సాక్షి, పెందుర్తి(విశాఖపట్నం): ఓ బిడ్డ పుడతాడు. నవ మాసాలు మోసి, కన్న అమ్మ ఆ బిడ్డను కనీసం చూసుకోలేదు. కళ్ల ముందు కదలాడకుండానే ఆ బిడ్డ మరో అమ్మ చేతిలోకి వెళ్లిపోతాడు. ఎందుకంటే ఆ బిడ్డను కన్న అమ్మ ఓ అనాథో, ఓ మానసిక వ్యాధిగ్రస్తురాలో అయి ఉంటుంది. లేదంటే ఎవరి చేతిలోనో మోసపోయి అవాంఛిత గర్భం దాల్చిన బాధితురాలు అయి ఉంటుంది.
బిడ్డ ఏదీ అని అడిగితే.. ‘నీకెందుకు’ అంటూ ఆమె మొహం మీద నాలుగు నోట్లు వేసి పోతారు. వారు మాత్రం లక్షలు జేబుల్లో వేసుకుంటారు. సృష్టిలో ఎంతో పవిత్రమైన అమ్మతనాన్ని నడిరోడ్డుపై అమ్మేస్తున్న ఓ ముఠా సాగిస్తున్న దందా ఇది. ఇప్పటివరకు 20 మందికి పైగా బిడ్డలను ఈ విధంగా అమ్మేసినట్లు సమాచారం. విశాఖలో ఓ తెలుగుదేశం పార్టీ నేత అండదండలతో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య కార్యకర్తలు, ఓ మహిళా నేత, వైద్య శాఖకు చెందిన ఓ చిరుద్యోగిని ఆధ్వర్యంలో ఈ దందా సాగుతోందని జిల్లా పోలీసులు గుర్తించారు.
పెందుర్తి కేంద్రంగా సాగుతున్న ఈ అనైతిక వ్యాపారం గుట్టును రట్టు చేశారు. ప్రధాన సూత్రధారులు, టీడీపీ ముఖ్య కార్యకర్తలైన ముగ్గురిని, వైద్య శాఖ ఉద్యోగినిని అరకు పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ దందాలో ఐవీఎఫ్‌లో నిష్ణాతురాలైన నగరానికి చెందిన ఓ వైద్యురాలికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ బాగోతం
విశాఖ నగరంలోని 96వ వార్డు తెలుగుదేశం పార్టీలో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు నాయకులు, ఒక మహిళా నేత, వైద్య శాఖలో చిరుద్యోగిగా పనిచేస్తున్న మరో మహిళ ముఠాగా ఏర్పడ్డారు. వీరు జిల్లా, నగరవ్యాప్తంగా రోడ్లపై తిరుగుతున్న మానసిక వ్యాధిగ్రస్తులు, అనాధ మహిళలను గుర్తిస్తారు. వారికి మాయమాటలు చెప్పి, డబ్బు ఆశ చూపి కృత్రిమ గర్భం దాల్చేందుకు ఒప్పిస్తారు. మోసపోయి, అవాంఛిత గర్భం దాల్చిన మహిళలను కూడా బిడ్డను కనేందుకు బుజ్జగిస్తారు.
పెందుర్తిలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో పెద్దగా చెప్పుకుంటున్న ఓ మహిళ ఆధీనంలో ఉన్న ఫ్లాట్లలో వీరిని ఉంచుతారు. అక్కడ వీరి బాగోగులు చూసుకునేందుకు వైద్య శాఖ ఉద్యోగి కుటుంబ సభ్యులు, స్థానికంగా ఉంటున్న ఓ మహిళా దోబీ ఉంటారు. అంతా అనుకూలంగా మారిన తరువాత మహిళలను నగరంలోని ఓ ప్రముఖ మహిళా వైద్యురాలి వద్దకు తీసుకువెళ్లి ఐవీఎఫ్ ఇంజక్షన్ చేయించి మళ్లీ ఫ్లాట్లకు తీసుకువస్తారు.
ఆడ బిడ్డకో రేటు.. మగకు మరో రేటు
ఐవీఎఫ్ చేయించిన మహిళలకు గర్భం నిర్ధారణ అయిన తరువాత ముఠాలోని సభ్యులు పిల్లలు కావలసిన వారిని గుట్టుగా సంప్రదిస్తారు. వారికి ఏ బిడ్డ (ఆడ/మగ) కావాలో అడుగుతారు. ఆడ బిడ్డ అయితే రూ.5 లక్షల వరకు, మగ బిడ్డ అయితే రూ.10 లక్షల వరకు రేటు చెప్తారు. వారితో ఒప్పందం కుదుర్చుకున్నాక రూ.3 లక్షలు అడ్వాన్స్‌గా వసూలు చేస్తారు.
గర్భం దాల్చిన మహిళకు ఆరో నెల దాటిన తరువాత రహస్యంగా లింగ నిర్ధారణ చేస్తారు. ఆ బిడ్డను ఎవరికి ఇవ్వాలో అప్పుడే నిర్ధారిస్తారు. బిడ్డ పుట్టిన తరువాత బాలింతలకు ప్రమేయం లేకుండా బిడ్డను కొనుగోలు చేసిన వారికి అప్పగించి వారి నుంచి మిగిలిన సొమ్మును పిండుకుంటారు. బిడ్డను కనీసం ఆ మహిళకు చూపించరు. బిడ్డను ఎవరికి ఇచ్చారో కూడా చెప్పరు. బిడ్డను కన్న మహిళకు లేదా ఆమెకు సంబంధించిన వారికి చిన్న మొత్తంలో డబ్బు ఇచ్చి పంపించేస్తారు. ఈ ముఠా సభ్యులు మాత్రం లక్షలాది రూపాయలు దండుకుంటారు.
రెండేళ్లుగా ‘పచ్చ’గా వ్యాపారం
ఈ అనైతిక వ్యాపారం రెండేళ్లుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకంగా ఉన్న ఈ ముఠా సభ్యులకు ఓ టీడీపీ ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ముఠాలో ప్రధాన సూత్రదారులు టీడీపీ నేత కుటుంబానికి అత్యంత సన్నిహితులు. ఆ నేత అండదండలతో నిరాటంకంగా సాగుతున్న వీరి అనైతిక వ్యాపారాన్ని పోలీసులు ఇటీవల పసిగట్టారు.
వీరి దందాపై పక్కా సమాచారం అందుకున్న అరకు పోలీసులు రెండు రోజుల క్రితం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలోని ఫ్లాట్లలో తనిఖీలు చేశారు. ముఠాలోని నలుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రస్తుతం రహస్యంగా విచారిస్తున్నారు. ముఠాలోని మిగిలిన వారితో పాటు ఐవీఎఫ్ ఇంజక్షన్లు చేస్తున్న వైద్యురాలి గురించి కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment