వైద్యశాస్త్రంలో మరో అద్భుతం
చెన్నై: ఎవరైనా దూకుడుగా ప్రవర్తిస్తే ‘ఎదిరించడానికి నీకు ఎన్ని గుండెలు’ అంటూ నిలదీస్తారు. ఎందుకంటే ఎవరికైనా ఉండేది ఒకటే గుండె కనుక. అయితే, ఇక కేరళకు చెందిన ఆ వ్యక్తిని మాత్రం అలా బెదిరించడానికి ఏమాత్రం వీల్లేదు. ఆయనకు కుడి, ఎడమలో రెండు గుండెలు ఉండటమే ఇందుకు కారణం. ఆ వివరాలిలా ఉన్నాయి... గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కేరళకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి చికిత్స కోసం తమిళనాడు కోయంబత్తూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రి కోవాయ్ మెడికల్ సెంటర్లో చేరాడు. పరీక్షించిన వైద్యులు గుండె పనితీరు మరీ దారుణంగా ఉన్నట్లు గుర్తించి ప్రాణాలు నిలబెట్టాలంటే మరో గుండెను అమర్చక తప్పదని నిర్ణయించారు.
అదే ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్‌కు గురైన ఒక మహిళ గుండెను అమర్చాలని భావించారు. అయితే ఆమె గుండె పనితీరు కూడా అంత సంతృప్తికరంగా లేదని, కేవలం పదిశాతం మాత్రం పనిచేస్తున్నట్లు గుర్తించారు. కేరళకు చెందిన వ్యక్తి శరీరంలోని గుండెను తొలగించకుండా మహిళ నుండి సేకరించిన గుండెను కుడివైపున అమర్చాలని వైద్యలు తీర్మానించారు. డాక్టర్ ప్రశాంత్ వైజయంత్ నేతృత్వంలోని వైద్యుల బృందం సుమారు నాలుగు గంటలపాటూ శ్రమించి ఆపరేషన్‌ను రెండు రోజుల క్రితం సమర్దవంతంగా పూర్తిచేశారు. ప్రస్తుతం అతని శరీరంలోని రెండు గుండెలు సహజరీతిలో పనిచేస్తున్నాయి. రెండు గుండెల నుండి చప్పుళ్లు వినపడుతున్నాయి. భారతదేశంలో రెండు గుండెలు కలిగిన తొలి వ్యక్తిగా వైద్యులు నిర్దారించారు. అయితే పేషెంట్ వివరాలను డాక్టర్ ప్రశాంత్ బృందం గోప్యంగా ఉంచింది.