అవినీతి ఖజానా | Corruption In District Treasury Department In Visakhapatnam | Sakshi
Sakshi News home page

అవినీతి ఖజానా

Published Sun, Oct 21 2018 4:42 PM | Last Updated on Tue, Oct 30 2018 2:05 PM

Corruption In District Treasury Department In Visakhapatnam - Sakshi

కలెక్టరేట్‌లోని జిల్లా ట్రెజరీ కార్యాలయం

సాక్షి, విశాఖపట్నం : జిల్లా ఖజానా శాఖలో అక్రమాలకు అంతే లేకుండాపోతోంది. రాష్ట్రంలో మరే జిల్లాలోనూ జరగనంత అవినీతి.. అక్రమాలు ఇక్కడ వెలుగులోకి వస్తుండడం కలకలం రేపుతోంది. లేని సిబ్బందిని ఉన్నట్టుగా చూపిం చి వారి జీతాల పేరిట మొన్న కోట్లు దిగమింగారు. నిన్నటికి నిన్న చనిపోయిన వారి పేరిట పింఛన్లు స్వాహా చేశారు. ఇక తాజాగా ఉన్నతాధికారుల పాస్‌కోడ్లు ఏమార్చి కోట్లు దిగమింగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరన్న సామెతను ఖజానా సి బ్బంది నిజంగానే వంట పట్టించుకున్నారు. వరుసగా ఎన్ని కుంభకోణాలు వెలుగు చూస్తున్నా ట్రెజరీ శాఖ సిబ్బందిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. గడిచిన దశాబ్దల కాలంలో విశాఖ ట్రెజరీ శాఖలో రూ.25 కోట్లకుపైగా నిధులు పక్కదారి పట్టాయంటే ఇక్కడ అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

జిల్లా ఖజనా శాఖలో వెలుగు చూస్తున్న వరుస కుంభకోణాలు ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతున్నాయి. చింతపల్లి సబ్‌ ట్రెజరీ కేంద్రంగా మూడేళ్ల క్రితం వెలుగు చూసిన నకిలీ వైద్య ఉద్యోగుల పేరిట రూ.10కోట్లకు పైగా స్వాహా చేశారు. ఈ కేసులో అప్పటి డీటీవోతో సహా 88 మందిపై కేసులు నమోదయ్యాయి. గతేడాది నవంబర్‌–డిసెంబర్‌లలో సీతమ్మధార సబ్‌ట్రెజరీ కార్యాలయం కేంద్రంగా వెలుగు చూసిన కుంభకోణంలో ఏకంగా రూ.8కోట్లు స్వాహా చేశారు. 2011 ఏప్రిల్, 1 నుంచి 2017 డిసెంబర్, 6వరకు ఏకంగా 1028 పీపీవోలు గల్లంతైనట్టుగా గుర్తించారు. లైఫ్‌ సర్టిఫికెట్లు సమర్పించకుండానే 124 పింఛన్‌దారుల పేరుతో కోట్లు స్వాహా చేశారు. ఎస్‌టీవోతో సహా ఆరుగురిపై సస్పెన్షన్‌ వేటు వేసిన అధికారులు ఇటీవల వారికి మళ్లీ పోస్టింగ్‌లు ఇచ్చారు.

నేడు సిబ్బందితో భేటీ
మరో వైపు వరుసగా వెలుగు చూస్తున్న కుంభకోణాల నేపథ్యంలో ఖజానా శాఖ సంచాలకులు హనుమంతరావు ఆదివారం ఖజానా శాఖ సిబ్బందితో భేటీ కానున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసేందుకు వెళ్లిన అధికారులకు పోలీసులు ఝలక్‌ ఇచ్చారు. ఈ కుంభకోణం ఒక్కరే చేశారంటే నమ్మశక్యంగా లేదని..సమగ్రంగా ఏం జరిగిందో పూర్తిగా రాసి ఫిర్యాదు తీసుకురావాలని అప్పుడే విచారణ ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు.

అసలేం జరిగింది?
చనిపోయిన పోలీస్‌ అధికారి స్థానంలో కారుణ్య నియామకంలో భాగంగా ఆయన కుమారుడు వై.వెంకటనరసింహారావుకు 18 నెలల క్రితం ట్రెజరీ శాఖలో పోస్టింగ్‌ ఇచ్చారు. ఈయనను సీతమ్మధార సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా నియమించారు. ఇదే సీతమ్మధార ట్రెజరీ పరిధిలోనే తన తల్లి ఫ్యామిలీ పింఛన్‌ పొందుతుంది. తన పేరిట మరో నాలుగైదు ఖాతాలు తెరిచి తన తల్లి పింఛన్‌ ఖాతా నుంచి ప్రతి నెలా పింఛన్‌ సొమ్ములను ఇష్టమొచ్చినట్టుగా మళ్లించేశాడు. తొలుత మే–ఆగస్టు నెలల్లోనే ఈ విధంగా మళ్లించినట్టుగా గుర్తించారు. ట్రెజరీ డైరెక్టర్‌ హనుమంతరావు శనివారం విశాఖకు చేరుకుని మరింతలోతుగా విచారణ చేపట్టారు.

మే, జూన్‌ నెలలకే పరిమితం కాకుండా ఏకంగా సెప్టెంబర్‌ వరకు ప్రతి నెలా లక్షలాది రూపాయలు దారి మళ్లినట్టుగా గుర్తించారు. సొంత ఖాతాలకే కాదు ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు కూడా జూనియర్‌ అసిస్టెంట్‌ సొమ్ములు మళ్లించినట్టుగా నిర్ధారణకు వచ్చారు. ఈ విధంగా రూ.2.10కోట్లు దారి మళ్లించినట్టుగా అధికారులు విచారించారు. విచారణలో సదరు ప్రైవేటు వ్యక్తి తన ఖాతాలో రూ.10లక్షలు జమైనట్టుగా అంగీకరించాడు. దీంట్లో రూ.4.50లక్షలు టపాసుల వ్యాపారం పేరిట మళ్లీ జూనియర్‌ అసిస్టెంట్‌ తీసుకున్నాడనని ఖజానాశాఖ సంచాలకుల ఎదుట ఆ ప్రైవేటు వ్యక్తి అంగీకరించాడు.

ఐదు నెలల్లో రూ.2.10 కోట్లు స్వాహా
తాజాగా సీతమ్మధార సబ్‌ ట్రెజరీ కేంద్రంగా మరో కుంభకోణం వెలుగుచూసింది. ఇందులో ఇప్పటివరకు రూ.2 కోట్లకు పైగా పక్కదారి పట్టినట్టుగా ఉన్నతాధికారుల పరిశీలనలో తేలడం కలకలం రేపుతోంది. 18 నెలల కిందట విధుల్లో చేరిన ఓ చిరుద్యోగి పింఛన్‌ ఏరియర్స్‌ పేరిట ఏకంగా రూ.2 కోట్లకు ఏ విధంగా పక్కదారి పట్టించాడన్న అంశం ప్రస్తుతం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నాలుగు నెలల పాటు విచారించి సీతమ్మధారలో భారీగా అవకతవకలు జరిగినట్టుగా గుర్తించారు. విజిలెన్స్‌ అధికారులు సమర్పించిన నివేదిక ఆధారంగా విచారణ జరపాల్సిందిగా జిల్లా ట్రెజరీ అధికారి సుధాకర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ కుంభకోణంపై విచారణ జరపని మీపై ఎందుకుచర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ ఇటీవల డీటీవోకు ట్రెజరీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నుంచి తాఖీదులు కూడా వచ్చాయి. అయినా పట్టించుకోకపోవడంతో విచారణ కోసం భాస్కరరావు, ఇస్మాయిల్, షాజ్‌హాన్‌లతో కూడిన త్రిమెన్‌ కమిటీని పంపింది. ఈ కమిటీ విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగు చూశాయి.

ద్వారకానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు
విశాఖ క్రైం: మరో వైపు ఈ కుంభకోణంపై ద్వారకానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. జరిగిన అక్రమాలపై కార్యాలయం ఏటీవో కె.ఎస్‌.వెంకటేశ్వర్లు, కార్యాలయ సిబ్బంది కలిసి సీఐ రాంబాబుకు ఫిర్యాదు చేశారు. కార్యాలయంలో నెలవారీ జరిగే రికార్డుల పరిశీలనలో భాగంగా గోపాలపట్నం ఎస్‌బీఐ బ్యాంకులో వై.మహాలక్ష్మి ఖాతాలో పింఛన్ల ఎరియర్స్‌కు సంబంధించి రూ.50 లక్షలు మే నెలలో ఒక దఫా రూ.16,380, ఆగస్టులో రూ.34,66,800 జమైనట్టుగా ఏటీవో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఖజనా అధికారుల ప్రమేయం లేకుండా వివిధ ఖాతాలోకి సొమ్ము చేరినట్లు గుర్తించారు.

దీనిపై లోతుగా పరిశీలన చేయగా ఇదే ఖాతా నుంచి రూ.10 లక్షల రూపాయలు ఇతర ఖాతాకు మళ్లినట్లు తెలుసుకున్నారు. ఆ ఖాతా వివరాలు పరిశీలించగా ఆ ఖాతా కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వై.వెంకట నరసింహరావు ఖాతాగా గుర్తించారు. సొమ్ము నిల్వ ఉన్న ఖాతా తన తల్లిదేనని తేలింది. ఈ విషయం గత మూడు రోజుల క్రితం అధికారులకు గుర్తిం చారు.తన గుట్టు రట్టయిందని తెలుసుకున్న వెంకట నరసింహారావు పరారయ్యాడు. ఈ అవినీతి బాగోతంపై ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు ఏటీవో కేఎస్‌ వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement