గవర్నర్ చేతికి లాఠీ?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పోలీసు పరిపాలన పర్యవేక్షించే బాధ్యతను గవర్నర్‌కు అప్పగించాలనే కేంద్ర సర్కారు నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్ పర్యవేక్షిస్తారని రాష్ట్ర పునర్విభజన చట్టం స్పష్టం చేసింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లు గవర్నర్ పరిధిలో పనిచేస్తాయని పునర్విభజన బిల్లులో పేర్కొంది. అయితే, దీనిపై అప్పట్లో కేంద్ర హోంశాఖ స్పష్టత ఇవ్వలేదు.
గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు సమీపంలోని మరికొన్ని మండలాలు సైబ రాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండడంతో వీటిని ఏ పరిధిలో చేరుస్తారనే అంశంపై సందేహాలు తలెత్తాయి. ఈ సందేహాలను నివృత్తి చేసేలా కేంద్రం తాజాగా చర్యలు తీసుకుంటోంది. రాష్ర్ట పునర్విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు అధికారాలను కట్టబెడుతోంది. తద్వారా సైబ రాబాద్ కమిషనరేట్ సహా రంగారెడ్డి గ్రామీణ ప్రాంత పోలీసు పరిపాలన కూడా గవర్నర్ చేతుల్లోకి వెళ్లనుంది. గవర్నర్ గిరిని కేవలం సైబ రాబాద్కే పరిమితం చేస్తారని ఊహించినా తాజాగా కేంద్రం గ్రామీణ పోలీసింగ్‌ను ఆయన కనుసన్నల్లోకి తీసుకురావాలని యోచిస్తుండడం పోలీసువర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
కాసులు కురిపించే శివారు ఠాణాల్లో పోస్టింగ్‌ల కోసం పెద్దఎత్తున పైరవీలు సాగేవి. అధికార పార్టీ, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో హాట్‌సీట్లు దక్కించుకునేవారు. సైబ రాబాద్, గ్రామీణ ఎస్పీలపై గవర్నర్ ఆజమాయిషీ ఉంటే వీరి ఆటలు సాగవు. ఎమ్మెల్యేలు, మంత్రుల మాటలు చెల్లుబాటు కావు. ఈ పరిణామాల నేపథ్యంలోనే గవర్నర్‌కు అధికారం కట్టబెట్టడంపై సహాజంగానే రాజకీయపక్షాలు పెదవి విరుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో గవర్నర్ పెత్తనమేమిటినీ ప్రశ్నిస్తున్నాయి.