విష్ణు రియల్ కెరీర్ మొదలయ్యింది ఇప్పుడే
‘‘ఒక నటుడికి పది సంవత్సరాలు సమయం అనేది పరిశ్రమ గురించి తెలుసుకోవడానికే సరిపోతుంది. విష్ణుకు నటుడిగా పదేళ్లు నిండాయి. ఈ వ్యవధిలో పరిశ్రమ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ఇప్పుడు తన రియల్ కెరీర్ స్టార్ట్ అయ్యింది. దానికి ‘దూసుకెళ్తా’ నాంది పలకనుంది’’ అని దాసరి నారాయణరావు అన్నారు. మంచు విష్ణు కథానాయకుడిగా వీరు పోట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దూసుకెళ్తా’. అరియానా, వివియానా సమర్పణలో డా.మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
దాసరి ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని కె.రాఘవేంద్రరావుకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘తమిళనాడులో దర్శకులందరూ రచయితలే. అయితే... ఇప్పుడు తెలుగులో కూడా రచయితలు దర్శకులవుతున్నారు. వారిలో చెప్పుకోదగ్గ దర్శక, రచయిత వీరు పోట్ల. ‘బిందాస్’ చూసినప్పడే తను మంచి దర్శకుడవుతాడనుకున్నా. ఈ సినిమాను తను తప్పకుండా బాగా తీసుంటాడు’’ అని నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘నా బిడ్డల గురించి నేను మాట్లాడను.
వారి సినిమాలే మాట్లాడతాయి. వారి కష్టాలకు తగ్గ ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నా’’ అని మోహన్‌బాబు అన్నారు. విష్ణు మాట్లాడుతూ -‘‘ ‘రావణ’ పనిమీద అమెరికా వెళ్లాను. ఉన్నట్టుండి నాన్న నుంచి వెంటనే రమ్మని ఫోన్. రాగానే... వీరు పోట్లతో మనోజ్ ఈ కథ చెప్పించాడు. నాతో పాటు ఇంట్లో అందరికీ ఈ కథ నచ్చడంతో చేశాను. ఈ విషయంలో మనోజ్‌కు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నా’’ అని చెప్పారు. ఇంకా మనోజ్, హన్సిక, మంచు లక్ష్మి, విరానికా, బి.గోపాల్, శ్రీను వైట్ల, బ్రహ్మానందం, అలీ, సునీల్, గిరిబాబు, రఘుబాబు, శ్రీవాసు, వరప్రసాదరెడ్డి, ప్రేమరక్షిత్, రజిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.