District treasury
-
అవినీతి ఖజానా
సాక్షి, విశాఖపట్నం : జిల్లా ఖజానా శాఖలో అక్రమాలకు అంతే లేకుండాపోతోంది. రాష్ట్రంలో మరే జిల్లాలోనూ జరగనంత అవినీతి.. అక్రమాలు ఇక్కడ వెలుగులోకి వస్తుండడం కలకలం రేపుతోంది. లేని సిబ్బందిని ఉన్నట్టుగా చూపిం చి వారి జీతాల పేరిట మొన్న కోట్లు దిగమింగారు. నిన్నటికి నిన్న చనిపోయిన వారి పేరిట పింఛన్లు స్వాహా చేశారు. ఇక తాజాగా ఉన్నతాధికారుల పాస్కోడ్లు ఏమార్చి కోట్లు దిగమింగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరన్న సామెతను ఖజానా సి బ్బంది నిజంగానే వంట పట్టించుకున్నారు. వరుసగా ఎన్ని కుంభకోణాలు వెలుగు చూస్తున్నా ట్రెజరీ శాఖ సిబ్బందిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. గడిచిన దశాబ్దల కాలంలో విశాఖ ట్రెజరీ శాఖలో రూ.25 కోట్లకుపైగా నిధులు పక్కదారి పట్టాయంటే ఇక్కడ అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా ఖజనా శాఖలో వెలుగు చూస్తున్న వరుస కుంభకోణాలు ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతున్నాయి. చింతపల్లి సబ్ ట్రెజరీ కేంద్రంగా మూడేళ్ల క్రితం వెలుగు చూసిన నకిలీ వైద్య ఉద్యోగుల పేరిట రూ.10కోట్లకు పైగా స్వాహా చేశారు. ఈ కేసులో అప్పటి డీటీవోతో సహా 88 మందిపై కేసులు నమోదయ్యాయి. గతేడాది నవంబర్–డిసెంబర్లలో సీతమ్మధార సబ్‌ట్రెజరీ కార్యాలయం కేంద్రంగా వెలుగు చూసిన కుంభకోణంలో ఏకంగా రూ.8కోట్లు స్వాహా చేశారు. 2011 ఏప్రిల్, 1 నుంచి 2017 డిసెంబర్, 6వరకు ఏకంగా 1028 పీపీవోలు గల్లంతైనట్టుగా గుర్తించారు. లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించకుండానే 124 పింఛన్‌దారుల పేరుతో కోట్లు స్వాహా చేశారు. ఎస్‌టీవోతో సహా ఆరుగురిపై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు ఇటీవల వారికి మళ్లీ పోస్టింగ్‌లు ఇచ్చారు. నేడు సిబ్బందితో భేటీ మరో వైపు వరుసగా వెలుగు చూస్తున్న కుంభకోణాల నేపథ్యంలో ఖజానా శాఖ సంచాలకులు హనుమంతరావు ఆదివారం ఖజానా శాఖ సిబ్బందితో భేటీ కానున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసేందుకు వెళ్లిన అధికారులకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. ఈ కుంభకోణం ఒక్కరే చేశారంటే నమ్మశక్యంగా లేదని..సమగ్రంగా ఏం జరిగిందో పూర్తిగా రాసి ఫిర్యాదు తీసుకురావాలని అప్పుడే విచారణ ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. అసలేం జరిగింది? చనిపోయిన పోలీస్ అధికారి స్థానంలో కారుణ్య నియామకంలో భాగంగా ఆయన కుమారుడు వై.వెంకటనరసింహారావుకు 18 నెలల క్రితం ట్రెజరీ శాఖలో పోస్టింగ్ ఇచ్చారు. ఈయనను సీతమ్మధార సబ్ ట్రెజరీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించారు. ఇదే సీతమ్మధార ట్రెజరీ పరిధిలోనే తన తల్లి ఫ్యామిలీ పింఛన్ పొందుతుంది. తన పేరిట మరో నాలుగైదు ఖాతాలు తెరిచి తన తల్లి పింఛన్ ఖాతా నుంచి ప్రతి నెలా పింఛన్ సొమ్ములను ఇష్టమొచ్చినట్టుగా మళ్లించేశాడు. తొలుత మే–ఆగస్టు నెలల్లోనే ఈ విధంగా మళ్లించినట్టుగా గుర్తించారు. ట్రెజరీ డైరెక్టర్ హనుమంతరావు శనివారం విశాఖకు చేరుకుని మరింతలోతుగా విచారణ చేపట్టారు. మే, జూన్ నెలలకే పరిమితం కాకుండా ఏకంగా సెప్టెంబర్ వరకు ప్రతి నెలా లక్షలాది రూపాయలు దారి మళ్లినట్టుగా గుర్తించారు. సొంత ఖాతాలకే కాదు ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు కూడా జూనియర్ అసిస్టెంట్ సొమ్ములు మళ్లించినట్టుగా నిర్ధారణకు వచ్చారు. ఈ విధంగా రూ.2.10కోట్లు దారి మళ్లించినట్టుగా అధికారులు విచారించారు. విచారణలో సదరు ప్రైవేటు వ్యక్తి తన ఖాతాలో రూ.10లక్షలు జమైనట్టుగా అంగీకరించాడు. దీంట్లో రూ.4.50లక్షలు టపాసుల వ్యాపారం పేరిట మళ్లీ జూనియర్ అసిస్టెంట్ తీసుకున్నాడనని ఖజానాశాఖ సంచాలకుల ఎదుట ఆ ప్రైవేటు వ్యక్తి అంగీకరించాడు. ఐదు నెలల్లో రూ.2.10 కోట్లు స్వాహా తాజాగా సీతమ్మధార సబ్ ట్రెజరీ కేంద్రంగా మరో కుంభకోణం వెలుగుచూసింది. ఇందులో ఇప్పటివరకు రూ.2 కోట్లకు పైగా పక్కదారి పట్టినట్టుగా ఉన్నతాధికారుల పరిశీలనలో తేలడం కలకలం రేపుతోంది. 18 నెలల కిందట విధుల్లో చేరిన ఓ చిరుద్యోగి పింఛన్ ఏరియర్స్ పేరిట ఏకంగా రూ.2 కోట్లకు ఏ విధంగా పక్కదారి పట్టించాడన్న అంశం ప్రస్తుతం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నాలుగు నెలల పాటు విచారించి సీతమ్మధారలో భారీగా అవకతవకలు జరిగినట్టుగా గుర్తించారు. విజిలెన్స్ అధికారులు సమర్పించిన నివేదిక ఆధారంగా విచారణ జరపాల్సిందిగా జిల్లా ట్రెజరీ అధికారి సుధాకర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ కుంభకోణంపై విచారణ జరపని మీపై ఎందుకుచర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ ఇటీవల డీటీవోకు ట్రెజరీ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి తాఖీదులు కూడా వచ్చాయి. అయినా పట్టించుకోకపోవడంతో విచారణ కోసం భాస్కరరావు, ఇస్మాయిల్, షాజ్‌హాన్‌లతో కూడిన త్రిమెన్ కమిటీని పంపింది. ఈ కమిటీ విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగు చూశాయి. ద్వారకానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు విశాఖ క్రైం: మరో వైపు ఈ కుంభకోణంపై ద్వారకానగర్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. జరిగిన అక్రమాలపై కార్యాలయం ఏటీవో కె.ఎస్.వెంకటేశ్వర్లు, కార్యాలయ సిబ్బంది కలిసి సీఐ రాంబాబుకు ఫిర్యాదు చేశారు. కార్యాలయంలో నెలవారీ జరిగే రికార్డుల పరిశీలనలో భాగంగా గోపాలపట్నం ఎస్బీఐ బ్యాంకులో వై.మహాలక్ష్మి ఖాతాలో పింఛన్ల ఎరియర్స్‌కు సంబంధించి రూ.50 లక్షలు మే నెలలో ఒక దఫా రూ.16,380, ఆగస్టులో రూ.34,66,800 జమైనట్టుగా ఏటీవో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఖజనా అధికారుల ప్రమేయం లేకుండా వివిధ ఖాతాలోకి సొమ్ము చేరినట్లు గుర్తించారు. దీనిపై లోతుగా పరిశీలన చేయగా ఇదే ఖాతా నుంచి రూ.10 లక్షల రూపాయలు ఇతర ఖాతాకు మళ్లినట్లు తెలుసుకున్నారు. ఆ ఖాతా వివరాలు పరిశీలించగా ఆ ఖాతా కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వై.వెంకట నరసింహరావు ఖాతాగా గుర్తించారు. సొమ్ము నిల్వ ఉన్న ఖాతా తన తల్లిదేనని తేలింది. ఈ విషయం గత మూడు రోజుల క్రితం అధికారులకు గుర్తిం చారు.తన గుట్టు రట్టయిందని తెలుసుకున్న వెంకట నరసింహారావు పరారయ్యాడు. ఈ అవినీతి బాగోతంపై ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు ఏటీవో కేఎస్ వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు. -
ఎక్కడి బిల్లులు అక్కడే..
గత నెల 5 నుంచి ట్రెజరీల్లో బిల్లులన్నీ ఫ్రీజింగ్‌లోనే... ♦ జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీల్లో 2 వేల బిల్లులు పెండింగ్ ♦ పొదుపు చేసుకున్న జీపీఎఫ్ బిల్లులనూ ఆపిన వైనం ♦ ప్రభుత్వ తీరుపై ఉద్యోగుల అసంతృప్తి ఈ చిత్రంలో కనిపించే మహిళ పేరు జయమ్మ, వ్యవసాయశాఖ కర్నూలు సబ్ డివిజన్ ఏడీఏ కార్యాలయంలో మెసెంజర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే కూతురు వివాహం చేయడంతో దాదాపు రూ.3 లక్షల అప్పయింది. అప్పు తీర్చేందుకు తాను పొదుపు చేసుకున్న జీపీఎఫ్ నుంచి రూ.3 లక్షలు తీసుకునేందుకు నెలన్నర రోజుల క్రితం ట్రెజరీకి ఏడీఏ రిక్వెస్ట్ ద్వారా పంపారు. కాని ఇంతవరకు బిల్లుకు మోక్షం లభించలేదు. కారణమేమంటే జీతాల బిల్లులు తప్ప ఇతరత్రా వేటిని పాస్ చేయవద్దని ప్రభుత్వ ఆదేశాలుండటమే.. కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం జీతాలు మినహా ఎటువంటి బిల్లులు చేయవద్దని ట్రెజరీలకు ఆదేశాలు ఇవ్వడంతో ఎక్కడ బిల్లులు అక్కడే నిలిచి పోయాయి. గత నెల 5 నుంచి అంటే నెల రోజులకు పైగా బిల్లులను ఫ్రీజింగ్లో పెట్టడంతో ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారు పడుతున్న ఇక్కట్లు అన్నీ, ఇన్నీ కావు. ఒక్క జిల్లా ట్రెజరీలోనే 1000కి పైగా బిల్లులు నిలిచిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక జిల్లాలోని 14 సబ్ ట్రెజరీల్లో మరో వెయ్యి బిల్లుల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. జీపీఎఫ్, సరండర్ లీవ్‌లు, మెడికల్, ఫీజు రీయింబర్స్‌మెంటు, విద్యుత్, వాటర్, స్కాలర్షిప్, ఆఫీసు ఖర్చులు, రైతుల ఇన్పుట్ సబ్సిడీ బిల్లులు పెండింగ్‌లోనే ఉండి పోయాయి. దాచుకున్న మొత్తం కూడా తీసుకునే అవకాశం లేదా.. జీపీఎఫ్ అనేది ఉద్యోగులు తమ వేతనాల నుంచి భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసుకున్న మొత్తం. దీన్ని కూడా తీసుకోకుండా ఆంక్షలు విధించడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి వ్యక్తం చేస్తున్నారు. జీపీఎఫ్ బిల్లులు ట్రెజరీల్లో 100కు పైగా ఉన్నాయి. దాచుకున్న మొత్తం అవసరానికి తీసుకునే అవకాశం లేకపోవడంతో ఉద్యోగులు అత్యవసరాలకు అప్పులు చేయాల్సి వస్తోంది. చివరికి రైతుల ఇన్పుట్ సబ్సిడీ బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం మధ్యలో.. సాధారణంగా ఆర్థిక సంత్సరం చివరిలో బిల్లులను ఫ్రీజింగ్లో పెడతారు. అయితే ఆర్థిక సంవత్సరం మధ్యలో బిల్లులను నిలిపి వేయడం గమనార్హం. గతంలో బిల్లులను ఫ్రీజింగ్లో పెట్టిన వారం, 10 రోజుల వరకే అమలు చేసేవారు. కానీ ఈ సారి నెల రోజులకు పైగా నిలుపుదల చేయడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రచారానికి, ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనలు, తదితర వాటికి అడ్డుగోలుగా ప్రజాధనాన్ని వ్యయం చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన బిల్లులను నిలుపుదల చేయడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా బిల్లుల ఫ్రీజింగ్‌ను ఎత్తి వేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
గల్లాపెట్టెకు తాళం..
45 రోజులుగా ఫ్రీజింగ్ - నిలిచిన ‘కల్యాణలక్ష్మి, షాదిముబారక్’ - బీసీ, ఎస్సీ కార్పొరేషన్లలోనూ అదే పరిస్థితి - పెండింగ్‌లో సుమారు రూ.10 కోట్ల చెల్లింపులు - జిల్లా ట్రెజరీ ఆఫీస్ చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు - ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకూ తప్పని తిప్పలు నక్కలగుట్ట : జిల్లా ఖజానా పెట్టెకు రాష్ట్ర ప్రభుత్వం తాళం వేసింది. జూన్ నుంచి తాత్కాలిక ఫ్రీజింగ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పలు పథకాల అమలుకు బ్రేక్ పడింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతోపాటు ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాల చెల్లింపులు నిలిచిపోయాయి. ఫలితంగా లబ్ధిదారులు జిల్లా ట్రెజరీ కార్యాలయం, దళిత, గిరిజన అభివృద్ధి శాఖలు, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల బిల్లులు కూడా ట్రెజరీలో చెల్లింపులకు నోచుకోకుండా పడి ఉన్నాయి. లబ్ధిదారులకు దాదాపుగా రూ.9.92 కోట్లు పెండింగ్‌లో పడ్డాయి. సుమారు 45 రోజులు కావొస్తున్నా.. ప్రభుత్వం ఫ్రీజింగ్ ఎత్తివేయకపోవడంతో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ‘కల్యాణలక్ష్మి’లో... దళిత అభివృద్ధి శాఖ : జిల్లా దళిత అభిృృద్ధి శాఖ ద్వారా కల్యాణలకిృ్ష్మ పథకంలో మొత్తం 389 మంది లబ్ధిదారులకు ఆర్థికసాయం మంజూరైనా.. ఫ్రీజింగ్ కారణంగా బిల్లులు జిల్లా ట్రెజరీ కార్యాలయంలోనే నిలిచిపోయాయి. ఈ శాఖ ద్వారా మొదటి విడతలో 285, రెండో విడత 104 కల్యాణలక్ష్మి బిల్లులు దాఖలయ్యాయి. ఇవన్నీ ట్రెజరీలో పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో లబ్ధిదారులు జిల్లా దళిత అభివృద్ధి శాఖ జిల్లా కార్యాలయంృ ఏఎస్డబ్ల్యూఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గిరిజన సంక్షేమశాఖ : జిల్లా గిరిజన సంక్షేమశాఖ ద్వారా కల్యాణలక్ష్మి పథకంలో 410 మంది దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల విచారణ పూర్తయి, ట్రెజరీలో బిల్లులు దాఖలు చేసినా... ఫ్రీజింగ్ అమలు కారణంగా చెల్లింపులకు నోచుకోకుండా నిలిచిపోయాయని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి సీహెచ్.రాంమూర్తి తెలిపారు. రెండు శాఖలు కలిపి 799 మందికి సుమారు రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంది. ‘షాదిముబారక్’ అంతే.. ముస్లిం నిరుపేద కుటుంబాల్లోని అవివాహిత యువతుల వివాహానికి ఆర్థికసాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న షాదిముబారక్ పథకం పరిస్థితి కూడా కల్యాణలక్ష్మిలాగే తయారైంది. ఫ్రీజింగ్ కారణంగా చెల్లింపులు నిలిచిపోయాయి. 2014-15లో షాదిముబారక్లో 333 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే.. 332 మందికి సర్కారు బిల్లులు మంజూరు చేసింది. 2015-16లో 570 మంది షాది ముబారక్ పథకం కింద దరఖాస్తు చేసుకోగా.. 394 మందికి మాత్రమే బిల్లులు చెల్లించారు. ఇంకా 169 మంది లబ్దిదారులకు ఫ్రీజింగ్ కారణంగా బిల్లులు చెల్లించలేదు. షాదిముబారక్ కింద లబ్ధిదారులకు చెల్లించాల్సిన సుమారు రూ.86 లక్షలు పెండింగ్‌లో పడ్డాయి. ఎస్సీ కార్పొరేషన్లో... జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న 400 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ అందజేసింది. ఫ్రీజింగ్ అమలు కారణంగా మరో 170 మంది లబ్ధిదారులకు సబ్సిడీ చెల్లించలేదు. లబ్ధిదారులకు సుమారు రూ.1.79 కోట్లు చెల్లించాల్సి ఉంది. బీసీ కార్పొరేషన్లో... జిల్లా బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు ఎంపికైన 830 మంది లబ్ధిదారులకు బ్యాంకులు రుణాల చెల్లిస్తే, బీసీ కార్పొరేషన్ సబ్సిడీ మంజూరు చేయాల్సి ఉంది. నిధుల లేమి కారణంగా బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయించకపోవడంతో అటు రుణాలు, ఇటు సబ్సిడీ విడుదల కాక లబ్ధిదారులు బీసీ కార్యాలయంచుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు. లబ్ధిదారులకు సుమారు రూ.2 కోట్లు చెల్లించాలి. ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు కూడా.. జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి జీతాల బిల్లులు కూడా ఫ్రీజింగ్ కారణంగా ట్రెజరీలో నిలిపివేశారు. దీంతో చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క కలెక్టరేట్లో ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులు 1,500 మంది ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన వారికి సుమారు రూ.1.27 కోట్లు చెల్లించాలి.