documentary film maker
-
రష్యా సినిమా హాళ్లలో ఉక్రెయిన్‌పై దాడి దృశ్యాలు.. పుతిన్ కీలక ఆదేశాలు
మాస్కో: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తూ విధ్వంసాన్ని సృష్టిస్తోంది రష్యా. వేలాది మంది సైనికులను కోల్పోతున్నా వెనక్కి తగ్గటం లేదు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇప్పటికే సైనిక బలగాల సామర్థ్యాన్ని పెంచుకునేందుకే మొగ్గు చూపిన పుతిన్.. తాజాగా జారీ చేసిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. ఉక్రెయిన్‌పై దాడి, నియో-నాజీల భావజాలానికి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధానికి సంబంధించిన డాక్యుమెంటరీలను సినిమా హాళ్లలో ప్రదర్శించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దాడులు మొదలు పెట్టి ఏడాది కావస్తున్న క్రమంలో ఫిబ్రవరి నాటికి ఈ డాక్యుమెంటరీలను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది క్రెమ్లిన్. ఫిబ్రవరి 1 నాటికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలను అమలు చేస్తుందని పేర్కొంది. ఈ ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌లో పాలుపంచుకుని తమ హీరోయిజాన్ని ప్రదర్శించిన వారికి అంకితం చేసే డాక్యుమెంటరీలు తీసేలా పుతిన్ ఆదేశించినట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఆయా సినిమా నిర్మాతలకు సహాయం అందించాలని రక్షణ శాఖకు సూచించినట్లు పేర్కొంది. ఆ దిశగా తీసుకున్న చర్యలపై మార్చి 1 నాటికి నివేదిక సమర్పించాలని రక్షణ మంత్రి సెర్గీ షోయిగూను ఆదేశించారు. గత ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడి మొదలు పెట్టి యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పశ్చిమ ప్రాంత అనుకూల దేశంలో నిరాయుధీకరణ, నాజీ భావజాలం కట్టడి అంటూ ఈ సైనిక చర్య చేపట్టారు. ఈ దాడి చెపట్టినప్పటి నుంచి రష్యాలోని అధికార టీవీ ఛానళ్లు.. తమ సైనిక బలగాలను పొగుడుతూ పలు కార్యక్రమాలను ప్రదర్శిస్తూ వస్తున్నాయి. మరోవైపు.. స్వతంత్ర మీడియా సంస్థలు మూసివేశారు. జర్నలిస్టులు దేశం దాటి వెళ్లిపోయారు. ఉక్రెయిన్‌పై దాడిని ఎవరైనా విమర్శిస్తే జైలు శిక్ష విధించేలా ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: Russia-Ukraine war: ఒక్క క్షిపణితో 400 మంది హతం ! -
Kaali Poster: ఫిల్మ్‌మేకర్ లీనాపై ఫిర్యాదుల వెల్లువ
నూపుర్ శర్మ వ్యవహారం ఇంకా వార్తల్లోనే ఉన్న వేళ.. ఈసారి హిందువుల మనోభావాలు దెబ్బ తీసిందంటూ ఓ ఫిల్మ్‌మేకర్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ‘కాళి’ పేరుతో రిలీజ్ అయిన ఓ డాక్యుమెంటరీ పోస్టర్.. ఇప్పుడు పెనుదుమారంగా మారే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులో పుట్టి.. టొరంటో(కెనడా)లో ఉంటున్న లీనా మణిమేకలై.. కాళి టైటిల్‌తో రెండు రోజుల కిందట ఓ పోస్టర్‌ను వదిలింది. పోస్టర్ మరీ అభ్యంతరకరంగా ఉండడంతో.. ఆమె క్షమాపణలు చెబుతూ, పోస్టర్‌ను తొలగించాలంటూ పలువురు హెచ్చరికలతో కూడిన డిమాండ్లు చేశారు. ఈ తరుణంలో.. క్షమాపణలు చెప్పకపోగా మరింత రెచ్చగొట్టేలా లీనా మణిమేకలై వ్యవహరించింది. ఈ ఉదయం ఆమె తమిళంలో చేసిన ఓ ట్వీట్.. విషయాన్ని మరింత హీటెక్కించింది. “எனக்கு இழப்பதற்கு ஒன்றுமில்லை. இருக்கும் வரை எதற்கும் அஞ்சாமல் நம்புவதைப் பேசும் குரலோடு இருந்துவிட விரும்புகிறேன். அதற்கு விலை என் உயிர் தான் என்றால் தரலாம்” https://t.co/fEU3sWY4HK — Leena Manimekalai (@LeenaManimekali) July 4, 2022 అరెస్ట్ లీనా మణిమేకలై హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో.. ముందు సినిమా చూడాలని, ఆపై అరెస్ట్ అంటూ డిమాండ్ చేసిన వాళ్లంతా లవ్యూ అంటారంటూ ట్వీట్లో ఆమె పేర్కొంది. అయితే ఆమె వివరణతో వివాదం మాత్రం చల్లారడం లేదు. నూపుర్ శర్మను తప్పుబట్టిన వాళ్లంతా ఇప్పుడు ఏమైపోయారని నిలదీస్తున్నారు పలువురు. ఢిల్లీకి చెందిన ఓ లాయర్ లీనా.. లీనాపై ఢిల్లీ సైబర్ సెల్ ఐఎఫ్ఎస్వోలో ఫిర్యాదు చేశారు. గౌ మహాసభ నిర్వాహకుడు అజయ్ గౌతమ్.. పోలీసులకు పిర్యాదు చేయడంతో పాటు హోం సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. తక్షణమే ఈ డాక్యుమెంటరీని ఆపించాలంటూ కోరుతున్నారాయన. మరికొన్ని చోట్ల సైతం లీనాపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. Super thrilled to share the launch of my recent film - today at @AgaKhanMuseum as part of its “Rhythms of Canada” Link: https://t.co/RAQimMt7Ln I made this performance doc as a cohort of https://t.co/D5ywx1Y7Wu@YorkuAMPD @TorontoMet @YorkUFGS Feeling pumped with my CREW❤️ pic.twitter.com/L8LDDnctC9 — Leena Manimekalai (@LeenaManimekali) July 2, 2022 ‘‘పోగొట్టుకోవడానికి నా దగ్గరంటూ ఏమీ లేదు. ప్రాణం ఉన్నంత వరకు.. దేనికీ భయపడకుండా మాట్లాడతాను. ఒకవేళ నా ప్రాణమే వెల కడితే.. ఇచ్చేస్తాను’ అంటూ మరో ప్రకటన చేసింది ఆమె. టొరంటో ఆగాఖాన్ మ్యూజియమ్ వద్ద రిథమ్స్ ఆఫ్ కెనడా సెగ్మెంట్లో భాగంగా ఈ డాక్యుమెంటరీని తీసినట్లు ఆమె చెప్తున్నారు. ఒకవైపు లీనా.. మరోవైపు విమర్శకులు ఎంతకూ తగ్గకపోవడంతో ఈ వివాదం ఎంత ముదురుతుందో చూడాలి!. -
డాక్యుమెంటరీ ఫిల్మ్: ఇది నా ఇల్లు
ఎవరినైనా కలిసినప్పుడు మంచీ చెడు మధ్యలో తప్పక వచ్చే ప్రశ్న ‘మీ ఇల్లెక్కడ?!’ ‘ఇదే ప్రశ్నను లద్దాఖ్‌లోని ఓ పెద్ద మనిషిని అడిగినప్పుడు అక్కడి చుట్టూ కొండలు, విశాల మైదానాలు చూపిస్తూ... ఈ ప్రకృతి ఒడే నా ఇల్లు అని పరిచయం చేస్తే... ఆ ప్రపంచంలో 45 రోజులు ఉండి తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఇది నా ఇల్లు’ అని వివరించారు దీపాకిరణ్. ప్రపంచ వ్యాప్తంగా 75 వేల మందికి పైగా స్టోరీ టెల్లర్స్‌ను చేరుకున్న దీపాకిరణ్ హైదరాబాద్ వాసి. స్టోరీ ఆర్ట్ ఫౌండేషన్ ఫౌండర్, ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్, ఆర్ట్–బేస్డ్ ఎడ్యుకేషనలిస్ట్. ఈ స్టోరీ టెల్లర్ ఇటీవల ‘దిస్ ఈజ్ మై హోమ్’ అనే డాక్యుమెంటరీ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ యేడాది ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎమ్ఐఎఫ్ఎఫ్) లో ప్రదర్శనకు వచ్చిన 800 ఎంట్రీలలో ‘దిస్ ఈజ్ మై హోమ్’ టాప్ టెన్ జాబితాలో నిలిచింది. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడినప్పుడు డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపకల్పన గురించి ఇలా పంచుకున్నారు. ‘‘సముద్రం నుండి 3,700 మీటర్ల ఎత్తులో లద్దాఖ్ పర్వతాలలోని మారుమూల గ్రామంలో ఒక యువ గ్రాఫిక్ డిజైనర్ జీవితాన్ని డాక్యుమెంటరీని రూపొందించాను. లెహ్–లదాఖ్‌లోని రెసిడెన్షియల్ కోర్సులో భాగంగా, వర్క్ నేర్చుకుంటూ తీసిన మొదటి డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇది. కథ కలిపిన పరిచయాలు కిందటేడాది ఆగస్టులో రెండు వర్క్‌షాప్స్ కోసం చేసిన ప్లాన్‌లో భాగంగా లదాఖ్‌కు వెళ్లాను. లైఫ్‌లో ఒక ఛేంజ్ కోసం చేసిన ప్రయాణం కూడా. నాతో పాటు వర్క్‌షాప్ కోసం వచ్చిన స్నేహితులున్నారు. లద్దాఖ్‌లో ఒక మారుమూల ప్రాంతం అది. విసిరేసినట్టుగా ఉన్నాయి అక్కడి ఇల్లు. ఒక చిన్న కాఫీ షాప్‌లో కూర్చుని, ఫ్రెండ్స్‌తో సరదాగా ఓ కథ చెబుతున్నాను. మమ్మల్నే గమనిస్తున్న ఓ యువకుడు మేము చెబుతున్న కథ వింటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు. మేమూ అతని గురించి తెలుసుకున్నాం. గ్రాఫిక్ డిజైనర్ అయిన తన పేరు వరుణ్. పట్టణాన్ని వదిలి లద్దాఖ్‌లో కుండలు తయారు చేసే పనిని నేర్చుకుంటున్నాడని తెలిసి చాలా ఆసక్తిగా అనిపించింది. వరుణ్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి ఎన్నో కుటుంబాలను కలిశాం. అలాగే, వరుణ్‌తో పాటు, వారి జీవన శైలిని ఒక కథగా తీసుకోవాలనిపించింది. అక్కడ నుంచి ప్రతీది ఒక ఆసక్తిగా మారిపోయింది. ఒక థీమ్ ప్లాన్ చేసి, వరుణ్‌తో మాట్లాడి డాక్యుమెంటరీ తీయడం ఆరంభించాను. దిస్ ఈజ్ మై హోమ్ వరుణ్ స్థానికులను కలిసి, ఒక్కో వ్యక్తిని కొన్ని ప్రశ్నలు అడగుతుండగా వారు ఇచ్చిన సమాధానాలను తీసుకున్నాను. ఒక వృద్ధుడిని కలిసి మాట్లాడినప్పుడు అతను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇల్లు చాలా చిన్నది. కానీ, వారి ముఖాల్లో కనిపించిన సంతోషాన్ని చూసి ‘పట్ణణాల్లో పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నా, ఈ సంతోషం ఎక్కడా కనిపించదు ఎందుకు?’ అని అడిగినప్పుడు... ‘గదులు ఉండటం ఇల్లు కాదు. అలా చూడండి, చుట్టూ కొండలు, చూసినంత మేర పచ్చదనం. ఇంత పెద్ద ఇల్లు ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది’ అన్నాడు. అతని మాటలు నాకు బాగా నచ్చాయి. ఒక కామిక్ స్ట్రిప్ కూడా నేను అంతకుముందే చూసి ఉన్నాను. అన్నీ కలిపి డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి ‘దిస్ ఈజ్ మై హోమ్’ టైటిల్ సరైనదనుకున్నాను. ఈ మూవీ చూసిన కొందరు డైరెక్టర్లు ‘మేమూ ఆ గ్రామంలో ఉన్నట్టు, అక్కడ వాళ్లను కలుసుకున్నట్టుగా ఉంది’ అని చెప్పారు. చాలా ఆనందంగా అనిపించింది. చాలా శక్తిమంతులు మంచుకొండల్లో అతి చల్లటి వాతావరణం లద్దాఖ్. అలాంటి చోట మాతోపాటు టౌన్‌కి బయల్దేరాలనుకున్న ఒక బామ్మ తెల్లవారు ఝామున నాలుగ్గంటలకే లేచి, చల్లటి నీళ్లతో తలస్నానం చేసి, రెడీ అయిపోయారు. నాకు ఆమె శక్తిని చూసి చాలా అద్భుతం అనిపించింది. మిగతావారూ అలాగే ఉన్నారు. కొత్తగా జీవించాలి.. నా రైటింగ్ బ్యాక్ గ్రౌండ్, స్టోరీ టెల్లింగ్.. నా డాక్యుమెంటరీ వర్క్‌కి బాగా పనికొచ్చాయి. ఎడిటింగ్ వర్క్, వాయిస్ ఓవర్ పూర్తయ్యాక ముందు వరుణ్‌కి పంపించాను. వాళ్ల కుటుంబం మొత్తం ఆ డాక్యుమెంటరీ చూసి, చాలా సంతోషించారు. ఆ తర్వాత ఫిల్మ్ కాంపిటిషన్‌కు పంపించాను. టాప్‌టెన్‌లో నిలిచింది. అంతటితో నా పని పూర్తవ్వలేదు. మరిన్ని కొత్త పనులవైపు చూశాను. ఇటీవలే ఒక సర్టిఫికెట్ లైఫ్ కోచ్‌గా జాయిన్ అయ్యాను. కరోనా సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి మానసిక శక్తిని అందించింది లద్దాఖ్‌లో తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్. అక్కడి స్థానికులతో సంభాషణ, ప్రయాణం ఏదీ అంత సులువు కాలేదు. ప్రతిది ఛాలెంజింగ్. అదే నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. అక్కడి మనుషులు, ప్రకృతి, నేర్చుకున్న కొత్త వర్క్ నుంచి.. మళ్లీ జీవించడం నేర్చుకున్నాను’’ అని వివరించారు ఈ స్టోరీ టెల్లర్ అండ్ డైరెక్టర్. దీపాకిరణ్ – నిర్మలారెడ్డి -
‘జుకర్‌బర్గ్ ఓ ద్రోహి.. లాక్కెళ్లి జైళ్లో పడేయండి’
ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు హాలీవుడ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కెన్ బర్న్స్. అమెరికాకు ప్రధాన శత్రువు జుకర్బర్గేనంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఫేస్బుక్ ద్వారా తప్పుడు సమాచారం వ్యాపింపజేస్తున్నాడని, ముందు అతన్ని(జుకర్‌బర్గ్) జైళ్లో పడేయాలని ఊగిపోయాడు కెన్. ‘‘ఒక డెమొక్రాట్‌గా నేను ఈ విషయం చెప్పట్లేదు. అమెరికా చరిత్రలో బహుశా జుకర్‌బర్గ్ అంతటి ద్రోహి మరొకరు ఉండడేమో. ఫేస్బుక్లో తప్పుడు సమాచారంతో ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తున్నాడు. ఫేస్బుక్ పోస్టులతో మనుషుల మానసిక స్థితితో ఆడుకుంటున్నాడు. అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు. ప్రైవసీ లేని వ్యవహారం ఫేస్బుక్ అంటే. అతన్నే కాదు.. అతని సహోద్యోగిణి షెరిల్ శాండ్‌బర్గ్(ఫేస్బుక్ సీవోవో)ను కూడా లాక్కెళ్లి జైళ్లో పడేయండి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాజీలను న్యూరెంబర్గ్ దగ్గర ఎట్లా విచారించారో.. అట్లా టెక్ దిగ్గజాలమని చెప్పుకుంటున్న వీళ్లను విచారించండి’ అంటూ ఫైర్ అయ్యాడు కెన్. రెండుసార్లు ఆస్కార్ గ్రహీత అయిన బర్న్స్.. డెమొక్రటిక్ మద్ధతుదారుడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఫేస్బుక్ చీఫ్‌పై ఈ ఆరోపణలు చేశాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక న్యూయార్క్ టైమ్స్ టెక్ జర్నలిస్ట్ కారా స్విషర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బర్న్స్ పై ఆరోపణలు చేశాడు. అయితే కారా ఏం అడగకపోయినా.. జుకర్‌బర్గ్ పేరు ప్రస్తావనకు తెచ్చి మరీ చిందులేశాడు ఈ డైరెక్టర్. ఇదిలా ఉంటే 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలో ఫేస్బుక్ మీద సంచలన ఆరోపణలు వెల్లువెత్తినప్పటి నుంచి ‘ప్రైవసీ’ వ్యతిరేకత కొనసాగుతోంది. -
మహిళలు మాత్రమే!
టైటిల్ చూసి కంగారు వద్దండీ.. మహిళలే కాదు.. మగవాళ్లూ సినిమా చూడొచ్చు. కానీ, టైటిల్ మాత్రం ‘మగళిర్ మట్టుమ్’ అని పెట్టారు. అంటే... ‘మహిళలు మాత్రమే’ అని అర్థం. జ్యోతిక నటిస్తున్న తాజా చిత్రమిది. ఇందులో ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా నటిస్తున్నారు. జ్యోతిక భర్త, ప్రముఖ తమిళ హీరో సూర్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘36 వయదినిలే’లో మధ్య తరగతి మహిళగా సినిమా అంతా చీరల్లోనే కనిపించిన జ్యోతిక తాజా సినిమా కోసం మోడ్రన్ స్టైల్లోకి వచ్చేశారు. ఇందులో భానుప్రియ, ఊర్వశి, శరణ్య.. కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా, గతంలో ఇదే టైటిల్‌తో కమల్ ఓ సినిమా నిర్మించి, అతిథి పాత్ర చేశారు. తాజా చిత్రంలో సూర్య అతిథి పాత్రలో కనిపిస్తారని టాక్. ఆ సంగతలా ఉంచితే.. జ్యోతిక సినిమాకి ఈ టైటిల్ పెట్టడానికి పర్మిషన్ కోరుతూ కమల్ని సూర్య కలిశారట. కమల్ కాదంటారా!