురుగుతున్నాయి.
గనులకు 10 కి.మీ. పరిధిలో ఉంటే ప్రభావిత ప్రాంతమే
గనులు, వాటి కార్యకలాపాలున్న గ్రామాలు, పట్టణాలతోపాటు గనులు, గనుల క్లస్టర్‌కు 10 కి.మీ. పరిధిలో ఉంటే మైనింగ్ ప్రభావిత ప్రాం తాలుగా పరిగణిస్తారు. పొరుగు జిల్లాల్లోని ప్రాంతాలున్నా వాటినీ మైనింగ్ ప్రభావిత ప్రాంతాలుగానే గుర్తిస్తారు. మైనింగ్ ప్రభావిత కుటుంబాలను స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదింపుల ద్వారా గుర్తించాలి. నిధులను సమంగా పంచాలి: బొగ్గు గనులున్న 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే వసూలైన డీఎంఎఫ్ నిధులను ఆ నియోజకవర్గాల మధ్య సమంగా పంచాలి. వాటి పరిధిలోని ప్రభావిత, పరోక్ష ప్రభావిత ప్రాంతాల్లో 30:70 నిష్పత్తిలో ఖర్చు చేయాలి.
ఇకపై ఈ 13 నియోజకవర్గాల్లోని గనుల నుంచి వసూలు చేసే నిధులను అవి ఉన్న ఆరు జిల్లాల డీఎంఎఫ్ కమిటీల ఖాతాల్లో జమా చేయాలి. బొగ్గేతర మైనింగ్ కార్యకలాపాలున్న జిల్లాల్లో వసూలు చేసే నిధులను 30:70 శాతం నిష్పత్తిలో ఆయా జిల్లాలోని ప్రభావిత, పరోక్ష ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయాలి. ట్రస్ట్ ఫండ్ నుంచి పరిపాలన ఖర్చులు 4 శాతానికి మించొద్దు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు ట్రస్ట్ ఫండ్‌ను వినియోగించరాదు. ఇప్పటికే చేపట్టిన పనులు, పథకాలకు నిధుల కొరత ఉంటే వీటిని వినియోగించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment