అనకాపల్లి రూరల్ : నేవీలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ జి. చంద్ర తెలిపారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం వివరాలను వెల్లడించారు. విజయనగరం జిల్లా రైల్వే క్వార్టర్స్‌లో ఉంటున్న బి. నాగేంద్ర నేవీలో కుక్‌గా చేరి సైలర్‌గా అండమాన్‌లో పనిచేసేవాడు. అక్కడి నుంచి విశాఖపట్నానికి బదిలీ అయ్యాడు. విధుల్లో అక్రమాలకు పాల్పడడంతో నేవీ ఉన్నతాధికారులు అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి నేవీలో కమాండర్‌నంటూ ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులకు నమ్మబలికేవాడు.
విశాఖపట్నం, అనకాపల్లి మీసేవ కేంద్రాలకు వచ్చే నిరుద్యోగులతో పరిచయాలు పెంచుకొని స్నేహం ఏర్పరుచుకునేవాడు. ఈ క్రమంలో అనకాపల్లిలోని ఓ ఈసేవా కేంద్రం వద్ద గూండాల వీధికి చెందిన నెట్టం మధుతో పరిచయం పెంచుకొని ఉద్యోగం ఇప్పిస్తానని రూ.35 వేలు తీసుకున్నాడు. తనకు పెళ్లిచూపులంటూ నమ్మబలికి ఆగస్టు 2న ద్విచక్ర వాహనం, బంగారు చైను మధు నుంచి తీసుకున్నాడు. అప్పటి నుంచి మొబైల్‌ఆఫ్ చేసి తప్పించుకు తిరుగుతుండడంతో అనుమానం కలిగి మధు వాకబు చేయగా మోసగాడని తేలింది.
ఈ నెల 9న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సీఐ చంద్ర నేతృత్వంలోని ఎస్‌ఐ అల్లు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది కుమార్, వర్మ, అర్జున్, వాసులు వలపన్ని చాకచక్యంగా శుక్రవారం పూడిమడక రోడ్డు వద్ద నాగేంద్రను అరెస్టు చేశారు. నిందితుని వద్ద ఉన్న నకిలీ గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నేవీలో ఉద్యోగమంటూ మోసం
Published Sat, Sep 13 2014 1:43 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement