Divi Subba Rao
-
కలికి గాంధారివేళ
కలికి అంటే అందమైన స్త్రీ. గాంధారి చాలా అందగత్తెట. గుడ్డివాడు ధృతరాష్ట్రుడికిచ్చి చేశారు. మనసులో ఆమెకిష్టం లేదు చేసుకోవటం. కాని చేసుకొంది. చేసుకున్న క్షణం నుంచి తనను తాను హింసించుకోవటం మొదలుపెట్టింది. పతివ్రతా లక్షణం అని పైకి అందరూ అనుకోవటమేగాని లోలోపల అందరికీ తెలుసు, ఈమె వల్ల ధృతరాష్ట్రుడికి ఏ సాయం లేకపోగా, ఇంకో బరువు వచ్చి మీద పడిందని. మొగుడు గుడ్డివాడైనా, భార్యకు కళ్లుంటే వాడికీమె కళ్లతో సమానం. ఆ అదృష్టానికి నోచుకోలేదు ధృతరాష్ట్రుడు. ఈమె కళ్లకు గంతలు కట్టుకొని గుడ్డిదానిలా తయారైంది. మహారాజు, మహారాణి కాబట్టి రోజులు గడిచాయి. పదిమంది సేవకులు ఎప్పుడూ అందుబాటులో వుండేవారు. ఇది శబ్దమయ ప్రపంచం. ఎప్పుడూ శబ్దిస్తూనే వుంటుంది. పగలు చేసే రణగొణ ధ్వనులు ఎప్పుడూ మనకు వినపడుతోనే వుంటాయి. చీకటి పడుతున్నకొద్దీ మోతలు తగ్గుతవి. తగ్గినట్లుగా అనిపిస్తుంది. కాని భూమ్మీద సమస్త జంతుజాలమూ ఏదో శబ్దం చీకటి వేళ కూడా చేస్తూనే వుంటుంది. కుప్ప నూర్పిళ్ల కాలంలో రాత్రిళ్లు పొలంలో కాపలా పడుకునేవాళ్లకి తెలుసు ఈ సంగతి. గంట గంటకూ చెట్టుమీద గూడుకట్టుకొన్న పక్షులు పక్కకు ఒత్తిగిల్లుతుంటవి. రాత్రిపూట అల్లా ఒత్తిగిలుతున్నప్పుడు కువకువ శబ్దం వినవస్తుంది. తెల్లవారు జామున వినవచ్చేది కలకలారావం. రాత్రివేళ వాటి గొంతుల్లోంచి గురగురమని శబ్దం వినిపిస్తుంది. కాని ఒక సమయం వుంది. రాత్రి ఒంటిగంట రెండు మధ్య. అప్పుడు ఆకు కదలదు. గాలి వీచదు. ఒక్క పక్షి ఒత్తిగిలదు. గొంతు గురగుర అనదు. సమస్త ప్రాణికోటి సుషుప్తి అనుభవిస్తూ వుంటుంది. అప్పుడు గాంధారికి జాగ్రదవస్థ. లేచి కళ్లకు కట్టుకొన్న గంతలు విప్పదీసేది. స్నానానికి వెళ్లేది. అక్కడ సేవకురాండ్రు ఈమెకు స్నానం చేయించేవారు. స్నానం అయ్యాక కొత్త బట్టలు కట్టుకునేది. మళ్లీ కళ్లకు గంతలు కట్టుకునేది. యథాప్రకారం రోజువారీ కార్యక్రమాల్లో మొగుడితోపాటు పాల్గొనేది. ఇది రాణివాసంలో ప్రతి రాత్రివేళ నిత్యం జరిగేటిది. రహస్యంగా జరిగేటిది. బయటకు పొక్కే వీలులేదు. ఈ రహస్యం ధృతరాష్ట్రుడికిగాని, దుర్యోధనుడికిగాని, తెలియదు. భీష్ముడికి తెలియదు. విదురుడికి తెలియదు. ఒక్క మగవాళ్లకేంటి, ఆడవాళ్లకెవరికీ తెలియదు. కోడళ్లకెవరికీ తెలియదు. కుంతికి తెలియదు. వ్యాసుడికీ తెలియదట. తిక్కనకు అంతకంటే తెలియదట. మరెవరికి తెలుసు? స్నానం చేయించే ఆ సేవకురాండ్రకు తెలుసు. వాళ్లలో వాళ్లు ఉండబట్టలేక ఇంట్లో చెప్పుకునేవారు. అట్లా ఈ రహస్యం ఆ కుటుంబాల్లో ఒక తరం తరువాత ఇంకో తరానికి తెలివిడి పడుతూ వచ్చింది. రాజుల రాజ్యాలు మట్టిగొట్టుకు పోయాయి. వాళ్లు నామరూపాలు లేకుండా పోయారు. కాని అప్పటి పరిచారికలు చావకుండా ఈ గడ్డమీద బతికేవున్నారు. వాళ్ల సంతానం కొందరు బైండ్లవారయినారు. కొందరు బుడబుక్కల వారయినారు. చిందుభాగవతులయినారు. నానారకాలుగా జీవించటం మొదలుపెట్టారు. ‘‘ఈ కథ ఇట్లా మా బైండ్లవారి యింట్లో వుంది. దీన్ని మా ముత్తవ్వ నాకు జెప్పింది. నేను నీకు నేడు చెప్తున్నా. కలికి గాంధారివేళ అంటే ఏమిటో ఎరుక అయ్యెనా? మొత్తం ప్రపంచం అంతా ఏమాత్రం అలికిడి లేకుండా రాత్రి గాఢనిద్రలో మునిగిన వేళ కలికి గాంధారి లేచి స్నానం చేసేటిది. ఆ వేళని కలికి గాంధారి వేళ అంటారు.’’ (గుడిపూడి సుబ్బారావుకు ఒక బైండ్ల అతను చెప్పిన వివరం.) (సౌజన్యం: కృపావర్షం) -దీవి సుబ్బారావు -
నిజమైన దానం
జ్యోతిర్మయం చాలాసార్లు మెహర్బాబా నిస్వార్థ సేవ గురించి, ఇతరులకు సేవ చెయ్యటం గురించి, తన సుఖం చూసుకోకుండా, ఇతరులను సుఖపెట్టడం గురించి చెబుతుండేవారు. అయితే, ఇతరులకు సహాయం చెయ్యడం అనేది అంత తేలికయిన విషయం కాదు. ఏవిధంగా తెలిసి ఉండాలో నీకు తెలిసి ఉండాలి. గుళ్లదగ్గర అడుక్కునే వాళ్లు కనిపిస్తూ ఉంటారు. వాళ్లకు ఏమైనా దానం ఇద్దామని నీకు అనిపించ వచ్చు. కాని ఇచ్చేముందు ఎవరికి ఇవ్వాలో తెలి యాలి. దానం ఇవ్వటం అంటే జేబులో చెయ్యి పెట్టి డబ్బు తీసి అడుక్కునేవానికి ఇవ్వడం మాత్రమే అను కుంటే పొరపాటు. అడుక్కునేవానికి అలా ఇచ్చావే అనుకుందాం. అప్పుడు నీవు ఇచ్చిన డబ్బుతో మద్యం తాగి ఇంటికి వెళ్లి వాళ్లను కొడితే అప్పుడు నీ దానం ఎవరికి ఉపయోగపడింది? నీవు ఎవరికి సహాయం చేసినట్టు? అందుకనే, బీదలకు సహాయం చేసేటప్పుడు, ఆ బీదలు నిజంగా బీదలు అవునో కాదో ముందు నిర్ధారించుకోవల సిందిగా మెహర్బాబా తన శిష్యు లకు గట్టిగా చెప్పేవారు. వీధిపక్క జోలె పట్టుకుని చేతులు చాచిన ప్రతివాడిని బీదవాడని అనుకోవడా నికి వీల్లేదు. ఒకప్పుడు బాగా బతికి, తరువాత చితికి పోయిన కుటుంబాలు ఉంటాయి. వారు కటిక బీదరి కంలోనూ, ఆత్మగౌరవాన్ని చంపుకోలేరు. వారు బయ టకు వచ్చి అడుక్కోలేరు. అలాంటివారే సహాయం పొందటానికి నిజంగా అర్హులు. అలాంటివారికి కూడా మనం ఆలోచించి సహాయం చెయ్యాలి. గుడ్డిగా చెయ్యకూడదు. ఆ చేసే సహాయం ఎలా చెయ్యాలి అంటే, ఆ సహాయం వాళ్లని వాళ్ల కష్టాల్లో సమయానికి ఆదుకోవాలి. దానం చేసిన ప్రతిసారీ నేను సహాయం చేశాను, నేనో మంచిపని చేశాను అని నీకు అనిపించి నీలో గర్వం, అహంకారం పెరిగితే, అది నీకు మంచి చెయ్యదు. అహంకారంతో ఎప్పుడైతే నీవు సహాయం చేస్తావో, అప్పుడే సహాయం పొందేవాని అహంకారం కూడా నీ అహంకారానికి స్పందిస్తుంది. దానం తీసు కున్నవాడు, దానం ఇచ్చినవానికి రుణపడిపోయానని అనుకుంటాడు. ఆ భారం అతడిని కుంగదీస్తుంది. ఫలితంగా, అతడు దానం ఇచ్చినవాడి నుంచి దూ రంగా జరుగుతాడు. నీవు ఎవరికి సాయం చేసినా, అది నీకు నీవు చేసుకున్నట్లుగా ఎప్పుడనుకుంటావో, అప్పుడు అది నిజమైన సాయం అవుతుంది. గొప్ప కోసం, పేరుకోసం చేసేది దానం అనిపించుకోదు. నీ కుడిచేయి చేసిన సాయం, నీ ఎడం చేయికి తెలియకూడదు. నీవు చేసిన దానం అప్పుడే మరిచి పోవాలి. సహాయం పొందినవాడు నిన్ను ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నీకు కృతజ్ఞుడిగా ఉండాలి అను కుంటే, నీకు నిరాశ మిగులుతుంది. అంతిమంగా మెహర్బాబా చెప్పేది ఏమంటే, చేసేది నేను కాదు. భగవంతుడు నా చేత ఈ సాయం చేయిస్తున్నాడని నీవు భావించినప్పుడు, అది ఉత్తమోత్తమంగా సహా యం చేయడం అవుతుంది. - దీవి సుబ్బారావు -
శాంతంలేక సౌఖ్యంలేదు
జ్యోతిర్మయం మనిషికి శత్రువులు ఎక్కడో బైట లేరు. తనలోనే ఉన్నారు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని వాటి పేర్లు. అరిషడ్వర్గాలనేది వాటినే. సొంత ఇంటి లోనే శత్రువులు ఉన్న యజమానికి సుఖశాంతులు ఉం డవు. ఈ ఆరూ చెరుపు చేసేవే కానీ మొదటి మూడూ మరీ చెడ్డవి. ఆ మూడింటిలోను ఏది మిగతా వాటికంటే ఎక్కువ చెరుపు చేసేదంటే క్రోధం అని చెప్పాలి. ఎందు కంటే అది అన్నింటి దుర్గుణాల్ని ఇముడ్చుకొంది. కోపంలో మనిషి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోవటం అనేది బైటకు కనిపించే లక్షణం. లోపల ఇంతకంటే ప్రమాదకరమైనది ఇంకోటి జరుగుతుంది. అదేమి టంటే అతడి ఒళ్లు వేడెక్కి లోపల రక్తం ఉడికిపోతుంది. చీటికీ మాటికీ కోపం తెచ్చుకొనే మనిషి ఒంటిలోని నెత్తురు కూడా వేడెక్కుతుంది. కోపగ్రస్తుడి శరీరం త్వరలోనే రోగగ్రస్తమవుతుంది. ఉప్పుకారం తినే మని షికి కోపం రాకుండా ఉండటం ఎలా సాధ్యం అని అడుగుతారు చాలా మంది. నిజమే, ఎప్పుడో ఒకప్పుడు దేనికో దానికి కోపం రాకుండా ఉండదు. వచ్చిన ప్పుడు దాన్ని అదుపులో ఉంచుకున్న వాడే ఘనుడు. అయితే, అవసరమైనప్పుడు కోపం ప్రదర్శించటం మంచిదే అన్నారు పెద్దలు. అంటే కోపాన్ని నటించు అన్నారు. మనకో కథ ఉన్నది. ఒక సాధువు మాట విని ఓ సర్పం తనూ సాధువుగా మారిపోయింది. ఆకతాయి పిల్లలు చూసి రాళ్లు రువ్వుతున్నా కోపం తెచ్చుకొనేది కాదు. దాంతో పిల్లలు దాన్ని మరీ బాధించేవారు. ఓ రోజు ఆ సాధువు అదే దారిన తిరిగి వెళ్తుంటే పాము తన దీనావస్థను చెప్పుకొంది. అప్పుడా సాధువు అన్నా డట, ‘ఓ పామా, నిన్ను కోపం తెచ్చుకొని కాటు వేయవ ద్దన్నాను గాని బుసకొట్టవద్దన్నానా?’ అని. దాంతో పాముకు జ్ఞానోదయమై నాటి నుండి కోపం నటిస్తూ బుసకొట్టడం చేసిందట. పిల్లలు కూడా భయపడి దాని జోలికి వెళ్లటం మానివేశారు. తనకు గాని, తనతోటి వారికి గాని జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను సహించి ఊరుకొమ్మని ఏ ధర్మశాస్త్రం చెప్పదు. వాటిని ఎదిరించి రూపుమాపవల సిందే అని బోధిస్తుంది. అప్పటి ఆ ఆగ్రహాన్నే ధర్మా గ్రహం, సత్యాగ్రహం అన్నారు. రామాయణం బాలకాండలో వాల్మీకి అడుగుతా డు నారదుణ్ణి, ‘కోపాన్ని జయించిన వాడు ఎవరు? యుద్ధంలో ఎవరి కోపాన్ని చూసి దేవతలు కూడా భయ పడుతారు?’ అని. అందుకు నారదుడు అలాంటి వారు రాముడు అని సమాధానం చెబుతాడు. అంటే రాముడు స్వతహాగా శాంతమూర్తి. అధర్మం, అన్యాయం లాంటి వాటి మీద యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు మాత్రం, అంటే ఆ సందర్భంలో, ఆ కాసేపు, కోపాన్ని తెచ్చిపెట్టు కొంటాడు. ఆ పని అయిపోయిన తర్వాత తెచ్చిపెట్టు కొన్న కోపాన్ని తీసివేస్తాడు. మళ్లీ ఎప్పటిలా శాంత మూ ర్తి అవుతాడు. అవతార పురుషులు తమ చర్యల ద్వారా లోకంలో మనుష్యులు ఎలా జీవించాలో చెబుతారు. దీవి సుబ్బారావు -
ముల్లా నసీరుద్దీన్ కథలు
ముల్లా నసీరుద్దీన్ వాక్చమత్కారానికి, సద్యఃస్ఫూర్తికి పెట్టింది పేరు. వ్యంగ్యంతో కూడిన హాస్య కథలు ఆయన సొత్తు. సామాన్యుడులా కనిపించే అసామాన్యుడు. అమాయకుడులా కనిపించే అఖండ మేధావి. విదూషకుడులా కనిపించే జ్ఞాని. సూఫీ తత్వవేత్త. డాబు, దర్పం ఏ మాత్రం ఎరుగని నిష్కల్మష హృదయుడు. ప్రజల మనిషి. ఇంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న ముల్లా నసీరుద్దీన్ టర్కీ దేశంలో పుట్టి ఏడు వందల ఏండ్లు గడిచిపోయినా ప్రపంచం ఆయన్ను మరచిపోలేదు. పోదు. ప్రజలు ఆయన్ను ఎంతగా ప్రేమించారంటే, చాలా దేశాలు ఆయన్ను తమ దేశానికి చెందిన వాడుగానే భావించి గౌరవిస్తున్నారు. మొదట్లో ఆయన పేరు మీద ఉన్న కథలు ఎన్నో చెప్పలేముగాని, ప్రతి తరంలోనూ కొత్త కొత్తవి చేర్చబడుతూ, పాతవి కొద్ది కొద్దిగా మార్పు చెందుతూ, నేటికి వాటి సంఖ్య వెయ్యి వరకు వచ్చింది. చాలా దేశాల్లో ఈ కతలు వాళ్ల వాళ్ల సంస్కృతీ సంప్రదాయాల కనుగుణంగా మార్పు చెంది, జానపద కథల్లో భాగమై పోయాయి. ప్రపంచంలోని అనేక భాషల్లోకి ఈ కథలు అనువాదం చెందాయి. నలుగురు కలిసి కూర్చున్న చోట, నసీరుద్దీన్ కథలు చెప్పుకొని ఆనందించటం చాలా దేశాల సంస్కృతుల్లో ఆనవాయితీగా ఉన్నది. సందర్భానికి తగ్గట్టుగా ఏదో కథ ఉంటుంది. ప్రతి కథలో పైకి కనిపించే అర్థం ఒకటి, లోతుగా ఆలోచిస్తే తెలిసే లోపలి అర్థం ఇంకొకటి ఉంటుంది. గంభీరమైన తాత్వికార్థం ఉండబట్టే ఈ కథలకు అంతటి ఖ్యాతి, గౌరవం లభించింది. ముల్లా నసీరుద్దీన్ కథల గురించి ఉపన్యసించే కంటే, ఆ కథల్నే ఒకటి రెండు వినిపిస్తే వాటి గొప్పతనం వినేవాళ్లకు చప్పున స్ఫురిస్తుంది. ఎవరిని నమ్మేది? ముల్లా నసీరుద్దీన్ ఇంటికి ఓ పొరిగింటాయన వచ్చి తలుపు కొట్టాడు. ముల్లా తలుపు తీశాడు. ‘ఈ ఒక్కరోజుకు నీ గాడిదను అరువిస్తావా? పక్క ఊరికి సరుకు తీసుకు వెళ్లాలి’ అని అడిగాడు ఆ వచ్చినాయన. గాడిదను ఇవ్వడం ముల్లాకు ఇష్టం లేకపోయింది. తన అయిష్టత బయట పడకుండా ముల్లా సమాధానం చెప్పాడు.‘క్షమించాలి. ఏమనుకోకు. నేను ఈ వరకే గాడిదను ఇంకొకరికి ఇచ్చాను’సరిగ్గా అదే సమయానికి దొడ్లో కట్టివేసిన గాడిద ఓండ్ర పెట్టటం వినిపించింది. ‘ముల్లా. మరి నీ గాడిద అరుపు వినిపిస్తోంది గదా’ అన్నాడు ఆ పొరిగింటాయన. ‘ఎవర్ని నమ్ముతావు నీవు?’ చిరాగ్గా అడిగాడు ముల్లా. ‘నన్నా... ఆ గాడిదనా?’ ఒకటే రుచి ద్రాక్ష పళ్లతో నిండిన రెండు బుట్టల్ని గాడిద మీద వేసి తోట నుండి తిరిగి వస్తున్న ముల్లాను చూశారు కొంతమంది పిల్లలు. వాళ్లు నసీరుద్దీన్ చుట్టూ చేరి రుచి చూడటానికి కాసిని ద్రాక్ష పళ్లు అడిగారు. ముల్లా ద్రాక్ష గుత్తినొక దాన్ని తీసి తలా ఒక ద్రాక్ష పండు ఇచ్చాడు. ‘అన్ని ద్రాక్ష పళ్లు ఉన్నవి గదా నీ దగ్గర. మాకిచ్చేది ఇంతేనా?’ అని గొణిగారు వాళ్లు. ‘బుట్టడైనా, ఒక్కటైనా తేడా ఏం లేదు. అన్నింటిదీ ఒకటే రుచి’ అంటూ ముల్లా ముందుకు సాగిపోయాడు. ప్రసంగం: ఓసారి నసీరుద్దీన్ను మతం గురించి ప్రసంగించవలసిందిగా ఆ ఊరి వాళ్లు కోరారు. ప్రసంగించే ముందు నసీరుద్దీన్ అడిగాడు- ‘నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా?’. తెలియదని చెప్పారు వాళ్లు. వెంటనే నసీరుద్దీన్ ‘నేను ఏం మాట్లాడబోతున్నానో తెలియనివాళ్ల ముందు ప్రసంగించటం నాకు ఇష్టం లేదు’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఊళ్లో వాళ్లు చాలా తర్జనభర్జన పడి, మర్నాడు మళ్లీ ఆయన్ను పిలిచారు. ఈసారి నిన్నటికి మల్లే అదే ప్రశ్న వేయగా అందరూ ‘తెలుసు’ అని సమాధానం చెప్పారు. వెంటనే ముల్లా ‘నేను మాట్లాడబోయేది ఏమిటో మీకు ముందుగానే తెలుసు గాబట్టి మీ సమయాన్ని నేను వృథా చేయను’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.దాంతో వూరి వాళ్లందరూ నిజంగానే అయోమయంలో పడ్డారు. ఇంకోసారి ప్రయత్నించి చూద్దామని, మరుసటి రోజు మళ్లీ నసీరుద్దీన్ను ఆహ్వానించారు. అతడు మళ్లీ అదే ప్రశ్న వేశాడు ‘నేను మాట్లాడబోయేది ఏమిటో మీకు తెలుసా?’ ఈసారి వాళ్లంతా ముందుగానే కూడబలుక్కుని వచ్చారు. అందువల్ల సగం మంది ‘తెలుసు’ అని, సగం మంది ‘తెలియదు’ అని సమాధానం చెప్పారు. అప్పుడు ముల్లా నసీరుద్దీన్ అన్నాడు- ‘తెలిసిన సగం మంది తెలియని సగం మందికి చెప్పండి’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. లెక్క ఒకప్పుడు నసీరుద్దీన్ దగ్గర కొంత డబ్బు పోగైంది. దాంతో చాలామంది ఆయన చుట్టూ చీమల్లా చేరారు. ఒకాయన నసీరుద్దీన్ను అడిగాడు ‘ముల్లా. నీకెంత మంది స్నేహితులు ఉన్నారో లెక్క చెప్పగలవా?’ అని. అందుకు నసీరుద్దీన్ అన్నాడు, ‘ఇప్పటికిప్పుడు లెక్క చెప్పటం ఎలా కుదురుతుంది? చేతిలో పైసా లేనప్పుడు గదా ఆ లెక్క తెలిసేది? ’వెతకడం ఓసారి ముల్లా నసీరుద్దీన్ తన ఇంటి బయట ఏదో వెతుకుతూ ఒకతనికి కనిపించాడు. ఏమిటి అని అడిగితే తాళం చెవి కోసం అని సమాధానం చెప్పాడు. ఆ అడిగిన మనిషి కూడా ముల్లాతో పాటు వెతకటం మొదలుపెట్టాడు. కాసేపయ్యాక అతడు అడిగాడు. ‘నీవు సరిగ్గా ఎక్కడ పోగొట్టుకున్నావు?’ ముల్లా సమాధానం - ‘ఇంట్లో’ ‘మరి ఇక్కడ వెతుకుతున్నావెందుకు?’ ‘ఇంట్లో కంటే ఇక్కడ వెలుతురు ఎక్కువగా ఉంది’ అని ముల్లా సమాధానం. ఇలా ఉంటవి ముల్లా నసీరుద్దీన్ కథలు. అటు టర్కీ నుంచి ఇటు చైనా, రష్యాల దాకా ఇవాళ ఆయన పేరు విననివాళ్లు లేరు. ముల్లా నసీరుద్దీన్ను కొన్ని దేశాల్లో నసీరుద్దీన్ హోడ్జా అని కూడా పిలుస్తారు. అంతర్జాతీయ నసీరుద్దీన్ ఉత్సవం ప్రతి సంవత్సరం అతని నివాస స్థలమైన టర్కీలోని అక్సెహిర్ పట్టణంలో జూలై 5- 10 మధ్య జరుగుతుంది. యునెస్కో వారు 1996-97 సంవత్సరాన్ని అంతర్జాతీయ నసీరుద్దీన్ సంవత్సరంగా గుర్తించి, అతని కథలకు అతనికి ఒక ప్రత్యేకమైన గౌరవం కలుగచేశారు. - దీవి సుబ్బారావు