పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్లు(ఇన్‌సెట్‌లో) వివరాలు వెల్లడిస్తున్న సీపీ ఆర్కే మీనా
సాక్షి, విశాఖపట్నం: మల్టీనేషనల్ కంపెనీలకి, ఎన్‌ఆర్‌ఐలకి అత్యధిక రేట్లుకు అద్దెకు ఇస్తామని ట్రావెల్స్ ఏజెన్సీలు, యజమానుల నుంచి కార్లు అద్దెకు తీసుకుని తాకట్టు పెట్టేసిన రెండు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను నగరంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మీనా వెల్లడించారు. ఆరిలోవకు చెందిన అడపా ప్రసాద్ ఎల్‌ఐసీలో సబ్æస్టాఫ్‌గా పనిచేసేవాడు. ఆయన 2007 నుంచి 2012 వరకు ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నెట్‌కేఫ్ నడిపేవాడు. తర్వాత 2017 అక్టోబర్ నెల వరకు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ‘369 క్యాబ్స్’ నిర్వహించేవాడు. వేపగుంట వరలక్ష్మీనగర్‌కు చెందిన రాఘవుల శ్రీనివాస్‌రావు ఎంబీఏ పూర్తిచేసి ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంక్‌లలో క్రెడిట్ కార్డు కస్టమర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
వీరిద్దరూ కారులు తాకట్టు వ్యాపారంలో కమీషన్ కోసం బ్రోకర్‌లుగా పనిచేసేవారు. వీరిద్దరికితోడుగా సోము సుదర్శన్‌ని కలుపుకుని ట్రావెల్స్ ఏజెన్సీ లు, ప్రైవేటు యజమానుల నుంచి కార్లు అద్దెకు తీసుకున్నారు. మొదటి, రెండు నెలలు సమయానికి అద్దె ఇచ్చేసరికి కారు యజమానులు, ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వాహకులు పూర్తిగా నమ్మేశారు. అదే అదునుగా మరిన్ని కార్లు తీసు కుని వాటికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి, విశాఖలోని అనకాపల్లి, హైదరాబాద్ ప్రాంతంలో తాకట్టు పెట్టేసేవారు. కొన్నింటిని పూర్తిగా అమ్మేసేవారు.
అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పోతురాజు షణ్ముఖ ప్రసాద్ ఆన్‌లైన్ మార్కెటింగ్ ట్రైనింగ్ సెంటర్ నడిపేవాడు. అనంతరం ఎంవీపీ కాలనీలో క్యాబ్ సరీ్వస్ నడిపేవాడు. ఈయన తనకల గోవింద్, గొంతిన నానాజీలతో కలిసి ట్రావెల్స్ ఏజెన్సీ, ప్రైవేటు యాజమాన్యాల నుంచి కార్లు అద్దెకు తీసుకునేవారు. వీరు కూడా నకిలీ డాక్యుమెంట్లుతో కార్లు తాకట్టు పెట్టేయడం, కుదిరితే అమ్మేయడం చేస్తుండేవారు.
దర్యాప్తునకు ప్రత్యేక బృందం
ఈ ఘటనలతో మోసపోయిన బాధితులు ఎంవీపీ కాలనీ, ఆరిలోవ, గాజువాక, విశాఖ టూ టౌన్, మహారాణిపేట, విశాఖ త్రీటౌన్‌లతోపాటు విజయనగరం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో 15 కేసులు నమోదయ్యాయి. దీంతో దర్యాప్తు కోసం నగర డీసీపీ(క్రైం) సురేష్ బాబు ఆధ్వర్యంలో ఏసీపీ (సీసీఎస్) సూర్యశ్రావణ్‌కుమార్‌తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సీసీఎస్ పోలీసులు ముఠా సభ్యులపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7 కోట్ల విలువ చేసే 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటి వరకు 77 కార్లు స్వాధీనం
విశాఖ నగరంతోపాటు విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలో కార్లు అద్దెకి తీసుకుని మోసగించి తాకట్టు పెట్టిన రెండు ముఠాలను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.7 కోట్లు విలువ చేసే 50 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మోసగించి మొత్తం 98 కార్లు తాకట్టు పెట్టేయగా ఇప్పటివరకు వారి నుంచి 77 రికవరీ చేశామని.., ఇంకా 21 కార్లు రికవరీ చేయాల్సి ఉందని సీపీ తెలిపారు. నిందితులను పట్టుకున్న బృందంలోని సభ్యులకు సీపీ నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో క్రైం డీసీపీ సురే‹Ùబాబు, క్రైం ఏడీసీపీ, సీసీఎస్ ఏసీపీ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment