విభజనకు నోచుకోని హైకోర్టు
తెలంగాణ సర్కారు స్థలం చూపినా ఫలితం శూన్యం
ఏపీలో హైకోర్టు ఏర్పాటయ్యే వరకూ విభజన లేనట్టే!
హైకోర్టు విభజన ఎటూ తేలలేదు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసినా, ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపచేసినా, గచ్చిబౌలిలో సర్కారు స్థలం చూపినా హైకోర్టు విభజన మాత్రం జరగలేదు. గచ్చిబౌలిలో హైకోర్టు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం స్థలం చూపడం, దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి స్పందించి హైకోర్టు సీజేకు లేఖ రాయడంతో ఇక విభజన ఖాయమని అందరూ భావించారు. అయితే చట్టంలో నిర్దేశించిన ప్రకారం ఏపీ హైకోర్టు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత హైకోర్టే ఉమ్మడిగా ఉంటుందని సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల స్పష్టంచేసింది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన కొంతకాలం తర్వాత హైకోర్టు విభజన కోసం తెలంగాణ న్యాయవాదులు ఉద్యమాన్ని ప్రారంభించారు. అటు హైకోర్టులో ఇటు జిల్లాస్థాయి కోర్టుల్లో ఆందోళన కొనసాగించారు. తెలంగాణ ప్రభుత్వం స్థలం చూపితే మూడు నెలల్లో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటవుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ మార్చి 15న స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత నాలుగు రోజులకు హైకోర్టు విభజన కోసం తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది.
అనంతరం సదానంద గౌడ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. కోర్టు విభజన అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రులు, న్యాయశాఖ మంత్రుల సమావేశంలో తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హైకోర్టు విభజనకు డిమాండ్ చేశారు. తెలంగాణ ఎంపీలు పలుమార్లు పార్లమెంట్లో హైకోర్టు విభజన అంశాన్ని లేవనెత్తారు. ఇదిలా ఉండగానే.. హైకోర్టు విభజన కోసం కేంద్రం తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ వ్యాజ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సాధన సమితి, కొందరు లాయర్లు కూడా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. పిల్‌పై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత హైకోర్టు ఉమ్మడిగా కొనసాగుతుందని తేల్చిచెప్పింది.