క్వార్ట్జ్ అంతా నాకే అమ్మాలి.. అదీ నేను చెప్పిన ధరకే
ప్రభుత్వ ముఖ్యనేత ఆశీస్సులు ఉండడంతో లీజుదారులను లెక్కచేయని వైనం
చిల్లకూరులో లీజుదారుల రహస్య సమావేశం
ఎక్కువిచ్చిన వారికే అమ్మాలని నిర్ణయం
త్వరలో ప్రభుత్వ పెద్దలను కలవాలని తీర్మానం
వేమిరెడ్డి ఆదేశాలపై లీజుదారుల ఆగ్రహం
మైకా గనుల యజమానులకు ఎంపీ వేమిరెడ్డి హుకుం
సాక్షి తిరుపతి టాస్క్‌ఫోర్స్: ‘మైకా క్వార్ట్జ్ ఎంత తవ్వితే అంత మొత్తం నాకే అమ్మాలి. అదీ నేను చెప్పిన ధరకే. లేదంటే మైనింగ్ జరగదు. నా మాట ప్రకారం నడుచుకోవాల్సిందే. నేను చెప్పిందే ఫైనల్’.. తిరుపతి–నెల్లూరు సరిహద్దు ప్రాంతంలో విలువైన మైకా క్వార్ట్జ్ గనుల యజమానులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలివి. ప్రభుత్వంలోని ఒక ముఖ్య నేత అండదండలతో సైదాపురం, గూడూరు పరిధిలో లభ్యమయ్యే విలువైన తెల్లబంగారం మొత్తాన్ని ఆయన గుప్పిట్లోకి తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు లీజుదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఆయనపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరులోని ఓ కన్వెన్షన్‌లో రహస్యంగా సమావేశమై కార్యాచరణను రూపొందించుకున్నారు. ఆయన ఒక్కరికే విక్రయిస్తే నష్టపోతామని, అలా కాకుండా ఎక్కువ రేటు ఇచ్చిన వారికి విక్రయిస్తే ప్రయోజనం ఉంటుందని వారు ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై ప్రభుత్వ పెద్దలు, అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిసింది.
సైదాపురం, గూడూరు, పొదలకూరు పరిధిలో ఏడు భూగర్భ గనులు, మరో 140 మైకా క్వార్ట్జ్ , క్వార్ట్జ్ గనులున్నాయి. మైకా క్వార్ట్ ్జకి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చైనా, జపాన్, రష్యా దేశాల్లో రూ.లక్షలు పెట్టి కొంటున్నారు. విలుౖవెన మైకా క్వార్ట్జ్ పై అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ, మరి కొందరు ఎమ్మెల్యేలు కన్నేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గనుల్లో తవ్వకాలు నిలిపేశారు. ఆ తరువాత వారికి అనుకూలంగా ఉన్న వారికే తవ్వకాలకు అనుమతులిచ్చారు. ఇలా ఇప్పటివరకు 24 గనులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది.
మైనింగ్ డాన్‌కు అమ్మడం ఇష్టంలేక తవ్వకాలు నిలిపివేత
ఇక్కడ తవ్విన మైకా క్వార్ట్జ్ మొత్తం తనకే విక్రయించాలని, తాను చెప్పిన రేటుకే ఇవ్వాలంటూ మైనింగ్ డాన్ లీజుదారులకు హుకుం జారీ చేశారు. తనను కాదని వేరొకరికి విక్రయించడానికి వీల్లేదని ఆదేశించారు. దీంతో కంగుతిన్న లీజుదారులు తవ్వకాలు నిలిపివేశారు. అనుమతులిచ్చిన గనుల్లో ప్రస్తుతం నాలుగింట్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ దందా భరించలేని లీజుదారులు 32 మంది చిల్లకూరులోని ఓ కన్వెన్షన్‌లో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రహస్యంగా సమావేశమయ్యారు.
సమావేశంలో విషయాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు అందరి నుంచి మొబైల్ ఫోన్లు కూడా తీసేసుకున్నారు. మైకా క్వార్ట్జ్ మంచి డిమాండ్ ఉన్నందున, బయట అమ్మితేనే లాభమని, డాన్‌కి అమ్మితే నష్టమేనని వారు అభిప్రాయపడ్డట్లు సమాచారం. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు కొంత మైనింగ్ డాన్‌కి విక్రయించినా.. మరి కొంత ఇతరులకు విక్రయిస్తే కొంతైనా ప్రయోజనం ఉంటుందని భావించినట్లు తెలిసింది. ఈయనతోపాటు సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సత్యవేడు నియోజకవర్గాలను శాసిస్తున్న మరో బడా పారిశ్రామికవేత్తకు కూడా విక్రయిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఒకటి, రెండు రోజుల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఓ పారిశ్రామికవేత్త, ప్రభుత్వ పెద్దలతో చర్చించాలని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా జిల్లా మైనింగ్ అధికారిని కూడా మరోసారి కలిసి తమ ఆవేదనను చెప్పుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈ రహస్య సమావేశం విషయం తెలుసుకున్న మైనింగ్ డాన్ లీజుదా రులతో మాట్లాడినట్లు తెలిసింది. ఎవరెవరు తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు? ఎంతమంది అనుకూలంగా మాట్లాడారు అనే విషయాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ సమావేశం వివరాలను ప్రభుత్వ పెద్దలు కూడా నిఘా వర్గాల ద్వారా తెప్పించుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment