అధికారికంగా లైన్ క్లియర్.. జనవరి నుంచి దోపిడీ షురూ
సైదాపురంలో పనులను దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఆఫీస్ సిద్ధం.. తన మాట వినే అధికారికి పోస్టింగ్
ఇప్పటికే నిత్యం అనధికారికంగా వందల లారీల్లో ఖనిజం అక్రమంగా తరలింపు.. తవ్వకాలపై ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా పరిశ్రమ ఏర్పాటు పేరుతో దోపిడీకి సిద్ధం
హైదరాబాద్‌కు పిలిచి ఇతర గనుల యజమానులకు ఎంపీ బెదిరింపులు
వందేళ్లకుపైగా నడుపుకొంటున్న గనులు, ఖనిజాన్ని తమకే అప్పగించాలని హుకుం.. ఇప్పటికే తవ్విన ఖనిజం, ఇకపై తవ్వేది నామ మాత్రపు ధరకు ఇవ్వాలని హెచ్చరిక
గత ఆర్నెళ్లుగా తవ్వకాలు చేపట్టకుండా లీగల్ మైన్ల యజమానులకు వేధింపులు
అనుమతులన్నీ ఉండీ, ఏళ్ల తరబడి డెడ్ రెంట్ కడుతున్న యజమానులు లబోదిబో
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సైదాపురం క్వార్ట్జ్ గనులపై ఎమ్మెల్యేలు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో ఎంపీదే పైచేయిగా మారినట్లు సమాచారం. గనులను చేజిక్కించుకునేందుకు జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఎంపీ వేమిరెడ్డికి ప్రభుత్వ ‘ముఖ్య’ నేత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనవరి నుంచి ఇక అధికారికంగానే గనుల దోపిడీ జరగనుంది.
నాణ్యమైన గనులు ఉన్న వెంకటగిరి, సర్వేపల్లి, ఉదయగిరి నియోజకవర్గాల్లో దొరికే క్వార్ట్జ్ మెటల్‌ను ఆయనకే అప్పగించాలని ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు నజరానాగా ప్రతి నెలా ‘ముఖ్య’ నేతకు ముడుపులు చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఇప్పటికే సైదాపురం పరిసర ప్రాంతాల నుంచి గత నెల రోజులుగా నిత్యం వందల లారీల్లో ఖనిజాన్ని అనధికారికంగా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు.
తమకు ముడిసరుకు మొత్తం అప్పగించాలని లేదంటే కేసులు బనాయించి లీజులు రద్దు చేయిస్తామని అన్ని అనుమతులున్న ఇతర గనుల యజమానులను బెదిరిస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ గత ఆర్నెళ్లుగా గనుల యజమానులు తవ్వకాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారు. లీగల్ మైన్లను దుర్మార్గంగా నిలిపివేయడంపై గనుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు తమ అనుకూల అధికారులను నియమించుకోవడంతోపాటు సైదాపురంలో ఎంపీ వేమిరెడ్డి కార్యాలయం ఏర్పాటుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. సైదాపురం కేంద్రంగా ఇకపై అక్కడి నుంచే తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా వేమిరెడ్డి అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటున్నారు.
గనుల తవ్వకాలపై ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా సైదాపురం పరిసరాల్లో క్వార్ట్జ్ శుద్ధి పరిశ్రమ ఏర్పాటు పేరుతో జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఉపాధి దొరుకుతుందంటూ కంపెనీ ముసుగులో ప్రజలను మభ్యపుచ్చి కొన్నాళ్ల పాటు హడావుడి చేసి అనంతరం అందరి నుంచి గనులను లాక్కునే ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.
గనుల యజమానులకు బెదిరింపులు..
జిల్లాలో మైనింగ్ దందాను చేజిక్కించుకున్న వేమిరెడ్డి అనుచరులు అధికారికంగా అన్ని అనుమతులున్న గనులు యజమానులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారిక గనుల్లో ఉన్న ముడిసరుకును సైతం తమకే ఇవ్వాలని, తాము చెప్పిన ధరకే అప్పగించాలని బెదిరింపులకు దిగారు. ఇప్పటికే తవ్విన ఖనిజంతోపాటు ఇకపై వెలికితీసేది కూడా తాము చెప్పిన నామ మాత్రపు ధరకే ఇవ్వాలని ఆదేశించారు.
ఈ క్రమంలో గనుల యజమానులను హైదరాబాద్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకుని ఎంపీ తీవ్ర స్థాయిలో హెచ్చరించినట్లు సమాచారం. ముడిసరుకు ఇవ్వకుంటే గనుల నుంచి మీ లారీలు వెళ్లలేవని, పలు రకాల కేసులు నమోదు చేయించి లీజులు రద్దు చేయిస్తామంటూ తమను బెదిరించినట్లు ఓ గని యజమాని వాపోయాడు. తమ మైన్లకు అన్ని అనుమతులు ఉన్నాయని, గత 50 ఏళ్లుగా ‘డెడ్ రెంట్’ సైతం చెల్లిస్తున్నామని పేర్కొన్నాడు.
రూప్ కుమార్ ద్వారా..
ఎంపీ వేమిరెడ్డి తన అనుచరుడైన రూప్‌కుమార్‌ను ముందుపెట్టి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. సైదాపురం సమీపంలోని శ్రీనివాస పద్మావతి, చాగణం సమీపంలో ఉన్న సిద్ధి వినాయక, తుమ్మలతలుపూరులో ఉన్న జయలక్ష్మి కనకదుర్గా, కలిచేడు సమీపంలో ఉన్న రాఘవేంద్ర గనులు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆర్నెళ్లుగా అందరి మైన్లు నిలిపివేసి కేవలం ఎంపీ అనుచరుడికి చెందిన నాలుగు గనులకే అనుమతులు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటనేది తెలిసిపోతోంది.
అనుకూల అధికారి రాక
నెల్లూరు జిల్లా మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా తిరుపతి జిల్లా డీడీ బాలాజీ నాయక్‌కు అదనపు బాధ్యతలు అప్పగించేలా ఎంపీ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన చంద్రశేఖర్‌ను కలెక్టర్ ద్వారా 20 రోజుల క్రితం ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అయితే దీన్ని న్యాయస్థానం తప్పుబట్టడంతో మళ్లీ పోస్టింగ్ ఇచ్చినట్లే ఇచ్చి విజయవాడకు బదిలీ చేశారు. అనంతరం ఆ పోస్టులో తమ అనుకూల అధికారిని నియమించేలా బుధవారం ఉత్తర్వులు జారీ చేయించారు.
విదేశాల్లో భారీ గిరాకీ..
కూటమి ప్రభుత్వం రాగానే సైదాపురం క్వారŠట్జ్ గనులపై ‘ముఖ్య’ నేత కన్ను పడటంతో వెంటనే అనుమతులు నిలిపివేశారు. అన్ని అనుమతులతో వందేళ్ల లీజుపై తీసుకున్న గనులను సైతం మూసి వేయించారు. ఇక్కడ లభ్యమయ్యే మైకా క్వార్‌ట్టŠజ్, తెల్లరాయి క్వార్‌ట్టŠజ్‌పై నివేదిక తెప్పించుకున్నారు. వందేళ్లకు సరిపడా గనుల్లో నిల్వలున్నట్లు గుర్తించడంతో వాటిని తవ్వి సొమ్ము చేసుకునేందుకు పథకం వేశారు.
సైదాపురం మండలంలో లభించే ఖనిజాన్ని చైనా, జపాన్, రష్యాకు ఎగుమతి చేస్తుంటారు. ఎనిమిది నెలలుగా మైకా, క్వార్ట్ ్జకి విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నాణ్యతను బట్టి ముడి ఖనిజం టన్ను రూ.25 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు పలుకుతోంది. చైనాలోని సెమీకండక్టర్ పరిశ్రమల్లో మైకా క్వార్ట్ ్జని ఎక్కువగా వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment