జిల్లాల్లో మినరల్ ఫౌండేషన్ ట్రస్టులు | Mineral Foundation Trusts districts | Sakshi
Sakshi News home page

జిల్లాల్లో మినరల్ ఫౌండేషన్ ట్రస్టులు

Published Sat, Aug 22 2015 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM

Mineral Foundation Trusts districts

నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
మైనింగ్ ప్రభావిత ప్రాంతాల పరిరక్షణ కోసం

 
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరించిన గనులు, ఖనిజాలు(అభివృద్ధి, ని యంత్రణ) చట్టం-2015 నిబంధనలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టు(డీఎంఎఫ్‌టీ)లు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం డీఎంఎఫ్‌టీల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చింది. మైనింగ్ ద్వారా ప్రభావితమయ్యే వ్యక్తులు, ప్రాంతాల ప్రయోజనాలు కాపాడటం లక్ష్యంగా ఈ ట్రస్టు పనిచేస్తుంది. పరిశ్రమలు, భూగర్భ వనరులశాఖ కార్యదర్శి ‘సెట్లర్’ హోదాలో ట్రస్టుల నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటయ్యే పాలకమండలిలో జాయింట్ కలెక్టర్, ఎస్పీ కో చైర్మన్లుగా వ్యవహరిస్తారు. అటవీ, గిరిజనాభివృద్ధి, జడ్పీ, నీటి పారుదల, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు భవనాలు, గనులు, భూగర్భ జలవనరులు, కాలుష్య నియంత్రణ మండలి తదితర విభాగాల జిల్లాస్థాయి అధికారులు, మినరల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధి ట్రస్టీలుగా ఉంటారు.

జిల్లా పంచాయతీ అధికారి ట్రస్టీ కార్యదర్శిగా పనిచేస్తారు. పాలకమండలి ట్రస్టు విధివిధానాలను రూపొందించడంతోపాటు, ట్రస్టు కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. వార్షిక ప్రణాళిక తయారి, మైనింగ్ ప్రాంతాలు, వ్యక్తులకు లబ్ధి చేకూర్చే పథకాల రూపకల్పన పాలకమండలి విధుల్లో  చేర్చారు. దీనితోపాటు జిల్లా పరిషత్ సీఈవో చైర్మన్‌గా గనులు, భూగర్భ వనరులశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ సభ్యుడిగా, జిల్లా పంచాయతీ అధికారి సభ్యకార్యదర్శిగా మేనేజింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. మైనింగ్ లీజుదారుల నుంచి కంట్రిబ్యూషన్ ఫండ్ వసూలు చేయడం తదితరాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.  
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement