నన్ను కలిస్తేనే సర్టిఫికెట్.. మహిళకు వైద్యుడి వేధింపులు
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా పెద్దాస్పత్రి వైద్యులపై ఇంతకాలం విధులకు ఆలస్యంగా వస్తున్నారని, సమయానికి వచ్చినా కొద్దిసేపు ఉండి వెళ్లి పోతున్నారనే ఆరోపణలు ఉండేవి. కానీ ఇప్పుడు సర్టిఫికెట్ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళపై కన్నేసిన ఒక వైద్యుడు ఆమెను వేధించినట్లు వెలుగుచూడడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. ఖమ్మం జిల్లాకు చెందిన తన తండ్రికి సదరమ్ సర్టిఫికెట్ ఇప్పించేందుకు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మహిళ గత నెలలో తన తండ్రితో పాటు పెద్దాస్పత్రికి వచ్చింది.
ఓపీ చీటీ రాయించుకుని ఓ వైద్యుడి వద్దకు వెళ్లగా ఆయన మహిళపై కన్నేశాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకుని తరచుగా ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు. ఈ తతంగం గత నెల 17నుండి జరుగుతోంది. సదరం సర్టిఫికెట్ కావాలంటే తనతో శారీరకంగా కలవాలని వేధిస్తున్న ఆయన, గత వారం ఒంటరిగా రావాలని సూచించాడు. దీంతో విసిగిపోయిన మహిళ ఈనెల 4వ తేదీన పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేసింది.
చదవండి: అన్నా.. మనల్ని పిలుస్తారే!.. బెంబేలెత్తుతున్న ఎమ్మెల్యేలు, మాజీలు
అలాగే, రెండు రోజుల క్రితం ఖమ్మంలో పోలీసులకు సైతం ఫిర్యాదు ఇచ్చింది. తండ్రి సర్టిఫికెట్ కోసం వెళ్తే తనను మానసికంగా వేధించిన వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరగా ఆస్పత్రి సూపరింటెండెంట్ విచారణ చేపట్టారు. ఈమేరకు విచారణకు హాజరుకావాలని వైద్యుడికి సూపరింటెండెంట్ సూచించిన నాటి నుంచి విధులకు గైర్హాజరవుతున్నాడు.
ఈ విషయ మై సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడిని విచారణకు రావాలని సమాచారం ఇవ్వగా విధులకే కావడం లేదని తెలిపారు. త్వరలోనే విచారణ చేపట్టి వైద్యుడిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని, ఆతర్వాత విషయం పోలీసులు చూసుకుంటారని సూపరింటెండెంట్ పేర్కొన్నారు.