వామ్మో... ఇంత మంది అధికారులా...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలను విభజన చేసి మొత్తం 31 జిల్లాలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొత్త జిల్లాకు కలెక్టర్లతో పాటు పోలీసు ఉన్నతాధికారులను, ఇతర విభాగాల సిబ్బందిని కేటాయించడం ఒక్కొక్కటిగా గడిచిన నెల రోజుల నుంచి జరుగుతూనే ఉంది.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత అసలేం జరుగుతుంది. ఎలాంటి ప్రణాళికలు అమలవుతున్నాయి. అక్కడ సాధక బాధకాలేంటి? వీటన్నింటిపైనా మీ జిల్లా గురించి మీరు తెలుసుకోండి - మీ ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకోండి... అన్న ఎజెండాతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, ఆయా కార్పొరేషన్ల కమిషనర్లతో సదస్సును ఏర్పాటు చేశారు.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత మొత్తం యంత్రాంగంతో సమావేశం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కాగా, ముఖ్యమంత్రి ఇటీవలే ప్రారంభించిన ప్రగతి భవన్ లో ఈ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అధికార యంత్రాంగానికి సంబంధించి కీలక అధికారులంతా తరలివస్తుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రగతి భవన్ లోని అతిపెద్ద సమావేశ మందిరంలో వలయాకారంలో టేబుళ్లు ఏర్పాటు చేశారు. గతంలో మాదిరిగా కాకుండా పెద్ద హాలులో ముఖ్యమంత్రి ఎక్కడో దూరంగా కనిపించడాన్ని దృష్టిలో ఉంచుకొని వలయాకారం టేబుళ్ల మధ్యన భారీ స్ర్కీన్లతో కూడిన 14 టీవీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు.
పరిపాలన సమర్థవంతంగా సాగడానికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని, మూడు నాలుగు లక్షల కుటుంబాలకు ఒక జిల్లా ఏర్పడిందని ఈ సందర్భంగా కేసీఆర్ అధికారులను ఉద్దేశించి సమావేశపు ఎజెండాను వివరించారు. జిల్లాల స్వరూపం, స్వభావం, నైసర్గిక పరిస్థితులు, వాతావరణం, వనరుల ఆధారంగా ఆయా జిల్లాల ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నో యువర్ డిస్ట్రిక్ట్ - ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్... ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రణాళిక ఉండాలని చెప్పారు. జిల్లాల పరిధి తగ్గినందున పర్యవేక్షణ పెరగాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు అంతా ఒక టీమ్ గా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని, సమైక్యంగా పనిచేసి ప్రజలకు మేలైన సేవలు అందించాలని సూచించారు.