సర్పంచ్‌లకే చెక్‌పవర్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సర్పంచ్‌లకు చెక్ పవర్‌ను కల్పిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీఓఎంఎస్ 431 ద్వారా చెక్‌పవర్, జీఓఎంఎస్ 432 ద్వారా చెక్‌పవర్ వినియోగించడంలో మార్గదర్శకాలను నిర్దేశించింది. జూలైలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి నూతన పాలక మండళ్లు ఏర్పాటయ్యాయి. పంచాయతీ నిధులను వ్యయంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లతో పాటు గ్రామ కార్యదర్శులకు సంయుక్తంగా చెక్‌పవర్‌ను కట్టబెట్టింది ప్రభుత్వం. పంచాయతీ కార్యదర్శులకు చెక్‌పవర్ ఇవ్వడం రాజ్యాంగంలోని 73, 74 అధికరణకు విరుద్దమంటూ సర్పంచ్‌లు ఆందోళన బాట పట్టారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఒక్కో కార్యదర్శి రెండుకు పైగా పంచాయతీల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నిధుల వ్యయం బాధ్యతలను పూర్తిగా సర్పంచ్‌లకే అప్పగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే చెక్‌పవర్ వినియోగించడంలో పలు మార్గదర్శకాలు చేసింది. నిధులు డ్రా చేయడంలో నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత పంచాయతీ అధికారిపైనే ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు పంచాయతీ ఆమోదంతోనే సర్పంచ్ నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. క్యాష్‌బుక్‌తో పాటు సంబంధిత రిజిస్టర్లలో నిధుల వ్యయం వివరాలను నమోదు చేసిన తర్వాతే కార్యదర్శులు చెక్కులను సిద్ధం చేయాలని తెలిపింది. పన్నులు, తలసరి గ్రాంటు, 13వ ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధుల వ్యయంలో తమకే హక్కు ఉండాలంటూ సర్పంచ్‌లు ఇంతకాలం ఒత్తిడి తెస్తూ వచ్చారు. చెక్‌పవర్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డోకూరి రామ్మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.