doctors care less
-
వైద్యులపై కొరడా.. ఒకరు సస్పెన్షన్..
సాక్షి, ఆదిలాబాద్ : వైద్యో నారాయణో హరి.. కళ్ల ముందు కనిపించని దేవుని కంటే రోగి ప్రాణాలు కాపాడే వైద్యుడినే దేవునిగా భావిస్తారు.. అంతటి మహోన్నతమైన వృత్తికి కొంతమంది కలాంకం తీసుకొస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వేలాది రూపాయల వేతనాలు తీసుకుంటున్నా వృత్తికి న్యాయం చేయలేకపోతున్నారు. విధులు సక్రమంగా నిర్వహించక పోవడంతో రోగుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా వారికి నచ్చినట్టే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో విధులు సక్రమంగా నిర్వహించని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్‌పై వేటుపడింది. ఎట్టకేలకు కలెక్టర్ దివ్యదేవరాజన్ కొరడా ఝులిపించారు. ఈ చర్యలతో మిగితా డుమ్మా వైద్యుల్లో భయాందోళన మొదలైంది. ఇకనైనా రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని స్థానికులు కోరుతున్నారు. ఇకనైనా తీరు మారేనా.. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా రిమ్స్‌లో పనిచేస్తున్న కొంతమంది వైద్యుల తీరు మారడం లేదు. గిరిజన మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008లో రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)ను ఏర్పాటు చేశారు. వందపడకల ఆస్పత్రిని నిర్మించారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో కార్పొరేట్ వైద్యం అందుతుందని భావించిన జిల్లా ప్రజలకు చిన్నపాటి రోగాలకు తప్పా నాణ్యమైన వైద్యం అందని పరిస్థితి. గుండె నొప్పి, క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హైదరాబాద్, నాగ్‌పూర్, యావత్మాల్ తదితర ప్రాంతాలకు రెఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసిన పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయి. వైద్యుల తీరు... రిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కొంతమంది వైద్యులు ఉదయం 10గంటల వరకు వచ్చి మధ్యాహ్నం ఒంటిగంటకే ఇంటి ముఖం పడుతున్నారు. అత్యవసర సమయంలో రిమ్స్‌కు వచ్చిన రోగులు వైద్యులు అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు అనేకం. కాల్ డ్యూటీ చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. మధ్యాహ్నం నుంచి జిల్లా కేంద్రంలో క్లినిక్‌లు నిర్వహిస్తూ ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటుగా క్లీనిక్‌లు... రిమ్స్‌లో పనిచేసే కొంత మంది వైద్యులు ప్రైవేట్ క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలు నిర్వహిస్తూ రెగ్యులర్ డ్యూటీని నిర్లక్ష్యం చేస్తున్నారు. రిమ్స్‌ను పర్యవేక్షించాలి్సన ఓ అధికారి సైతం క్లినిక్ నిర్వహించడం గమనార్హం. వీరితో పాటు గైనకాలజిస్ట్లు, సివిల్సర్జన్లు, అనస్తీషియా వైద్యులు, ఈఎన్టీ, కంటి వైద్యులు, ఆర్థోపెడిక్‌లు క్లినిక్‌లు నిర్వహిస్తూ విధులకు ఎగనామం పెడుతున్నారు. ఈ విషయం బహిరంగంగా అందరికీ తెలిసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా సాగుతోంది. బయోమెట్రిక్ ఉన్నా.. వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా సమయపాలన పాటించాలనే ఉద్దేశంతో కలెక్టర్ దివ్యదేవరాజన్ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా డుమ్మా వైద్యులు మాత్రం తమ పని తాము కానిచ్చేస్తున్నారు. ఉదయం పూట బయోమెట్రిక్ వేలి ముద్రలు వేసి సాయంత్రం తమ క్లినిక్‌లు ముగించుకున్న తర్వాత వచ్చి థంబ్ పెడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇలాంటి వైద్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దివ్యదేవరాజన్ బుధవారం రిమ్స్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో వెల్లడించిన మరుసటి రోజే చర్యలను పూనుకున్నారు. ఒకరు సస్పెన్షన్.. మరొకరు సరెండర్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సక్రమంగా హాజరు కాకపోవడం, బయోమెట్రిక్ హాజరులో థంబ్ పెట్టి ప్రైవేట్ క్లినిక్‌లో విధులు వ్యవహరించినందుకు అనస్తిషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్‌ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసినట్లు రిమ్స్ అధికారులు తెలిపారు. అదేవిధంగా బయోకెమిస్ట్రి అసోసియేట్ ప్రొఫెసర్ రమా శౌరి సక్రమంగా విధులకు హాజరుకాకపోవడం, గత కొన్ని రోజులుగా గైర్హాజరవుతున్న దృష్ట్యా ఆమెను డీఎంఈకి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. -
బాలుడి మరణానికి కారణమేంటి?
సాక్షి, నరసన్నపేట : మండలంలోని మడపాం గ్రామానికి చెందిన సింగారపు రోహిత్(3) శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందిన ఘటనపై శ్రీకాకుళం టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై సీఐ శంకరరావు ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం విచారణ ప్రారంభించారు. పోలీసులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు..ఈ నెల 20వ తేదీన మడపాంకు చెందిన సింగారపు ఈశ్వరమ్మ తన మూడేళ్ల కుమారునికి జ్వరం రావడంతో శ్రీకాకుళంలోని విజయహర్ష ఆస్పత్రిలో చేర్పించారు. ఆ రోజు సాయంత్రం వరకు డాక్టర్లు జ్వరం కోసం వైద్యం చేశారు. అయితే రాత్రికి బాలుడికి కడుపు నొప్పి రావడంతో తల్లి వైద్యులకు చెప్పగా కడుపు నొప్పి తగ్గేందుకు డాక్టర్లు ఇంజెక్షన్లు ఇచ్చారు. అయితే ఇంజెక్షన్లు వికటించడంతో 30 నిమిషాల్లో బాలుడు మృతి చెందాడని తల్లి ఈశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు బాలుడు ఇబ్బంది పడుతున్నా వైద్యులు పట్టించుకోకుండా, తన కుమారుడిని అన్యాయంగా చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై శ్రీకాకుళం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో 23వ తేదీన ఫిర్యాదు చేశామని, 25వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. మడపాంలో పంచనామా ఈ సంఘటనపై మడపాంలో శ్రీకాకుళం సీఐ శంకరరావు ఆధ్వర్యంలో బుధవారం పంచనామా నిర్వహించారు. గ్రామ పెద్దలు, బాలుడి తల్లిదండ్రుల నుంచి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఖననం చేసిన బాలుడి మృతదేహాన్ని బయటకు తీసి వైద్యులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో గురువారం పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలిపారు. విచారణలో సీఐతో పాటు డిప్యూటీ తహసీల్దార్ సురేష్‌కుమార్, వీఆర్వో శ్యామ్, గ్రామ పెద్దలు సుందరరావు, రుప్ప సీతారాం, ప్రగడ గోపి తదితరులు పాల్గొన్నారు. మా బాబుని అన్యాయంగా చంపేశారు నేను చూస్తుండగానే తన బాబు మృతి చెందాడని, దానికి ఆస్పత్రి వైద్యులే కారణమని సింగారపు ఈశ్వరమ్మ విలపించారు. సిబ్బందిని నిలదీస్తే రూ.60 వేలు ఇచ్చారని, వైద్యానికి కూడా డబ్బులు తీసుకోలేదన్నారు. ఇలా ఎంతమందిని చంపేసి డబ్బులు ఇస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనపై సక్రమంగా దర్యాప్తు నిర్వహించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
అబార్షన్ల అడ్డా.. ఖలీల్‌వాడి!
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడి అబార్షన్లకు అడ్డాగా మారింది! ప్రైవేట్ వైద్యుల కాసుల కక్కుర్తి యువతుల ప్రాణాల మీదకు తెస్తోంది. కనీస నిబంధనలు పాటించకుండా అబార్షన్లు చేస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఖలీల్వాడిలోని వివిధ ఆస్పత్రుల్లో రోజూ పది వరకు అబార్షన్లు చేస్తున్నారు. కానీ, ఎక్కడా ఎలాంటి నిబంధనలు పాటించరు. ఎవరు, ఎందుకు ఆస్పత్రికి వచ్చారో, వారికి ఏ చికిత్స చేశారో కూడా రికార్డులు నిర్వహించరు. ప్రైవేట్ ఆస్పత్రులపై వైద్యశాఖ పరిశీలన లేకపోవడంతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. సాధారణ చికిత్సలే కాదు, అబార్షన్ల పేరిట విచ్చలవిడిగా దండుకుంటున్నారు. కాసుల కక్కుర్తి.. ఖలీల్వాడిలో సుమారు 40 వరకు ప్రసవ ఆసుపత్రులు ఉన్నాయి. ఇందులో కొన్ని ఆస్పత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా, విచ్చలవిడిగా అబార్షన్లు చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ పరిశీలన లేకపోవడంతో ఈ తతంగం యథేచ్ఛగా కొనసాగుతోంది. గతంలో ఆర్మూర్ డివిజన్‌కు చెందిన ఓ యువతికి అబార్షన్ చేయగా అది వికటించి మృతి చెందింది. ఇలాంటి ఘటనలు రెండు, మూడు వెలుగు చూసినా అధికారులు పెద్దగా స్పందించలేదు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు డబ్బుల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మోసపోయి.. ప్రేమ పేరుతోనో, మరే కారణంతోనో వలలో పడి చాలా మంది అమాయక యువతులు మోసపోతున్నారు. ఎదుటి వారిని పూర్తిగా సర్వస్వం అప్పగించేస్తున్నారు. ఈ క్రమంలో గర్భం దాల్చుతున్నారు. మరోవైపు, భర్తకు దూరంగా ఉన్న మహిళలు, అలాగే, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న వారు అవాంఛిత గర్భం దాల్చుతున్నారు. అక్రమ సంబంధాలతో పాటు ప్రేమ పేరుతో మోసానికి గురైన వారు అబార్షన్ల కోసం ఎక్కువగా వస్తున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. అక్కడి మహిళలు, యువతులు పెద్దగా చదువుకోక పోవడం, అలాగే, ఆధునిక గర్భనిరోధక పద్ధతులు తెలియక పోవడంతో ఈజీగా మోసపోతున్నారు. జిల్లా కేంద్రంలోనే ఎక్కువగా.. అవాంఛిత గర్భం దాల్చిన యువతులు, మహిళలు తొలుత ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వారు కమీషన్లకు కక్కుర్తి పడి మాయమాటలు చెప్పి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు తీసుకొస్తున్నారు. ఇలా వచ్చిన యువతులకు కనీస నిబంధనలు, ప్రమాణాలు పాటించకుండా ఇష్టమొచ్చినట్లు అబార్షన్లు చేస్తున్నారు. అవి వికటించి ప్రాణాల మీదకు వస్తున్నాయి. కేసులు తగ్గడంతో.. ప్రభుత్వం సర్కారు ఆస్పత్రులను బలోపేతం చేయడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే వారికి పలు ప్రయోజనాలు కల్పిస్తుండడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో కొందరు ప్రైవేట్ డాక్టర్లు అబార్షన్లను ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ఎంత రిస్క్ కేసు అయినా సరే అబార్షన్లు చేసేస్తున్నారు. యువతుల బలహీనతలను ఆధారంగా చేసుకొని ఒక్కో అబార్షన్‌కు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుంటున్నట్లు తెలిసింది. పట్టించుకోని వైద్యారోగ్య శాఖ ప్రైవేట్ ఆస్పత్రుల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నా, అనవసరమైన పరీక్షలు, చికిత్సల పేరుతో దండుకుంటున్నా వైద్యారోగ్య శాఖ స్పందించడం లేదు. ఇక గుట్టుచప్పుడు కాకుండా సాగే అబార్షన్ల విషయంలో అసలే మాత్రం పట్టించుకోవడం లేదు. అబార్షన్లకు సంబంధించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు వచ్చినా వాటిపై వైద్యారోగ్యశాఖ విచారణ చేపట్టలేదు. ముఖ్యంగా ఖలీల్వాడిలోని ఓ ఆస్పత్రి, అలాగే, పక్కనే గల సరస్వతినగర్‌లో రెండు ఆస్పత్రులు, ప్రధాన రోడ్డుకు ఉన్న మరో ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్కువగా అబార్షన్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రిలో వారం వ్యవధిలో 15 వరకు అబార్షన్ కేసులు నమోదవుతున్నా పెద్దగా స్పందించిందీ లేదు. వాస్తవానికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో తరచూ తనిఖీలు నిర్వహించాల్సిన వైద్యారోగ్య శాఖ అధికారులు ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాల్లేవు. పైగా కనీసం పరిశీలన కూడా చేయకుండా ఎంతో కొంత తీసుకుంటూ ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ‘మచ్చ’తునకలెన్నో.. గతంలో ఆర్మూర్ డివిజన్‌కు చెందిన ఓ యువతికి అబార్షన్ చేయగా, అది వికటించి ఆమె మృతి చెందింది. నిర్మల్‌కు చెందిన మరో మహిళకు సరస్వతినగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు అబార్షన్ చేశారు. అది వికటించి ఆమె ప్రాణాల మీదకు వచ్చింది. డిచ్పల్లి మండలానికి చెందిన మరో మహిళ ఆస్పత్రికి రాగా, అబార్షన్ చేసేశారు. దీంతో బాధితురాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. కఠిన చర్యలు తీసుకుంటాం.. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో అబార్షన్లు చేపడితే కఠిన చర్యలు చేపడుతాం. ఆస్పత్రులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. త్వరలోనే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. లోపాలు ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. – సుదర్శనం, డీఎంహెచ్‌వో -
వైద్యుల నిర్లక్ష్యం వల్ల గర్భిణి మృతి
సంగారెడ్డి: వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భిణి మృతి చెందిందంటూ ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనలకు దిగారు. పట్టణంలోని శ్రీ సత్య నర్సింగ్ హోంలో చికిత్స కోసం వచ్చిన ఆకారపు స్వప్న అనే గర్భిణి గురువారం మృతిచెందింది. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటు కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.