‘స్మార్ట్‌’ పనులు సక్రమమేనా..? | TDP Government Corruption In Smart City Project Visakhapatnam | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్‌’ పనులు సక్రమమేనా..?

Published Wed, Aug 21 2019 6:48 AM | Last Updated on Wed, Aug 21 2019 6:52 AM

TDP Government Corruption In Smart City Project Visakhapatnam - Sakshi

మహావిశాఖ ఎదుగుదలకు స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు తోడైంది. ఈ ప్రాజెక్టు కింద రూ.2వేల కోట్ల విలువైన పనుల్లో ప్రస్తుతం 28 ప్రాజెక్టులు కార్యాచరణలోకి వచ్చాయి. అయితే.. ప్రతి పనిలోనూ తలదూర్చి పర్సంటేజీలు దండుకోవడమే పనిగా పెట్టుకున్న నాటి టీడీపీ నేతలు.. కేంద్ర ప్రాయోజిత స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులోనూ తలదూర్చారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించి కాసులకు కక్కుర్తి పడ్డారు. ఫలితంగా పనులు మందగించాయి. నాణ్యత దిగనాసిల్లింది. ఇప్పటికీ చాలా పనులు నాలుగో వంతు కూడా జరగలేదు.. మరికొన్ని ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయి. ఈ తరుణంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల్లో నాణ్యాత, అవినీతి నిగ్గు తేల్చేందుకు నడుంకట్టింది. ఈ క్రమంలో జీవీఎంసీలో జరుగుతున్న స్మార్ట్‌ ప్రాజెక్టులపై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక ఇచ్చే వరకు ప్రస్తుతం కొనసాగుతున్న పనులు నిలిపివేశారు. నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.

సాక్షి, విశాఖపట్నం: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పనిలోనూ పర్సంటేజీలు నొక్కేయడం ఆ పార్టీ నేతలకు అలవాటుగా మారిపోయింది. అందుకోసం  తమకు అనుకూలమైన వ్యక్తులు, సంస్థలకే పనులు కట్టబెట్టేందుకు నిబంధనలను సైతం మార్చేసిన దాఖలాలున్నాయి. మహా విశాఖ నగర పాలక సంస్థ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు ఎంపికైన తర్వాత ఆ పనుల్లోనూ తలదూర్చి అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితంగా పనుల్లో జాప్యం జరిగింది. నాణ్యత తగ్గింది. గత సర్కారు చేసిన అడ్డగోలు పనులపై దృష్టి సారించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం.. టీడీపీ హయాంలో ప్రారంభించి.. 25 శాతం కూడా పూర్తి కాని పనులతో పాటు టెండర్‌ దశలో ఉన్న వాటినీ నిలిపివేయాలని అన్ని శాఖలతోపాటు జీవీఎంసీని ఆదేశించింది. ఈ పనులపై పూర్తి స్థాయి సమీక్ష, పరిశీలనకు ముగ్గురు అధికారులతో కమిటీని నియమించింది.

చీఫ్‌ ఇంజినీర్‌ నేతృత్వంలో..
గ్రేటర్‌ పరిధిలో జరుగుతున్న స్మార్ట్‌ పనులు, టెండర్‌ దశలో ఉన్నవాటిపై విచారణకు నియమించిన ఈ త్రిసభ్య కమిటీకి ఏపీ టిడ్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ ఆర్‌.గోపాలకృష్ణారెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ప్రజారోగ్యశాఖ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ బీహెచ్‌ శ్రీనివాసరావు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రీజనల్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.వర్మ సభ్యులుగా ఉన్నారు. స్మార్ట్‌ సిటీ పరిధిలో చేపట్టిన పనుల అంచనా విలువ, టెండర్ల ప్రక్రియ, పనుల్లో నాణ్యత ప్రమాణాలు.. తదితర అంశాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

28 ప్రాజెక్టులపై విచారణ..
జీవీఎంసీ పరిధిలో 775 కోట్లతో 28 ప్రాజెక్టులు మంజూరు కాగా.. 19 ప్రాజెక్టుల పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలిన 9 ప్రాజెక్టులు టెండర్‌ దశలోనే ఉన్నాయి. రూ.536.61 కోట్లతో ప్రారంభమైన 19 పనుల్లో చాలా వరకు 25 శాతం కూడా పూర్తికాలేదు. కొన్ని పనులు క్షేత్ర స్థాయిలో 25 శాతం దాటినా ఆ మేరకు నిధులు మంజూరు చెయ్యలేదు. ఏబీడీ ఏరియా సివరేజీ ప్రాజెక్టు, స్మార్ట్‌ స్ట్రీట్స్, 24/7 నీటిసరఫరా,  స్పోర్ట్స్‌ ఎరీనా నిర్మాణం, మేహాద్రిగెడ్డ సోలార్‌ పనులు, ఏబీడీ ఏరియాలో సోలార్‌ స్ట్రీట్‌లైట్స్, వుడాపార్క్‌ ఆధునికీకరణ పనులు 8 నుంచి 22 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మరో రూ.245 కోట్ల పనులకు టెం డర్లు పిలిచారు. వీటిలో నీటిసరఫరాకు స్కాడా అనుసంధానం చేసే ప్రాజెక్టు, స్మార్ట్‌ స్ట్రీట్స్‌ అభివృద్ధి, ఈ–రిక్షాలు, స్మార్ట్‌ బస్‌ షెల్టర్లు, డ్రెయిన్ల నిర్వహణకు మెకానికల్‌ స్క్రీనింగ్‌ ఎక్విప్‌మెంట్, రెజిమెంటల్‌ సెమిట్రీస్‌ అభివృద్ధి, ఖాళీస్థలాలు, శ్మశాన వాటికల అభివృద్ధి పనుల టెండర్‌ ప్రక్రియను నిలిపేశారు. వీటన్నింటిపైనా సునిశిత పరిశీలన జరిపి అవకతవకలు జరిగినట్లు తేలితే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారు. ఆ నివేదిక ఆధారంగా పనులు పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందని జీవీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement